విశిష్ట వ్యక్తిత్వం;- సి.హెచ్.ప్రతాప్
 లాల్‌బహదూర్‌ శాస్త్రి   దేశ ప్రధానమంత్రి అయిన తరువాత కూడా ఆయన కొడుకులు సిటీ బస్సుల్లో ప్రయాణించేవారు. ఈ విషయం అప్పట్లో ఒక సంచలనం అయ్యి పత్రికలు దానికి విశేష ప్రాచుర్యం కల్పించాయి. కొందరు స్నేహితులు శాస్త్రి గారి కొడుకులను అదే పనిగా గేలి చేయడంతో, కారు కొనమని వాళ్ళు తండ్రి మీద ఒత్తిడి తెచ్చారు. అయితే శాస్త్రి గారు తనకు ఇష్టం లేకపోయినా తనకు తెలిసిన వారి వద్ద అప్పులు చెసి ఒక ఫియట్‌కారు కొన్నారు. కారుపై  అప్పు ఇంకా 4600 రూపాయలుండగా శ్రీ శాస్ర్తీగారు అకస్మాతుగా కాలధర్మం పొందారు. శాస్త్రి గారు చెసిన అప్పును ఒక పాత్రికేయుడు తన పత్రికలో ప్రస్తావించగా దేశవ్యాప్తంగా శాస్ర్తీగారి అభిమానులు, ఆయన భార్య శ్రీమతి లలితాశాస్ర్తీగారికి ఎంతో కొంత ధనం మనీఆర్డర్ చేయడం ప్రారంభించారు. రెండు సంవత్సరాలపాటు ఆమె మనిఆర్డర్‌లు అందుకొన్నారట. అయితే శ్రీమతి శాస్త్రి గారు డబ్బు పంపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలతో ఉత్తరం వ్రాస్తూ, డబ్బును కూడా వాపసు పంపించేశారు.
మరో సందర్భంలో, లాల్‌బహదూర్‌శాస్ర్తీ ప్రధానిగా ఉన్న సమయంలో వారి పెద్దకొడుకు హరికృష్ణశాస్ర్తీ అశోక్ లేలాండ్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవారు. ఆ సంస్థవారు హరికృష్ణశాస్ర్తీకి సీనియర్ జనరల్ మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. సంతోషించిన హరికృష్ణశాస్ర్తీ మరుసటిరోజు, లాల్‌బహదూర్‌శాస్ర్తీగారికి ఈ విషయం తెలి పారు. ఒక నిమిషం ఆలోచించి, ‘‘హరీ, ఆ సంస్థ, ఆకస్మాత్తుగా నీకెందుకు ప్రమోషన్ ఇచ్చిందో నేనూహించగలను. కొన్నిరోజుల తరువాత, ఆ కంపెనీ వాళ్ళు ఏదో ఒక సహాయం చేయండి అని నా దగ్గరకు వస్తారు. నేను వారికి సహాయం చేస్తే దేశ ప్రజలు దానినెలా అర్ధం చేసుకుంటారో నాకు తెలుసు, నాకు తెలుసు. పాలకుల యొక్క నిజాయితీని ప్రజలు శంకించే లాగా జీవించడానికి నేను వ్యతిరేకం. కాబట్టి నీవు వెంటనే ఆ సంస్థలో నీ ఉద్యోగానికి రాజీనామా చేయి. నేను ప్రధానిగా ఉన్నంతకాలం నీవు ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి లేదు’’ అన్నారట. తండ్రి మాటను తు చ తప్పక పాటించి హరికృష్ణ శాస్త్రి వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేసారు. ప్రధాని వంటి అత్యుత్తమ పదవిలో వుండి కూడా స్వంతంగా ఒక ఇల్లు కూడా లేని అపురూప వ్యక్తిత్వం లాల్ బహదూర్ శాస్త్రి గారిది. అటువంటి వ్యక్తిత్వాన్ని నేటి వ్యవస్థలో చూస్తామా?

కామెంట్‌లు