సుప్రభాత కవిత ; - బృంద
అవని అనురాగానికి మురిసి
ఆమని ముందే వచ్చేసిందా?

విచ్చిన కళ్ళతో విస్తుపోయి
విరిబాలలు జగాన్ని చూస్తున్నాయా?

నింగి ...నేలతో స్నేహం కోరి
చుక్కలు పువ్వులుగా దోసిట్లో పోసిందా?

మొగ్గతొడిగిన తీగ తల్లికి
సీమంతం చేసి 
హిమబిందువులు అక్షింతలుగా జారుతున్నాయా?

కొండలమీంచి చల్లగాలి
చల్లని కబురు తెస్తోందా??

జలపాతాల సంగీతం
లోయల్లో ప్రతిధ్వనిస్తోందా?

నింగి....నేలతో స్నేహం కోరి
దోసిట్లో చుక్కలు పోసినట్టు
పువ్వులు మెరుస్తున్నాయా?

కలలను మోసుకుని రమ్మని
కలతలు వదిలేయమనీ
కమ్మని  కబురు చేసిందా?

జ్యోతికలశం రూపును
కడుపున దాచిన ఏరు
సంతోషం తో పొంగిపోతోందా?

తూరుపు తలుపు తెరువగనే
ప్రశ్నలన్నిటికీ  ఒకటే జవాబు

పెదవంచుపై మెరిసే చిరునవ్వు
అప్రయత్నంగా జోడించే చేతులు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు