*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0229)*
 *రథ సప్తమి శుభాకాంక్షలతో.....*
బ్రహ్మ, నారద సంవాదంలో.....
వివాహానంతరం - శివపార్వతులకు పెండ్లివారికి వీడ్కోలు - సకల దేవతలకు వీడ్కోలు పలికి శంభుని కైలాస ప్రయాణం - పార్వతీ ఖండ శ్రవణ మహిమ.
*నారదా! పార్వతికి, పాతివ్రత్య పద్దతి చెప్పిన బ్రాహ్మణ పత్ని, మేనక వద్దకు వెళ్ళి, పార్వతిని పెనిమిటితో పంపడానికి ఇది అనువైన మంచి సమయము కనుక తగిన ఏర్పాట్లు చేసి కాళిని కైలాసానికి సాగనంప వలసినది అని చెప్పింది. ఆ మాటలు విన్న మేనక, మాతృ సహజమైన ప్రేమ ఉబికి రాగా, పార్వతిని అక్కున చేర్చుకుని, చిన్నతనము నుండి కాళి కేళీ విలాసం అంతా తలచుకొని ప్రేమతో కూడిన బాధను అనుభవిస్తోంది. రేపటి నుండి తన ఇంట ఈ చిన్నారి పాదాల చిరు మువ్వల సవ్వడులు వినిపించవు అని తలచుకుని రోదిస్తోంది. పార్వతి కూడా, తాను తన ఇంట అనుభవించిన ఆనందం, సంతోషం, ఆటలు పాటలు, తల్లితండ్రుల ప్రేమ, అనురాగము గుర్తు తెచ్చుకుంటూ రోదిస్తోంది. ఇలా తల్లీ కూతురులు ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు పలుకరించుకుంటూ, అనురాగాన్ని గుర్తు తెచ్చుకుంటూ శాస్వతంగా విడిపోతున్నాము అని బాధపడుతూ మూర్ఛను అనుభవించారు.*
*కైలాస ప్రయాణానికి పార్వతిని సిద్ధం చేయమని మేనకకు చెపుదామని వచ్చిన హిమాచలుడు, అక్కడ మేనకా పార్వతుల పరిస్థితి చూసి, వారిద్దరినీ మూర్ఛ నుండి మేల్కొలిపి, తమను విడిచి వెళ్ళబోతున్న పార్వతిని చూచి, వియోగ బాధను తలచుకుని బాధపడుతున్నాడు. అప్పుడు పురోహితులు, బ్రాహ్మణులు, "కన్న కూతురిని అత్తింటికి పంపకుండా ఉండడం ఏ తల్లితండ్రలకు అయినా కష్టమైన పనే. కానీ, లోకాచారము పాటించి పంపక తప్పదు" అని మేనకా హిమవంతులకు నచ్చ చెప్పారు. అందువల్ల, "త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయండి. మంచి సమయం దాటిపోతుంది" అని హెచ్చరికగా చెప్పారు. అప్పుడు, మేనకా హిమవంతులు, ధైర్యం కూడగట్టుకుని పార్వతిని సాగనంపటానికి అందమైన పల్లకీ తెప్పించి, పార్వతిని అందులో కూర్చుండబెట్టారు. పార్వతికి అనేక బహుమతులు ఇచ్చారు. శంభుడు వేచి వున్న ఉపవనం దగ్గరకు వచ్చి, మేనకా హిమవంతులు పార్వతిని అప్పచెప్పి, శివ పరివారానికి సకల దేవతలకు, మహర్షులకు వీడ్కోలు పలికారు.*
*అంబా సహితుడైన శంకరుడు కైలాసానికి చేరి పార్వతితో "నీవు ఎల్లప్పుడూ నా ప్రాణ సఖివే. నీ పూర్వ జన్మ విషయములు, నీకు గుర్తు వుంటే, నాకు చెప్పు" అని అడిగారు. "నాకు అన్ని విషయములు గుర్తు వున్నాయి. కానీ, ఇప్పుడు జరుగ వలసిన విషయము చూడండి" అని చెప్పిన పార్వతి తమ వెంట వచ్చిన సకల దేవతలకు ప్రయాణ బడలిక తీరే పానీయాలు ఇచ్చి, ఆ తరువాత చక్కని విందు భోజనం ఏర్పాటు చేసారు. శివ పరివారం అందరూ ఈ పనులలో పాలు పంచుకున్నారు. వీదు భోజనం అయిన తరువాత, దేవతా సమూహమంతా, శివాశివుల కళ్యాణ సంరంభాన్ని కీర్తంచి, ఉమామహేశ్వరుల నుండి వీడ్కోలు పొంది తమ తమ నెలవులకు వెళ్ళారు. భగవంతుడు అయిన శివుడు, పార్వతి తో కూడి కైలాసంలో నివాసం ఉన్నారు.*
*నారదా! ఇది మంగళ కరమైన శివాశివుల వివాహ వర్ణన. ఈ కథ శోకమును పోగొట్టి, ఆనందము, సంపద ఇచ్చి, ఆయువును వృద్ధి చేస్తుంది. పార్వతీ శంకరులను మనసులో నిలుపుకున్న జీవుడు పవిత్రుడు అవుతాడు. ఈ కథా కథనం జరిగిన ప్రదేశంలో అన్ని మంగళకరమైన కార్యక్రమాలు జరుగుతాయి. అన్ని కోరికలు నెరవేరుతాయి. ఇది సత్యము. ఇదే సత్యము. ఏ మాత్రము సందేహానికి తావులేదు.*
*శ్రీ శివ మహా పురాణములో, రుద్రసంహితలో పార్వతీ ఖండము సంపూర్ణము.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు