తిరుప్పావై 28 వ పాశురం ; - సి. మురళీమోహన్
(శ్రీమతే రామానుజాయనమః)
(మీరు కోరుతున్న ఫలాన్ని పొందడానికి మీకు ఏమి అర్హత ఉందో చెప్పండని‌  
శ్రీ కృష్ణుడు గోపికలను అడుగుటే ఈ పాశురము)

కఱవైగళ్ పిన్ శెన్ఱు! కానం  శేరుందు ఉణ్బోమ్
అఱివు ఒన్ఱుమ్ ఇల్లాద ఆయ్ కులత్తు ఉన్దన్నై
ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడై యోమ్
కుఱై ఒన్ఱుమ్ ఇల్లాద గోవిందా ఉన్దన్నోడు
ఉఱవేల్ నమక్కు ఇఙ్గు ఒழிక్క  ఒழிయాదు
అఱియాద పిళ్ళైగళోం అన్బినాళ్ఉన్దన్నై
శిరుపేర్ అழைత్తనవుం  శీఱియరుళాదే
ఇఱైవా నీ తారాయ్ పఱైయె ఏలోరెంబావాయ్
 
ప్రతిపదార్థాలు:

కఱవైగళ్ పిన్ శెన్ఱు~ ఆవులను ఆవు దూడలనూ తోలుకుంటూ పోతూ;
కానమ్ శేఱున్దు ఉణ్ బోమ్~ అడవిని చేరి 
జీవించు చున్నాము;

అఱివు ఒన్ఱుమ్ ఇల్లాద~ తెలివితేటలు కొంచమైనా లేని అమాయకులము;

ఆయ్ క్కులత్తు ఉందన్నై పిఱవి~
 గొల్లకులమున పుట్టిన మేము,  మా
 కులమున నీవు పుట్టుట వలన;

పెఱున్దనై పుణ్ణియమ్ యామ్ ఉడైయోమ్ ~ 
నిన్ను సేవించుకొను 
పుణ్యమును మేము పొందినాము;

కుఱై ఒన్ఱుమ్‌ ఇల్లాద గోవిందా~
 కొరత కొంచమైనా లేని గోవిందా!

ఉందన్నోడు ఉఱవేల్ ~ నీ తోడ మాకున్న సంబంధమును;
నమక్కు ఇంగు~
 మా నుండీ ;

ఒழிక్క ఒழிయాదు ~ పార్రద్రోలుటకు (వేరు చేయుటకు) సాధ్యము కాదు;

అఱియాద పిళ్ళైగళోమ్~ తెలివితక్కువ అమాయకులము మేము;
అన్బినాళ్ ఉన్దన్నై~  ప్రేమతో ‌నిన్ను;

చిరుపేర అழைత్తనవుమ్~ చిన్న పేరుతో పిలిచినామని ఎక్కడైనా;

శీఱి అరుళాదే~
 దోషమేమైనా దొర్లి వుంటే కోపగించుకోవద్దు 
కన్నయ్యా;

ఇఱైవా నీ తాఱాయ్ పఱై ఏలో రెంబావాయ్ ~ కన్నయ్య రాజా మా కోరికను మన్నింపుమయా 
స్వామీ!
 
భావము:
 
కన్నయ్యా! మేము 
ఆవులనూ ఆవు 
దూడలనూ మేపుటకు 
అడవులకు తోలుకుని 
పోయి జీవితాన్ని 
గడుపుకొను గొల్ల
 పిల్లలము. 
 ప్రపంచ వ్యవహార 
జ్ఙానము,
 నాగరికత లేని మా గొల్ల
కులమున నీవు 
అవతరించుట మా అందరి భాగ్య విశేషము. పొర 
పొచ్చములు లేక కలసి మెలసి తిరుగుచున్న మనయొక్క ఈ 
బంధాన్ని విడదీయుటకు ఎవరికీ సాధ్యము కానే 
కాదు.
 
ఓ కన్నయ్య రాజా! తెలివిమాలిన, తారతమ్యమెరుంగని మేము గోవులతో 
మెలగుట వల్ల నీ గొప్పదనము తెలియలేక, కృష్ణా 
అనీ, కన్నయ్యా అనీ, ఓ 
సఖా అనీ, ఏరా అనీ నిన్ను పిలిచి అగౌరవపరచినాము.  అట్లని మాపై ఏమాత్రమూ
 కోపగించవద్దు. నిన్ను అర్థించుచున్నాము ~ మా
 కోరికలను 
ఈడేర్చుమయ్యా స్వామీ!
 
వ్యాఖ్య:
 
ముక్త పురుషుడు పరమ
పదమున పరమాత్మతో 
కలసి అనుభవించు 
భోగమునే గోపికలు 
వెనుకటి పాశురములో 
కోరినారు.  అలా 
అనుభవించుటకు కావలసినవేవో ఈ పాశురమున అడుగుతున్నారు. సాంగ
వేదాధ్యయనము చేయాలి ~ 
అర్థజ్ఞానాన్ని పొందాలి ~ 
వేదవిహితమైన వర్ణాశ్రమాచార ధర్మాలను పాటించాలి. అప్పుడు 
పాపాలు నశించి మనశుద్ది 
ఏర్పడుతుంది. 
ఇంద్రియములను 
విషయాలనుండీ వెనుకకు మరలించి మనసును
 ఆత్మయందు నిలపాలి. అలా ఆత్మ 
సాక్షాత్కారమయిన 
తరువాత పరమాత్మ
యందు 
మనస్సును లగ్నము 
చేయ్యాలి. .ఇవేవీ తమవద్ద లేవని ఆకించన్యమును అనన్యగతిత్వమును 
నివేదించాలి. భగవంతుడే ఉపాయమని నమ్మిన
వాడు భగవంతుని 
సమీపములో  భగవంతుని చేరుటకు 
సాధనముగా తాము 
ఆచరిించిన పుణ్యకర్మలేవియూ లేవని చెప్పాలి; 
తనకే యోగ్యతలేదని ‌
నివేదించుటకు భగవత్సన్నిధిలో తన నికృష్టతను 
తానే చెప్పాలి; తన 
పుణ్యమంతా భగవానుడు అనంత 
కల్యాణ గుణపరిపూర్ణుడవగుటయే అని తెలుసు
కోవాలి; అనంత‌  కల్యాణ గుణపరిపూర్ణుడగు 
స్వామితో తనకు విడదీయరాని 
సంబంధమున్నదని 
తెలియాలి; 
తాను ఇదివరకూ చేసిన 
అపచా రాలకు ~ 
ఉపచారభావముతో చేసిన అపచారాలకు క్షమాపణ వేడుకోవాలి; నీవే మాకు ముందు ఉపాయముగా ఉండి 
ఫలమును అనుగ్రహింపుమని  కోరాలి. ఇదే 
సత్కర్మాభావ విజ్ఞాపనము ~ స్వనికర్షాను సంధానము ~ ఈశ్వరగుణపూర్తి ~ సంబంధ జ్ఞానము ~ 
పూర్వాపరాధ
క్షామణము భగవదేకోపాయత్వ స్వీకారము ~ అను ఆరింటిని ఈ పాశురమున వివరించు చున్నారు.
 భగవంతుడే  
ఉపాయమని ఆశ్రహించువారు అన్ని ఉపాయాలనూ విడవాలి. అలా విడుచుటపలు విధములుగా 
ఉంటాయి. వాటిని 
ఆచరించ జాలని వాడు 
అలా అ‌ని తెలుపుకోవాలి. ఇవే ఈ పాశురమున 
వివరించ
బడిన స్వాపదేశార్థము.
 
అనువాద సీస పద్యం:
 
ఆలదూడల వెన్క నడవికి బోవుటే
దేహయాత్రోపాధి దేవ! మాకు
తెలివిమాలిన గొల్ల‌ కులమున దేవర!
పుట్టుట మా పూర్వ పుణ్యఫలము;
కొరత యింతయులేని గోవింద! మన కున్న
ఈ బంధమును బాప నెవరి తరము?
తెలిసి తెలియక నిన్ను వలపు బలుపున జేసి
హే కృష్ణా! హే గోప! హే సఖా య
 
టంచు బిలిచిన పలుకుల ‌నెంచుకొనక
తెల్ల దామర పూవుల దెగడు కనుల
సంజకెంజాయ సౌరనీక సరస లోచ
నాంత కాంతుల బరపు మా వంతలడగ!
           
 (ఆణ్డాళ్ దివ్య తిరువడి గళే శరణమ్)

🌹🙏🌹

కామెంట్‌లు