రథసప్తమి విశిష్టత
 నమస్సవిత్రే జగదేక చక్షుషే 
జగత్ప్రసూతి స్థితినాశ హేతవే ! 
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే 
విరించి నారాయణ శంకరాత్మనే !! 
మాఘ మాసము అనగానే రథసప్తమి స్ఫురిస్తుంది. మాఘ శుద్ధ సప్తమిని రథసప్తమి అంటాము. మాఘ శుద్ధ సప్తమిన అదితి కశ్యపులకు జన్మించిన శ్రీ సూర్య నారాయణుడు, పుట్టగానే ఒక అద్భుతమైన రథమునెక్కి లోక రక్షణ కోసం పయనం ప్రారంభించిన రోజు రథసప్తమి. 
అసలు రథసప్తమి అంటే ఏమిటి ? ఎందుకు ఆ పేరు వచ్చింది ? ఆ రోజున ఏ దైవమును ఎలా ఆరాధించాలి ? ఇలా అనేక సందేహాలు కలుగుతాయి. 
ఏ సప్తమి రోజున ఆకాశంలో నక్షత్రాలన్నీ ఒక రథము ఆకారంలోకి వస్తాయో, ఆ రోజును "రథసప్తమి" అంటాము. ఈ విశ్వంలో కేవలము శ్రీ సూర్య నారాయణ స్వామి మాత్రమే ఏడు కిరణములు కలిగి, ఒకే ఒక చక్రం కలిగిన, ఏడు గుఱ్ఱములతో లాగబడుతున్న, అనూరువైన సారథితో నడపబడుతున్న రథమెక్కి  అంతరిక్షంలో మన మాంసనేత్రముతో చూడగలిగే దైవములా ప్రత్యక్షమై, ప్రపంచం మొత్తానికి కాంతిని, వెలుగును, వేడిమిని, అపారమైన ప్రాణశక్తిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, కాలస్వరూపుడై పగలు, రాత్రులను ఏర్పరుస్తూ, ఏ మాత్రమూ చలనము లేకుండా స్థిరంగా ఉంటూ కూడా మనకు - మానవులకు ఉదయం తూర్పున ఉదయాద్రి నుంచి ఉదయిస్తున్నట్లూ, సాయంత్రం పడమరన పశ్చిమాద్రిలోకి అస్తమిస్తున్నట్లూ దర్శనమిస్తాడు. అటువంటి అద్భుత దివ్య మూర్తి ఎక్కిన రథము యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ, సప్తమి తిథిన ఆవిర్భవించిన శ్రీ సూర్య నారాయణుని పుట్టిన రోజును, సూర్య భగవానునికి అత్యంత ప్రియమైన సప్తమిని "రథసప్తమి" పేరుతో జరుపుకుంటున్నాము.
"రథస్థం భాస్కరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే", అంటారు. 
ఎన్నో లక్షల ఏళ్ళ క్రిందట జరిగిన పెద్ద విస్ఫోటనం కారణంగా విశ్వం ఏర్పడిందని "బిగ్ బ్యాంగ్ థియరీ" చెప్తోంది. కానీ ఆ విస్ఫోటనానికి కారణం ఏమిటనేది మాత్రం సైన్సు వివరించలేకపోయింది. 
శబ్ద బ్రహ్మ స్వరూపమైన ఓంకారము యొక్క విస్ఫోటనంతో మొదట కాంతి ఏర్పడిందని, ఆ కాంతియే సూర్యుడని పురాణాలు చెబుతున్నాయి. నిజానికి సూర్యుడు ఒక మండే అగ్ని గోళము. ఆ గోళానికి అధిపతి అయిన మార్తాండుడు యావద్విశ్వానికి కాంతిని వెలుగును, సర్వ ప్రాణికోటికీ ప్రాణశక్తిని ఇస్తున్నాడు. 
మకర సంక్రాంతితో పవిత్ర ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. రథసప్తమి నుంచి శ్రీ సూర్యభగవానునిలోని కాంతి, వేడిమి భూమిపై ఎక్కువగా ప్రసరించటం ప్రారంభమవుతుంది.  
రథసప్తమిని సూర్య జయంతి, భాను సప్తమి, మిత్ర సప్తమి, జయ సప్తమి, మహాసప్తమి అని ఎన్నో పేర్లతో వ్యవహరిస్తాము.  
ఈ విశ్వంలోని సర్వ ప్రాణికోటికీ ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్య నారాయణ స్వామిని మానవులందరూ తప్పక ఆరాధించాలి. ఎందుకంటే సూర్యుని వల్లనే ప్రాణికోటి ప్రాణవంతమై మనగలుగుతున్నది. ఆకులన్నీ హరిత వర్ణాన్ని పొందుతూ వృక్షములన్నీ ఫలపుష్ప వంతములవుతున్నాయి. భూమిపైని జలాలను గ్రహించి సూర్యుడే వర్షాలు కురిపించి మనకు ప్రాణస్వరూపమైన జలములను ఇస్తున్నాడు. సౌరశక్తి ద్వారా మనిషి తన శక్తిని పెంచుకుంటున్నాడు. 
భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నాయంటే అందుకు కారణం శ్రీ సూర్య భగవానుడే ! కనుక రథసప్తమి నాడు సనాతన ధర్మానుయాయులందరూ శ్రీ సూర్య నారాయణ స్వామిని తప్పక ఆరాధిస్తారు. 
మన ధర్మము ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉన్నది. వేదములు శ్రీ సూర్య నారాయణ స్వామిని అనేక ఋక్కులతో స్తోత్రించాయి, మన పురాణములు, శ్రీమద్రామాయణ మహా భారతేతిహాసములు శ్రీ సూర్యుని మహిమను కొనియాడాయి. శ్రీ సూర్యోపనిషత్తు సూర్య భగవానుని పరబ్రహ్మముగా కీర్తించింది. "అసావాదిత్యో బ్రహ్మ" అనీ, "సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ" అని ప్రకటించింది. 
మనమందరము సూర్య భగవానునిలోని భర్గశక్తిని పరబ్రహ్మముగా ఆరాధిస్తాము. సూర్యమండలమును భక్తితో కీర్తిస్తాము. 
"యన్మండలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ ! 
దారిద్ర్యదుఃఖక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ "!! 
ఏడు గుర్రాలు సూర్యుని ఏడు కిరణాలకు సంకేతాలు. ఈ ఏడు గుర్రాలు గాయత్రి, త్రిష్ణుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే ఏడు వేద ఛందస్సులు అని వేదములో చెప్పారు. సప్త వర్ణాలతో ప్రకాశించే సూర్యుని సప్త కిరణాలను - సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాగ్రసు, సావరాడ్వసు అంటారు. రథసప్తమి రోజున ఈ సప్త వర్ణాలు మనకు శ్వేతవర్ణంగా కనిపిస్తాయి. 
జ్యోతిశ్శాస్త్రము, ఖగోళ శాస్త్రములు సూర్య గమనాన్ని వివరించాయి. సప్తాశ్వ రథముపై భానుడు స్వారీ చేస్తూ మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశుల్లో ప్రయాణిస్తాడు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. రథసప్తమి రోజునే సూర్యుడు తన సప్తాశ్వ రథాన్నెక్కి ఉత్తర దిశగా ప్రయాణం సాగించటం ప్రారంభించి, ఒక్కో రాశిలో 30 రోజులుంటాడు.
విశ్వాన్ని ఒక వృత్తంలా భావిస్తే, దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణితశాస్త్రం చెబుతోంది. సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి, ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా, విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు నేటి పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయ మహర్షులు వేదకాలంలోనే, వేదములలో ద్వాదశ ఆదిత్యులను ప్రస్తావించారు. వారే - "మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు." వీరే ద్వాదశ మాసాలకూ ఆధిదేవతలు. వీరి కారణంగానే 12 రాశులు ఏర్పడినాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు.
మాఘమాసంలో శ్రీ సూర్య నారాయణుడు "అర్క'' నామంతో సంచరిస్తాడు. 'మాఘ' అంటే మా అఘ - అఘము అంటే పాపము. మా అంటే లేనిది. మాఘము అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైనా, రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయణం నుంచి ఉత్తర దిశకు మరలిన భాస్కరుడు ఈ రథసప్తమి రోజు నుంచే అత్యధిక వేడిమిని సంతరించుకోవటం ప్రారంభిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్య గ్రహణ తుల్యంగా భావించి, పితృ, దేవ, ఋషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు.
అన్ని జీవరాశులకు సూర్యుడే ఆత్మ. "సూర్య ఆత్మా జగతః తస్థుషశ్చ" అని ఉపనిషత్తు చెప్తోంది. 
సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే ఋణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయి. 
"నమస్కార ప్రియో భానుః", అనీ, "ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్" అనీ అంటారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే శ్రీ సూర్య భగవానుని ఆరాధించాలి, సూర్య నమస్కారాలు చెయ్యాలి. సూర్యుడు మన నేత్రాలకు అధిదైవం. కనుక మన కంటిచూపు బాగుండాలంటే సూర్య నారాయణ స్వామి అనుగ్రహం ఉండాలి. 
"ఓం శ్రీ సూర్యాయ ఆదిత్యాయ అక్షి తేజసే నమః"  - అనే మంత్ర జపంతో శ్రీ సూర్య నారాయణుని అనుగ్రహం పొందవచ్చును. 
మన మంత్రపుష్పాలలోని  ఒక మంత్రం "యోऽపాం పుష్పం వేద, పుష్పవాన్ ప్రజావాన్, పశుమాన్ భవతి" అనే వాక్యాలు దీనికి కూడా సంబంధించినవే. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశుసంపద కలవాడు, ఐశ్వర్య వంతుడు, అన్న సమృద్ధి కలవాడు అవుతాడు. 
సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ 'డి' లభిస్తుంది. కనుక సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే మన మహర్షులు సంధ్యావందనం, సూర్యనమస్కారాలు, అర్ఘ్యప్రధానం మొదలైనవి చెయ్యాలని విధించారు. 
ఏడు కిరణాలుగా సప్తవర్ణాలను ప్రతిబింబిస్తూ కదిలే సూర్యుని అశ్వాలు/ కిరణాలు రథసప్తమి రోజున ఒకే తెల్లని కాంతి రేఖగా మారుతాయి. 
శ్రీ సూర్య భగవానుడు సర్వ రోగ హరుడు, ఆరోగ్య ప్రదాత, అభయ ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, జ్ఞాన ప్రదాత, భక్త రక్షకుడు. 
ఒకప్పుడు కాంభోజ రాజైన యశోవర్మ తనకు ఎన్నో పూజల ఫలంగా లేక లేక పుట్టిన ఏకైక పుత్రుడు వ్యాధుల పాలైతే రథసప్తమీ వ్రతాన్ని ఆచరించి, సూర్య భగవానుని అనుగ్రహంతో తన కుమారుని అనారోగ్యం నుంచీ కాపాడుకున్నాడని ఒక చారిత్రక గాథ ఉంది.
శ్రీకృష్ణుని కుమారుడు సాంబునికి మహర్షి శాపం వల్ల కుష్ఠు రోగం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు సూర్యభగవానుని ఆరాధించమనీ, రోగం నయమౌతుందనీ చెప్తాడు. సాంబుడు భక్తితో చంద్రభాగా నదీతీరాన వేపవృక్షాల మధ్యలో ఉంటూ సూర్యారాధన చేశాడు. జబ్బు పూర్తిగా తగ్గిపోయాక కృతజ్ఞతతో కోణార్క్ లో అద్భుతమైన సూర్యాలయాన్ని నిర్మించి సూర్య నారాయణుని ప్రతిష్టించాడు. ఎందరో ఈ దేవాలయాన్ని పాడుచెయ్యాలని ప్రయత్నించినా, కోణార్క్ దేవాలయం నేటికీ అత్యంత ఆకర్షణీయంగా అలరారుతున్నది. 
ఒకసారి దేవేంద్రుడు పరమేశ్వర దర్శనానికి వెళతాడు. ఆ సమయంలో శివపార్వతులు ఏకాంతంగా ఉన్నారని నందీశ్వరుడు దేవేంద్రుని లోపలికి వెళ్ళద్దంటాడు. అతని మాట వినకుండా శివదర్శనానికి వెళ్ళబోయిన ఇంద్రుడిని నందీశ్వరుడు తంతాడు. ఒక్క తాపుతో ఎగిరిపడి ఒళ్ళంతా దెబ్బలతో బాధ పడుతుంటే, ఇంద్రునికి సూర్యారాధన చేస్తే బాధ పోతుందని కల వస్తుంది. అప్పుడు దేవేంద్రుడు నిర్మించి, ప్రతిష్ఠించినదే అరసవెల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయము. అత్యంత మనోహరంగా కనిపించే శ్రీ సూర్య నారాయణ స్వామి పాదాలను సూర్య కిరణాలు తాకటాన్ని ఇక్కడ మనం చూడవచ్చును. ఉషా, సంధ్యా, సంజ్ఞా, ఛాయా, పద్మినీ సమేత శ్రీ సూర్య నారాయణ స్వామిని ఆరాధించేవారి సర్వ కామనలను ఆయన తీరుస్తాడు. 
మయూరుడనే కవి తనకు కలిగిన జబ్బును పోగొట్టుకొనటానికి మయూర శతకం రచించి, సూర్య భగవానుని అనుగ్రహంతో పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. 
రథసప్తమి రోజునే శ్రీ సూర్య భగవానుడు సత్రాజిత్తుకి శమంతక మణిని ప్రసాదించాడని చెప్తారు.
శ్రీ సూర్యభగవానుని గురువుగా ప్రార్థించి శ్రీ ఆంజనేయస్వామి చతుర్వేదాలను, ఉపనిషత్తులను, వ్యాకరణాన్ని అభ్యసించాడు. యాజ్ఞవల్క్య మహర్షి శ్రీ సూర్య భగవానుని నుంచి ఉపనిషద్ జ్ఞానాన్నిపొందాడు. 
శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రార్థించి ధర్మరాజు అక్షయపాత్రను పొందాడు. 
సూర్య నారాయణ స్వామిని నిత్యము ప్రార్థించే ద్రౌపదీ దేవిని కీచకుడు సమీపించ బోతున్నప్పుడు సూర్య భగవానుడు ఒక గంధర్వుడిని ఆమె రక్షణకు పంపాడు. అతను గుప్తంగా వచ్చి, కీచకుడిని తోసేసి, ద్రౌపదిని రక్షించాడు.
ఇప్పుడు రథసప్తమి రోజున ఆచరించ వలసిన వ్రతవిధానాన్ని చూద్దాము. 
శ్రీ సూర్య నారాయణ స్వామికి స్నానము, అర్ఘ్య ము, తర్పణము, నమస్కారములు అంటే ప్రీతి. కనుక రథసప్తమి రోజున సూర్యోదయాత్పూర్వమే నిద్ర లేచి స్నానం చెయ్యాలి. అసలు మాఘమాసమంతా సంకల్ప సహిత నదీ స్నానము శ్రేష్ఠము. 
"జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్త సప్తకే ! 
సప్త వ్యాహృతికే దేవీ నమస్తే సూర్య మాతృకే॥
‘ప్రాణులన్నిటికీ, విశ్వంలోని లోకాలన్నిటికీ తల్లివైన ఓ సూర్యుని మాతృదైవమా! ఓ సప్తమీ ! నీకు నమస్కారము’ అని సప్తమి తిథిని ప్రార్థిస్తారు. 
సూర్యుడికి ఇష్టమైనది జిల్లేడాకు. అందుకే దానిని అర్కపత్రం అంటారు. జిల్లేడుతో పాటు చిక్కుడాకులకు కూడా సూర్యరశ్మిని బాగా ఆకర్షించి, ఇముడ్చుకునే శక్తి ఎక్కువగా ఉన్నది. అందుకే వాటికి ఆ రోజున అంత ప్రాధాన్యత ఏర్పడినది. జన్మజన్మలుగా చేసిన శోక, రోగ, పాపాలను పోగొట్టాలనీ, మనో వాక్కాయములతో అజ్ఞానం వల్ల చేసిన ఏడు విధాలైన పాపాలను, ఏడు జన్మలలో చేసిన పాపాలను, రోగాలను తొలగించాలని సూర్య భగవానుడిని కోరుతూ రథసప్తమి నాడు ఏడు జిల్లేడాకులను, ఏడు చిక్కుడాకులను, ఏడు రేగుపళ్ళను తలమీద, భుజముల మీద పెట్టుకుని స్నానం చెయ్యాలి. పురుషులు ఏడు జిల్లేడు ఆకులను, స్త్రీలు ఏడు చిక్కుడు ఆకులను తలపై ఉంచుకొని సూర్యోదయ సమయంలోనే స్నానం చెయ్యాలని కొందరంటారు.  
వీటిని తలమీద ఉంచుకుని, సూర్య భగవానుని స్మరిస్తూ స్నానం చేస్తే, ఆ సూర్య శక్తి మన సహస్రారంలో నుంచి, అనగా మన బ్రహ్మరంధ్రం లోనుంచి మనలోకి ప్రవేశిస్తుంది. మనకు శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తుంది, రాబోయే ఎండల తీవ్రతను తట్టుకోలగల శక్తి శరీరానికి వస్తుంది. రేగుపళ్ళు మనకు ఉన్న చీడపీడలను, దృష్టి దోషాలను పోగొడుతాయి. 
స్నానం చేసేటప్పుడు - 
"దుఃఖ దారిద్య్ర నాశాయ శ్రీ విష్ణోస్తోషణాయ చ ! 
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనమ్"!! 
"సప్త సప్త మహాసప్త సప్తద్వీపా వసుంధరా ! 
కోటి జన్మార్జితం పాపమేతత్ క్షణాద్వినశ్యతి"!! 
"మాకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ ! 
స్నానేనానేన మే దేవ ! యథోక్త ఫలదో భవ"!! 
అని ప్రార్థిస్తూ స్నానం చెయ్యాలి. 
తరువాత శ్రీ సూర్య భగవానునికి ఆర్ఘ్యమివ్వాలి. ఎలా ఇవ్వాలంటే  - ఒక రాగి పాత్రలో గంగాజలం - శుద్ధజలం పోసి, రక్త చందనం వేసి, కుంకుమాక్షతలు వేసి, ఎర్ర మందార పుష్పము, ఎర్ర గన్నేరు పుష్పము వేసి, రాగి నాణెమును వేసి, ఆ చెంబును రెండు చేతులతో పట్టుకుని, మోకాళ్ళమీద కూర్చుని, సూర్య స్తోత్రము చేసి, మంత్రములను చెప్తూ అర్ఘ్య ప్రదానం చెయ్యాలి.
అలా అర్ఘ్యమిచ్చేప్పుడు  - 
"సవిత్రే ప్రసవిత్రే చ పరంధామ జలే మమ ! 
త్వత్తేజసా పరిభ్రష్ఠం 
పాపం యాతు సహస్రధా"! 
"సప్త సప్తవహప్రీత, 
సర్వ లోక ప్రదీపన! 
సప్తమీ సహితో దేవ ! గృహాణార్ఘ్యం దివాకర"!! 
అంటూ సమర్పించాలి. 
సర్వ రోగాలను హరించే శక్తి కలవి సూర్య నమస్కారములు. సూర్య ప్రీతికరంగా సూర్య న‌మ‌స్కారాలు చేయటం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, అంటూ సూర్య నమస్కారాలను - ప్రణామాసనం, ఉచిత హస్తాసనం, పాదహస్తాసనం, దక్షిణ హస్త సంచలనాసనం, పర్వతాసనం, సాష్టాంగ నమస్కారాసనం, భుజంగాసనం, పర్వతాసనం, వామ హస్త సంచలనాసనం, పాదహస్తాసనం,  హస్తాసనం, ప్రణామాసనం వేస్తూ చెయ్యాలి.
అరుణ పారాయణ చెయ్యవచ్చును, శ్రీ సూర్యోపనిషత్తును చదవవచ్చును. ఆదిత్య హృదయం కానీ, సూర్య స్తోత్రములను కానీ పఠించవచ్చును. సూర్య మంత్ర జపం చెయ్యవచ్చును. 
తరువాత రథసప్తమి వ్రతాచరణను ప్రారంభించాలి. ఆరుబైట సూర్య కిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట ప్రక్కన ఆవు పేడతో అలికి, ఆ స్థలాన్ని శుభ్రపరచి, బియ్యప్పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి, పసుపు కుంకుమలతో అలంకరించి, అక్కడ పొయ్యి పెట్టి, ధనుర్మాసము నెలరోజులు పెట్టిన లేక సంక్రాంతి రోజులలో పెట్టిన గొబ్బెమ్మలను - ఆవుపేడ పిడకలను ఆ పొయ్యిలో వేసి, అగ్నిని రగిల్చి పిడకలు అంటించి, కొత్త రాగి పాత్రలో లేక మట్టి పాత్రలో ఆవు పాలను పోసి, పొంగించి, కడిగిన క్రొత్త బియ్యం వేసి, చెరుకు గడ ముక్కతో కలియబెడుతూ, బియ్యం ఉడికాక, బెల్లం వేసి, ఏలకుల పొడి వేసి, ఆవునెయ్యిని వేసి, పరమాన్నం వండాలి. సూర్య భగవానునికి షోడశోపచార పూజ చెయ్యాలి. పరమాన్నమును చిక్కుడు కాయలతో చేసిన ఏడు రథముల మీద చిక్కుడాకులను వేసి, వాటిలో పరమాన్నమును పెట్టి, శ్రీ సూర్య నారాయణ స్వామికి నైవేద్యం పెట్టి, వాటిని ఆ అగ్నిలో వేసి, హుతం చేసి, శ్రీ సూర్య భగవానునికి సమర్పించాలి. అలాగే చిక్కుడు కాయల రథాల మీద చిక్కుడాకులను వేసి, పరమాన్నం పెట్టి, శ్రీ సూర్య భగవానునికి నైవేద్యం పెట్టాలి. హారతిచ్చి, సువర్ణ దివ్య మంత్రపుష్ఫం సమర్పించాక, పునః పూజ చెయ్యాలి. పూజా ఫలాన్ని శ్రీ సూర్య నారాయణునికి సమర్పించాలి. తరువాత ఇంట్లోనివారందరూ చిక్కుడాకులలోని ప్రసాదాన్ని స్వీకరించాలి.
మానవులందరూ ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని, మేథస్సును, వర్చస్సును, భోగములను, ముక్తిని, సకల శుభాలను పొందాలంటే ప్రతి రోజు ఉదయము, సాయంత్రము తప్పకుండా సూర్యారాధన చెయ్యాలి. సంధ్యావందనములో గాయత్రీ మంత్రముతో ఆరాధించబడుతున్న సూర్యుని లోని భర్గ తేజము మనలను రక్షించు గాక ! 
రథసప్తమి రోజున సూర్యభగవానుని విశేషంగా ఆరాధించి సకల మానవులు సకల శ్రేయస్సులను సపొందుదురు గాక !
"యో దేవః సవితాऽస్మాకం
ధియో ధర్మాది గోచరాః
ప్రేరయేత్ భర్గ యత్తస్య
తద్వరేణ్యముపాస్మహే" !!
"సర్వ చైతన్య రూపాం తామ్
ఆద్యాం విద్యాం చ ధీమహి !
బుద్ధిం యా నః ప్రచోదయాऽత్"!!
స్వస్తి
🙏💐
రచన :
డా.సోమంచి(తంగిరాల)విశాలాక్షి.
Nagarajakumar.mvss

కామెంట్‌లు