ద్వారపూడి అయ్యప్ప స్వామి దివ్య క్షేత్రం;-: సి.హెచ్.ప్రతాప్
 ద్వారపూడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక గ్రామం. ఈ గ్రామం రాజమండ్రి నగరానికి 18.6 కిలోమీటర్ల దూరంలో ఉండి, కేవలం అర్ధగంటలో(30 నిమిషాల్లో) చేరుకొనే విధంగా ఉంటుంది. ద్వారపూడి గ్రామానికి అసలు పేరు ప్రఖ్యాతులు అయ్యప్ప స్వామి ఆలయం వలనే వచ్చిందని చెప్పాలి. ఇక్కడున్న అయ్యప్ప ఆలయం గర్భగుడి, కేరళ లోని శబరిమలై తరహాలో నిర్మించడం విశేషం.
ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్సేత్రంగా వెలుగొందుతున్న మన ద్వారపూడిలో వెలిసిన ఈ ఆలయ సముదాయంలో అయ్యప్ప దేవాలయంతోబాటు, సాయిబాబా, శివాలయాలు కూడా వున్నాయి. విశాలమైన ప్రాంగణంలో వున్న ఈ దేవాలయాలు దర్శకులను అమితంగా ఆకర్షిస్తాయి. నిత్యం తిధి, వారం, మాసంతో సంబంధం లేకుండా ఈ క్షేత్రం భతులతో కిట కిటలాడుతుంటుంది. అయ్యప్ప దీక్ష తీసుకున్నవారిలో కొందరు కారణాంతరాలవల్ల శబరిమలదాకా వెళ్ళి స్వామి దర్శనం చెయ్యలేకపోవచ్చు.  అలాంటివారు  ఇక్కడికి వచ్చి స్వామికి ఇరుముడి సమర్పించుకుంటారు. శబరిమలై కు వెళ్ళిన ఫలమే ద్వారపూడిలో ఈ స్వామిని దర్శించుకున్నా వస్తుందని ఇక్కడి శాసనాలు, క్షేత్ర మహత్యం చెబుతొంది.  ఇక్కడ ప్రతిష్టింపబడ్డ అయ్యప్పస్వామి విగ్రహం పంచలోహాలతో తయారు చేసినది.  1989 లో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిచే ప్రతిష్టింపబడినది.  ఈ స్వామి సన్నిధికి చేరటానికి ఏర్పాటు చేసిన పధ్దెనిమిది  మెట్లకి కూడా ఒక విశేషం వున్నది.  ఈ పధ్దెనిమిది  మెట్లనూ తమిళనాడులోని తురుమూరునుంచి తెప్పించిన ఏక శిలపై చెక్కి, బంగారంతో తాపడం చేయించారు.  ఇరుముడితో వచ్చిన భక్తులను మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అనుమతిస్తారు.  ఆలయ ప్రాంగణంలో వున్న హరిహరుల విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. అయ్యప్ప దేవాలయంలో క్రింది భాగంలో వర్తులాకార హాలులో దుర్గ, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, వివేకానంద, రామకృష్ణ పరమహంస, వేమన వగైరా గురువర్యుల విగ్రహాలు చుట్టూ వున్నాయి. పై అంతస్తులో హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి నిత్య పూజలందుకుంటున్నాడు. అయ్యప్ప స్వామి ఆలయంలోంచి ప్రక్కనే వున్న సాయిబాబా ఆలయానికి త్రోవ వున్నది. బాబా దర్శనమైనాక వెనుక వైపు వెళ్తే శయనించివున్న పెద్ద రంగనాధ స్వామి విగ్రహం కనబడుతుంది. ఆ స్వామిని సేవించుకుని బయటకు వస్తే ఆ మార్గం ఎత్తుగా వున్న పెద్ద నందీశ్వరుని దర్శనం మనకు లభిస్తుంది.దగ్గరకు తీసుకు వెళ్తుంది. నందీశ్వరునికి ఎదురుగా పాలరాతితో నిర్మించబడిన నాలుగంతస్తుల శ్రీ ఉమా విశ్వేశ్వరస్వామి ఆలయం దర్శించుకోవచ్చు.  

కామెంట్‌లు