సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -12
అశ్మలోష్ట న్యాయము
   *****
అశ్మ అంటే రాయి. లోష్ట అంటే మట్టి. రాయితో మట్టి ముద్దను పోల్చి చూస్తే రాయి కంటే మట్టి ముద్దే మెత్తనిది అని తెలుసు.
అదే మట్టి ముద్దను దూదితో పోలిస్తే మట్టి కంటే దూదే మరీ మెత్తనిది అని తెలుస్తుంది.
ఇలా ఒకదానితో ఒకటి రాయిని మట్టితో పోల్చి చూడటాన్ని అశ్మలోష్ట న్యాయము అంటారు.
ఇదే న్యాయంతో మనుషుల వ్యక్తిత్వాలను పోల్చి చూద్దాం.
కఠినమైన పాషాణం లేదా రాయిలాంటి మనుషులు కొందరు ఉంటారు.ఎప్పటికీ మారరు. ఎలాంటి సంఘటనలూ వారిని మానవీయ మనుషులుగా మార్చవు.అంటే కరడుగట్టిన దుష్టత్వం వారిలో వుంటుంది.
అదే మట్టి బెడ్డ లాంటి వారు చూడటానికి గట్టిగా ఉన్నా  కొన్ని సందర్భాలు వారిని కరిగించి మంచి వారుగా మారుస్తాయి. మానవతా విలువల వైపు అడుగులు వేయిస్తాయి.
ఇక దూది లాంటి వారి మనసు ఎప్పుడూ మెత్తనిదీ సున్నితమైనదే.
మట్టిబెడ్డ దూది కంటే కఠినమే  అయినా రాయి కంటే మెత్తనిదే అనడాన్ని  అల్పుడైన పాషాణ హృదయుడి కంటే  మట్టి బెడ్డ లాంటి వారే నయమని చెప్పడానికి ఈ న్యాయాన్ని ఉదాహరణగా చెబుతుంటారు.
దీనినే 'గుడ్డికంటే మెల్ల నయం కదా 'అనడం  వింటుంటాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు