సునంద భాషితం ;-వురిమళ్ల సునంద ఖమ్మం
 యోగము...యోగ్యము
   *****
యోగము బాగుంటే ఏ పనులైన అవలీలగా పూర్తి చేసుకోవచ్చు.యోగములోనే వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలు, పట్టుదల, కృషితో  పాటు ఎంచుకున్న విషయాలు ఎలాంటివో,ఎంతటివో తెలుస్తాయి.
అంకిత భావం గల యోగముతో వ్యక్తి దశ,దిశ మారుతుంది.అన్నీ సమకూరుతాయి.యోగాన్ని సరిగా వినియోగం చేసుకుంటే జీవితంలో ఎన్నో సమస్యల్ని సునాయాసంగా అధిగమించవచ్చు.
యోగము అంటే పొద్దున్నే లేచి చేసే యోగా కాదు. మానసికమైన తెలివితేటలకే కాదు మరెన్నో అర్థాలను కలిగి ఉన్న పదము.
యోగము అంటే... ఉపాయము,ఎత్తుగడ, ప్రయత్నము, ఎత్తు, ఉద్యమము,జిగీష, ఉద్యోగము అనేవే కాకుండా ధనము,అర్థము, ఆదాయము,లిబ్బి,నిధి, సొత్తు, కవచము,కంకటము,కంచుకము, తొడుగు లాంటి అర్థాలు కూడా ఉన్నాయి.
ఏది ఏమైనా  యోగముతోనే సమాజంలో యోగ్యముతో కూడిన పేరు ప్రఖ్యాతులు వస్తాయి.యోగ్యము ఏ వ్యక్తి జీవితంలోనైనా ప్రముఖ పాత్ర వహిస్తుంది.
యోగ్యము మనిషిలోని సుగుణాలకు గీటురాయిగా నిలిచి ఆదరాభిమానాలు పొందేలా చేస్తుంది.
అలాంటి యోగ్యము అంటే ఏమిటో చూద్దాం... శ్రేష్టము ఉత్తమము,శ్రేయము, మేలు, మిన్న, పేరు,నాణ్యము, యుక్తము, ఔచిత్యము, అనువు,పాత్రము సమంజసము,అర్హము లాంటి అర్థాలు ఉన్నాయి.
యోగము,యోగ్యము మనిషికి, మనసుకు రెండు రెక్కలు. ఏదైనా సాధించాలన్నా, సమాజంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని తనదైన ఉనికిని అస్తిత్వాన్ని చాటుకోవాలనుకున్నా ఇవి రెండూ ఉండాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు