మార్పు మనసులో రావాలి; - జగదీశ్ యామిజాల
 ఆయన జ్ఞాని. విషయం తెలుసుకుని ఆయన వద్దకు కొందరు వెళ్ళారు.
"మేమందరం ఓ పవిత్ర పుణ్య క్షేత్రానికి వెళ్ళి అక్కడి తీర్థంలో స్నానమాచరించి వద్దామనుకుంటున్నాము.  మీరు మాతో వస్తే బాగుంటుంది" అన్నారు వారు.
జ్ఞాని "ఇప్పుడు నేను రాలేను" అంటూ ఓ కాకరకాయను వారికిచ్చి "మీరు కాకోసం ఓ సాయం చేస్తారా?" ఆని అడిగారు.
''ఏం చెయ్యాలో చెప్పండి.మీకోసం ఏమైనా చేస్తాం" ఆన్నారు వారు ఒక్కమాటగా.
"అదేమీ పెద్ద పని కాదు. మీరు పుణ్య తీర్థంలో మునిగి పైకి లేచేటప్పుడల్లా ఈ కాకరకాయను కూడా ఆ తీర్థంలో ముంచండి. మీరు తిరిగొస్తున్నప్పుడు దీనిని తీసుకొచ్చి నాకివ్వండి" అన్నారు జ్ఞాని.
ఆ నలుగురు యువకులూ జ్ఞాని చెప్పినట్టే చేశారు. ఆ కాకరకాయను తీసుకొచ్చి జ్ఞానికి ఇచ్చారు.
ఆయన ఆ కాకరకాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ నలుగురికీ ఒక్కో ముక్క ఇచ్చారు. "పవిత్ర పుణ్య తీర్థంలో ఈ కాకరకాయను ముంచి తీసుకొచ్చారు కదా. దాని చేదు పోయి తియ్యగా మారిందేమో తిని చెప్పండి" అన్నారు.
నలుగురు యువకులూ జ్ఞాని మాట నిజమే అనుకుని ఆ కాకర కాయ ముక్కలను తిన్నారు. కానీ నమలలేక ఉమ్మలేక భీకరంగా పెట్టారు మూతిని. "పైగా తియ్యగా ఉంటుందేమో తినండన్నారు. కానీ చేదుగానే ఉందిగా" అన్నారు ఆ యువకులు. 
ఆప్పుడు జ్ఞాని "చూసేరా. కాకరకాయను ఎంతలా నదిలో ముంచినా అది తన సహజగుణాన్ని కోల్పోలేదు. అలాగే మనలో మన తప్పుడు పనులను‌, దుర్గుణాలను మార్చుకోకుండా ఏ పుణ్యతీర్థంలో వేయి సార్లు స్నానం చేసినా ఆలయాలకు పదే పదే వెళ్ళినా ఏ ప్రయోజనమూ ఉండదు. మార్పు మనసులోనూ  గుణాలలోనూ వచ్చినప్పుడే జీవితం మధురమవుతుంది" ఆన్నారు జ్ఞాని.

కామెంట్‌లు