*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 051*
కందం:
*ధరణీజాతములే యే*
*తరి నెట్లట్లను ఫలించుఁదగనటు పూర్వా*
*చరణ ఫలంబు ననుభవము*
*గరమనుభవనీయమగును గాదె కుమారా !*
తా:
కుమారా! ఈ భూమి లో నుండి వచ్చిన చెట్లు, వృక్షాలు, అడవులు ఏ ఏ ఋతువులలో ఏ ఏ పూలు, పండ్లు ఇవ్వాలో ఆయా సమయాలలో ఇస్తూనే ఉన్నాయి. అలాగే, ఈ భుమి మీద పుట్టిన ప్రతీ జీవి, మనిషి కూడా వారి వారి పూర్వ జన్మలో చేసిన కర్మ ఫలమును అప్పటికప్పుడు అనుభవిస్తారు. కానీ, ఇంకొక జన్మ వరకు ఆగడం కుదరదు........... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ధర్మం నాలుగు పాదాలా భూమి మీద నడుస్తున్న ధర్మయుగంలో, అసలు తప్పులే చేసేవారు కాదట మానవులు. ఒకవేళ జరిగితే, తరువాత చూసుకుందాములే అనుకున్నారు, ధర్మదేవత. త్రేతాయుగములో, ద్వాపరయుగంలో జరిగిన తప్పులకు తరువాతి జన్మలో శిక్ష విధించారు, ధర్మదేవత. మరి ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము. ఇప్పుడు ధర్మదేవతకు కూడా ఓపిక తక్కవ అయ్యింది. ధర్మదేవత కూడా ఎప్పటి తప్పుకు, అప్పుడే శిక్ష వేసేస్తున్నారు. తప్పులు జరగనే కూడదు. జరిగినప్పుడు వాటి ఫలితం కూడా వెంటనే అనుభవించాలి. ఇదే కలియుగ ధర్మం. అందుకే, మనమందరం సాధ్యమైనంత వరకు తప్పులు, నేరాలు చేయకుండా, ధర్మ మార్గంలో నడవడం అలవాటు చేసుకోవాలిసిన అవసరం కచ్చితంగా ఉంది. అలా నలుగురూ మెచ్చే ధర్మ మార్గంలో నడిచే సదవకాశాన్ని పరమేశ్వరుడు మనకు ఇవ్వాలని....... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss 

కామెంట్‌లు