*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 065*
 కందం:
*పరజనులు కట్టి విడిచిన*
*వర చేలములైన గట్ట వలదు వలువలన్*
*నెరి మాయు మడత మార్చుచు*
*ధరియించుట యొప్పదండ్రు ధరను కుమారా !*
తా:
కుమారా! ఈ భూమి మీద, వేరెవరైనా కట్టి విడిచిన బట్టలు, ఎంత విలువ కలిగినవి, ట్టు వస్త్రములు అయినా ఇంకొకరు ఇట్టుకో కూడదు. అలాగే, కట్టుకున్న బట్టలు మాసిపోతే, ఆ మాపు కనపడకుండా వేరిక మడత వేసి కట్టుకోవడం మంచిది కాదు.......... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*అంతరంగం లేక మనసుని శుభ్రముగా, మలినము లేకుండా ఉంచుకోవడమే కాకుండా, బాహ్యంగా కూడా ప్రతీ రోజూ శరీరాన్ని శుభ్రపరచడం, ఉతికి ఆరవేసిన బట్టలు కట్టుకోవడం కూడా మన సంస్కృతి లో భాగమే. "శుచి, శుభ్రత" అన్నారు పెద్దలు. మన మనసుని శుచిగా ఉంచుకుంటూ, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం ప్రతీ రోజూ, ప్రతి ఒక్కరూ చేయాలి. సం.లో 360 రోజులూ కొత్త బట్టలు కొని వేసుకో వలసిన అవసరం లేదు. మనకు ఉన్నంతలో ఉతికి ఆరవేసిన మంచి బట్టలు కట్టుకోవడం వల్ల మనకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఒకసారి రోజంతా వాడిన, మాసిన బట్టలను మళ్ళీ వేరే మడతలు పెట్టి కట్టుకోవడం వల్ల, బట్టలు వాడిన వాసన వస్తాయి. మనకు కూడా శారీరకంగా, మానసికంగా అసౌకర్యం గా ఉంటుంది. శుచి-శుభ్రత మనం పాటిస్తూ, పిల్లలకు నేర్ప వలసిన అవసరం ఉంది అని గ్రహించే మంచి లక్షణం మనకు ఇవ్వమని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు