మనుషులంటే మాటలు కాదు (సంయుక్త అక్షరాలు లేని కథ) డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
 ఒక అడవిలో ఒక పెద్దపులి వుండేది. అది చానా చెడ్డది. అడవిలో జంతువులన్నీ దాని దెబ్బకు భయంతో వణికిపోయేవి.  అది గట్టిగా ఒక్కరుపు అరిచిందంటే చాలు దేని మీద పడి చంపుతాదో ఏమో అని ఎక్కడివక్కడ పరుగులు పెట్టేవి. ఒకరోజు అడవిలోని జంతువులు 'మనుషులంటే మాటలు కాదు. చానా బలవంతులు, తెలివైన వాళ్ళు... అందుకే వాళ్ళు వున్నవైపు పోవడం అంత మంచిది గాదు' అని చెప్పుకోవడం వినింది. దాంతో అది మనుషులను ఆటపట్టిచ్చి అడవిలోని జంతువులకంతా తన బలం తెలియజేయాలి అనుకోనింది.
అప్పటి నుండీ రోజూ అడవిలో ఏదో ఒక మూల గుట్టు చప్పుడు కాకుండా మట్టసంగా దాచిపెట్టుకునేది. ఎవరైనా మనిషి ఆ దారిలో కనబడితే చాలు... ఎగిరి వాని ముందుకు దూకేది. ''రేయ్‌... నువ్వు నువ్వు నన్ను భుజాల మీదకు ఎత్తుకోని ఆ మూల నుంచి ఈ మూలకు... ఈ మూల నుంచి ఆ మూలకు అడవంతా తిప్పి తిప్పి చూపించాల. లేదంటే ఈ రోజే నీకు ఆఖరు. ఈ భూమ్మీద నీకు నూకలు చెల్లిపోయినట్టే'' అని భయపడిచ్చేది. దాంతో జనాలు భయంతో వణికి పోయేటోళ్ళు. దాన్ని భుజాలపైకి ఎత్తుకోని అడవంతా తిప్పేటోళ్ళు. ఆ పులి దొరికిన జంతువునల్లా తినీతినీ తెగ బలిసింది గదా.... దాంతో జనాలు దాన్ని మోయలేక ఎక్కడన్నా అలసిపోయి ఆగితే ఆ పులి వెంటనే పంజాతో రపారపా పెరికేది. దాంతో పాపం వాళ్ళు ఆ దెబ్బలకు తట్టుకోలేక అక్కడే కిందపడిపోయేటోళ్ళు. అప్పుడు ఆ పులి వాళ్ళ మీదకు దుంకి చంపేసేది.
అలా కొద్దిరోజులు దాటే సరికి మనుషులకు ఆ అడవిలో పోవాలంటే భయం పెరిగిపోయింది. ఎవరూ పొరపాటున గూడా అటువైపు వచ్చేటోళ్ళు కాదు. వందమైళ్ళు ఎక్కువయినా సరే... అడవి చుట్టూ తిరిగి అవతలి వైపుకి పోయేటోళ్ళే గానీ అడవిలోకి వచ్చేటోళ్ళు కాదు. కానీ... పొరపాటున కొంతమంది దారి తప్పో, పులి గురించి తెలీకో అడవిలోకి పోయి దానికి బలయ్యేటోళ్ళు.
ఆ అడవి పక్కనే వున్న వూరిలో రంగయ్య అని కుండలు చేసే ఒక కుమ్మరి వుండేటోడు. వానికి రోజూ కుండలు చేసుకోని చుట్టుపక్కల వూళ్ళలో అమ్ముకోని రావడమే పని. కానీ ఎప్పుడయితే పులి అందరినీ చంపడం మొదలు పెట్టిందో అప్పటినుంచీ వాడు రోజూ చుట్టూ తిరిగిపోలేక చానా ఇబ్బందులు పడుతుండేటోడు. కుండలు కూడా చానా తక్కువగా అమ్ముడయ్యేవి. దాంతో ఆ కుమ్మరి ''ఎలాగైనా సరే ఆ పులి పీడ తొలగించుకోవాలి. లేకుంటే కుండలు అమ్మలేక ఆకలితో చావడం ఖాయం'' అనుకున్నాడు.
దాంతో ఏమైనా కానీ అనుకోని ఒక్కడే అడవిలోనికి బైలుదేరినాడు. రంగయ్య చానా తెలివైనోడే గాక మంచి బలవంతుడు కూడా. అతను అలా పోతావుంటే దారిలో పెద్దపులి ఒక పొదలోంచి ఎగిరి వాని మీదకు దుంకింది. రంగయ్య దానికి భయపడినట్టు నటించినాడు. విషయం తెలీని పెద్దపులి వాని భుజాల మీదకు ఎక్కి సంబరంగా నవ్వుకుంటా ''పా అడవంతా తిప్పి చూపించు'' అనింది..
రంగయ్య అడవిలో పోసాగినాడు. ఆ అడవి నడుమ ఒక పెద్ద పాడుబన్న బావి వుంది. అది చానా లోతైంది. రంగయ్య పులిని ఎత్తుకోని ఆ బావివైపు పోయినాడు. బావి దగ్గరకు రాగానే ఒక్కసారిగా దాని కాళ్ళు పట్టుకోని గిరగిరగిర తిప్పి విసిరి బావిలో పడేసినాడు. అంతే.. అంత ఎత్తులో నుంచి ఆ నీళ్ళు లేని బావిలో పడేసరికి అది తల పగిలి అక్కడికక్కడే చచ్చూరుకుంది. పులి పీడ తొలగిపోయేసరికి చుట్టుపక్కల వూళ్ళన్నీ ఆనందంతో సంబరాలు చేసుకున్నాయి. ''తెలివంటే నీదేరా'' అంటా రంగయ్యను వూరు వూరంతా మెచ్చుకోని వూరేగించినారు.
**********

కామెంట్‌లు