*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* -*రుద్ర సంహిత - చతుర్థ (కుమార) ఖండము-(0230)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*రుద్ర సంహిత యొక్క - చతుర్థ (కుమార) ఖండము - ప్రారంభము*
దేవతలు స్కందుని శివపార్వతుల దగ్గరకు తీసుకుని రావడం - శివుడు, తారకుని వధకు కార్తికేయుని ఇవ్వడం - మహీసాగర సంగమము దగ్గరకు తారకుడు రావడం - రెండు సేనల పోరు - వీరభద్రుడు, శ్రీహరి తారకునితో యుద్ధం చేయడం.
*శ్లో:- వందే వందనతుష్టమానసమతిప్రేమప్రియం ప్రేమదం | పూర్ణం పూర్ణకరం ప్రపూర్ణ నిఖిలైశ్వర్యైకవాసం శివమ్ | సత్యం సత్యమయం త్రిసత్యవిభవం సత్యప్రియం సత్యదం | విష్ణుబ్రహ్మ నుతం స్వకీయకృపయోపాత్తాకృతిం శంకరమ్|*
*నమస్కారిండం వలన ఆ పరమశివుడు మనకు ప్రసన్నమౌతారు. ప్రేమ ఆయనకు ప్రియమైనది. ప్రేమను పంచే పూర్ణ ఆనందమయుడు, వృషభవాహనుడు. భక్తుల కోరికలు తీర్చే అన్ని ఐశ్వర్యములకూ నెలవైన వారు. కళ్యాణ స్వరూపుడు. సత్యానికి రూపం ఉంటే అది శంకరుని రూపం అవుతుంది. ఆయన సత్యమయుడు. ఆ స్వామి ఇచ్చే ఐశ్వర్యము మూడు కాలములలో కూడా బాధారహితమైనది. పరమేశ్వరుడు సత్యాన్నే ప్రేమిస్తూ, సత్యాన్నే ఇస్తాడు. బ్రహ్మ, విష్ణువు లచేత కీర్తింపబడిన వారు.  ఈశానుడు, స్వేచ్ఛగా శరీరధారణ చేస్తారు. అటువంటి శంకర భగవానునికి నమస్కరిస్తున్నాను.*
*బ్రహ్మ దేవునితో నారదడు, "అందరికీ శుభములను కలుగచేసే తండ్రీ! పరమాత్మ అయిన శంకరుడు సర్వసమర్థుడు, ఆత్మారాముడు అయి కూడా, సంతానోత్పత్తి కోసం పార్వతిని వివాహం చేసుకున్నారు. వారికి కుమార జననం ఎలా జరిగింది? తారకాసుర వధ ఎలా జరిగింది? పరమేష్టీ! నామీద దయతో, ఈ కథను సంపూర్ణంగా నాకు చెప్పండి" అని ప్రార్ధించాడు.*
*అప్పుడు శివుని ఆజ్ఞతో సృష్టి కార్యము చేసే బ్రహ్మ, నారదునికి, కుమారస్వామి గంగకు జన్మించుట, కృత్తిక మొదలైన ఆరుగురు స్త్రీల చేత పెంచబడటం, వారిని సంతోష పెట్టడానికి ఆరు ముఖములను ధరించి "షణ్ముఖుడు" అవడం, కృత్తిక చేత పెంచబడుటం వల్ల "కార్తికేయుడు" అవడం చెప్పి, తరువాత కార్తికేయుడు, గిరిజాశంకరుల సంరక్షణలోకి వచ్చిన కథను కూడా చెప్పాడు.*
*నారదా! శంకరులు తన ఒడిలో షణ్ముఖుని కూర్చుండ బెట్టుకొని ఎంతో ప్రేమను, సంతోషాన్ని అనుభవిస్తూ, కార్తకేయుని అనురాగం తో చూస్తున్నారు. పార్వతి మనసు కుమారుని చూసి అత్యంత ఆనందంతో నిండిపోయింది. పార్వతి కుమారునికి అత్యంత ఐశ్వర్యమును ఇచ్చి, చిరంజీవిగా చేసింది. లక్ష్మీ దేవి సంపదను,సరస్వతీ దేవి సకల శాస్త్రాలను ఇచ్చారు. కైలాసంలో ఆనంద కోలహలం జరుగుతోంది. దేవతలు అందరూ కుమారునికి ప్రేమతో, భక్ష్య భోజ్యాలు, సంపదలు ఇచ్చారు. మంగళ తూణీరాలు, బాజా భజంత్రీలు హోరు సలుపుతున్నాయి. శివాశివుల ఆనందానికి హద్దుకు లేవు. ఆ సమయంలో, దేవతలు మహాదేవునితో, "సర్వజగద్రక్షకా! పరమేశా! మా విన్నపము దయతో ఆలకించండి. తారకాసురుని దాష్టీకం ఈ భూమి మీద ఎక్కువ అయ్యింది. తారకుడు, కుమారుని చేత మాత్రమే వధింపబడతాడు. ఈ కుమార సంభవము కోసమే ఉమాశంకరుల వివాహం అనే మీ ఉత్తమ చరిత్ర జరిగింది. మూడు లోకాల సౌఖ్యం కొరకు షణ్ముఖుడు తారక సంహారం చేయాలి. అందువలన, మీరు కార్తికేయునికి తారకాసుర సంహారం చేయడానికి అనుమతి ప్రసాదించండి. మేము అందరమూ, కార్తికేయుని వెంట వెళ్ళి తారకాసురినితో యుద్ధంలో పాల్గొంటాము." అని వేడుకున్నారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు