ఆకు గెలిచింది!!!?;-ప్రతాప్ కౌటిళ్యా
ఆకుల వర్షంలో
లోకం కొట్టుకుపోతుంది
గుహల్లో పుట్టిన మనిషి
కౄరమృగాల
ముఖాల్లో దాక్కుంటున్నాడు!!?

పరిచయం లేని ఆకులు
సముద్రాన్ని ఆక్రమించాయి
ఆకుల లోకంలో
అందరూ అనాధలు అయ్యారు!!

ఆకు ఆకుపచ్చగా లేదు
పచ్చి నెత్తురులా ఉంది
వెంట్రుకలు మలిచిన ఆకు ఆకారం
అచ్చం అమ్మోరులా ఉంది!!?

అర్ధరాత్రి సూర్యుడిని హతమార్చిన
ఆకు స్వచ్ఛమైనది!!

ఎదురు తిరిగిన గాలిని
నదిలా మార్చి మార్గాన్ని
మార్చి మార్చి పరిగెత్తించింది!!!

సందేశం ఇస్తున్న ఆకాశాన్ని
గొంతు నొక్కేసింది
ఊపిరాడని సందేశాలన్నీ నీళ్లపాలయ్యాయి

నిజం తెలుసుకుందామని
మేఘం గర్జిస్తే
ముఖం చిట్లి వేయ్యి ముక్కలైంది!!

నిప్పు అంటించాలని ప్రయత్నం ఏమో
కుప్పకూలిన మట్టి
ప్రాణం వదిలిపెట్టింది!!!

వెనకనుంచి ఏవో సంకేతాలు కాబోలు
వేల ఏళ్ల భద్రపరిచిన భవిష్యత్తు
అంతా ఆకులతో కలిసి
చిత్తు కాగితంలా మారిపోయింది!!?

ఇంతకు
ఎవరు చేస్తున్నారు ఇదంతా
చరిత్ర చరిత్ర అని
కొట్టుకు చచ్చిన చిట్టి చీమలు
గండు చీమలను
రెచ్చగొట్టినట్లుంది!!!

ఆకులను తిన్న చీమలన్నీ
ఆకాశంలో కలిసిపోయాయి!!

మాట్లాడుతున్న ఆకులు
అర్థం కాని మనుషులు జంతువులు
ఒకటే గోల
పెద్ద గందరగోళం
ఆకులు రాలటం కాదు
ఆకుల వర్షంలో ప్రాణవాయువు
ప్రాణం విడిచింది!!!

ఎక్కడో దూరాన దొరికిన గాలిని
ఎదుర్కొనే ఏకైక ఆయుధం
ఆకు ఇప్పుడు!!!

నీళ్లను దిక్కరించిన అజాతశత్రువు
ఆకు కాదు ఇప్పుడు
పరమ శత్రువు!!

పచ్చని ఆకులు పట్టుకునే
యోధుడు లేడిప్పుడు
ఆకు అనంత వాయువుల్ని జయించింది!!?

రెండు కళ్ళు అంటించుకున్న ఆకు
లోకం ఎక్కడ దాగుందో వెతుకుతుంది!!!

చిన్న శబ్దమైన సరే
చెవులను నిక్కపడుచుకునే ఆకుకు
అంతా అర్థమవుతుంది ఇప్పుడు!!?

ఒక్క మెదడు తప్ప అన్ని
ఆకూ ఆక్రమించింది
గుహల్లోని క్రూర మృగాల ముఖాల్లో
దాగిన మనిషి తలను
ఆకు సవాలు చేసింది!!!

మనిషి తలనుకు రివార్డు ప్రకటించింది
ప్రాణ వాయువును విడిచిపెడతానని
రాయబారం నడిపింది!!

తొలిసారి మనిషి తల
ఆకుకూ భయపడింది

అనంత వాయువుల్లో కలిసే కన్నా
ప్రాణవాయువును విడిపించు కుంటే చాలని
తల వంచింది తలదించింది
ఆకు అంతరించకుండా గెలిచింది!!!
===========================
ప్రతాప్ కౌటిళ్యా
నాగర్ కర్నూల్ జిల్లా
తెలంగాణ 508208
830952 9273
బయోకెమిస్ట్రీ లెక్షరర్ పాలెం కళాశాల నాగర్ కర్నూల్

కామెంట్‌లు