*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 052*
 కందం:
*పెను కోపము గర్వము ను*
*బ్బును జపలము దురభిమానము నిర్వ్యాపారం*
*బునుఁ జొరవు నునికియును న*
*ల్పున గుణము లటంచు దెలివిబొందు కుమారా !*
తా:
కుమారా! ఎక్కవగా కోపము, అతిగా గర్వము, అకారణముగా పొంగి పోవుట, స్థిరత్వము లేకుండా నిలకడ లేని బుద్ది కలిగి ఉండటం, అవసరానికి మించి అభిమానము కలిగి ఉండటం, ఏ పనీ లేకుండా ఉండటం, మితిమీరిన చనువు ప్రదర్శించడం, ఇవన్నీ నీచులు, దుర్మార్గుల గుణములు అని తెలుసుకో నాయనా!........... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ఈ రోజుల్లో, మనం మన చుట్టూ ఉన్న సమాజంలో చూచే చాలా మందికి ఉన్న, అన్ని లక్షణాలను కవి ఆనాడే పరిచయం చేసారు. ఈనాడేమిటి, ఆనాడేమిటి? ఏనాడైనా ఇటువంటి లక్షణాలు కలవారు సమాజంలో కుప్పలు తెప్పలుగా ఉంటూనే ఉన్నారు. కానీ, ఈ లక్షణాలను కలిగిన వారు, ఏనాడూ బాగుపడిన దాఖలాలు సమాజంలో లేవు. బాగుపడే అవకాశమూ లేదు. ఎందుకంటే, పదిమంది బాగుండాలి అందులో నేనుండాలి అని మనము అనుకుని, ఆచరించి నప్పుడే సమాజం సుఖసంతోషాలతో ఉండ కలుగుతుంది. కాబట్టి, ఈ అనవసరమైన, పనికిరాని లక్షణాలను వంటికి, మనసుకి పట్టించుకోకుండా నలుగురికీ ఉపయోగ పడేలా మనమందరం మన జీవనాన్ని సాగించే సదవకాశాన్ని ఇవ్వమని ....... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు