తడారిన గొంతు నోదారుస్తూ
స్వఛ్ఛ జలమై దాహార్తి తీర్చేందుకు
అలలు అలలుగా కలలెన్నో కన్నా....
రసాయన వ్యర్ధాల విష కషాయంతో
గంగా జలం గరళం చేస్తావనుకోలేదు!
పిల్లగాలిలో పల్టీలు కొడుతూ
పాల పిట్టనై ఎగరాలని
పసిడి కలలెన్నో కన్నా...
అలసిన రెక్కలకు ఆశ్రయమిచ్చు
వృక్ష సంపద విధ్వంసం చేస్తావనుకోలేదు!
నేలపై వేల తలల మొలకలెత్తి
పొట్ట విచ్చుకున్న ధాన్య కంకులనై
అలమటించే పేగుల ఆకలి తీరుస్తానని
రేయింబవళ్ళు కలలెన్నో కన్నా...
పెస్టిసైడ్ సైనెడ్ మంటతో
పుడమి దేహం గాయం చేస్తావనుకోలేదు!
కృష్ణపక్ష అవసాన దశలో
తులసి తీర్ధం బొట్టుబొట్టుగా గుటకలేస్తుంటే
ఉశ్చ్వాస నిశ్చ్వాసామృత ధారనై
ఊపిరి పోయాలని కలలెన్నో కన్నా....
కర్బన ఉద్గారాలు వెదజల్లుతూ
ప్రాణవాయు కాలుష్యం చేస్తావనుకోలేదు!
భూమిపై బుడిబుడి అడుగులేస్తూ
రంగుల ప్రపంచ పూదోట వీక్షించాలని
వెండి వెన్నెల్లో కలలెన్నో కన్నా....
గర్భస్థ పిండం ఖండ ఖండాల విచ్ఛిత్తితో
కన్న కలలన్నీ కల్లలు చేస్తావనుకోలేదు!
బతుకు పాఠం నేర్చిన నాగరికుడా!
చెట్టూ - మట్టీ గాలి -నీరు
ప్రకృతి ఆర్తనాదం ప్రళయ కాల సంకేతం
మానవ జీవన గమనం దినదినం
ప్రమాద భరితం చేస్తావనుకోలేదు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి