*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - చతుర్థ (కుమార) ఖండము-(0231)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
దేవతలు స్కందుని శివపార్వతుల దగ్గరకు తీసుకుని రావడం - శివుడు, తారకుని వధకు కార్తికేయుని ఇవ్వడం - మహీసాగర సంగమము దగ్గరకు తారకుడు రావడం - రెండు సేనల పోరు - వీరభద్రుడు, శ్రీహరి తారకునితో యుద్ధం చేయడం.
*నారదా! తారకాసుర వధ జరగడానికి షణ్ముఖుని తమకు ఆధిపతిగా పంపమని ప్రార్ధించిన దేవతల మాటలు విన్న శంకరుని హృదయం దయ, కరుణ, భక్త పక్షపాతం తో నిండిపోయింది. ఆ కరుణామయుడైన శివుడు, దేవతల కోరిక తీర్చడానికి, కార్తకేయునికి సైన్యాధిపత్యం ఇచ్చి, కార్తికేయుని ఆశీర్వదించి వారి వెంట పంపారు. షణ్ముఖుడు, తమ వెంట వున్నారు అనేవాలోచన ఇచ్చిన ధైర్యంతో దైవ సేనలు తారకాసురుని తో యుద్ధానికి సన్నద్ధం అయ్యారు.*
*కార్తికేయుని సారధ్యంలో మనం తారకాసురుని జయంచగలము అనే ఆలోచన ఇచ్చిన ఉత్సాహంతో దేవసైన్యం చాలా ఉత్సాహంగా ఉరకలు వేస్తోంది, రణభూమి చేరుకోడానికి. శంకరుని తేజస్సుతో, ఆశీస్సులతో సుసంపన్నమైన షణ్ముఖుడు వెంటరాగా, దేవతల యొక్క విశాల సైన్యం, రణభూమి అయిన మహీ సాగర దిశగా కదిలింది. దేవతల యొక్క ఈ రణ సంరంభం గురించి తెలుసుకొన్న తారకాసురుడు కూడా తన అశేష సేనావాహినిని వెంటబెట్టుకొని మహీసాగర సంగమానికి వస్తున్నాడు. అలా వస్తున్న తారకాసురుని సేనను చూచి, దేవతా సైన్యం తమని తాము ఉత్సాహ పరచుకుంటూ, సింహనాదాలు చేస్తున్నారు.*
*ఇలా యుద్ధోత్సాహం కనబరుస్తున్న దేవ సైన్య సమూహాన్ని ఉద్ధేశించి అశరీరవాణి, "మీరు కుమారస్వామి అద్యక్షతన రాక్షస సైన్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ యుద్ధం లో మీకు తప్పక విజయం సిద్ధిస్తుంది. ఇది శంకరుని తలంపు" అని పలికింది. ఈ అశరీరవాణి పలుకులు దేవ సైన్య సమూహానికి కొత్త ఊపిరులు ఊదినట్లైంది. మహీ సాగర సంగమం దేవ దైత్య సైన్య సమూహాలతో నేల ఈనిందా అన్నట్లుగా ఉంది. అసుర సేనలు, ప్రళయకాల గర్జనల వలె రణభేరులు, కర్కశ శబ్దములు చేసే వాయిద్యాలు మ్రోగుతున్నాయి. వారి పద ఘట్టనలతో భూమి కంపిస్తోంది. అంత కోలాహలముగా ఉన్న దైత్య సేనను చూసి కూడా, కార్తికేయుడు తమ పక్షాన ఉన్నాడు అనే ఒక్క ఆలోచనతో, ఏ మాత్రము భయాన్ని దగ్గరకు రానివ్వకుండా ఉన్నారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు