*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0245)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*రుద్ర సంహిత లో, యుద్ధ ఖండము ప్రారంభము.*
తారకాసురుని కుమారులు - తారకాక్షుడు, విద్యున్మాలి, కమాలాక్షుడు - తపస్సు - బ్రహ్మ వరాలు - మయుడు మూడు పట్టణములను నిర్మించడం - వాటి వర్ణన.
* నారదా! తారకాసురుని కుమారులు తారకాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు కోరిన కోరికలను ఒప్పుకున్న బ్రహ్మ, మయుని పిలిచి తారకాసురుని ముగ్గురు కుమారులకు వారు కోరినవిధంగా దుర్భేద్యమైన మూడు పట్టణములు నిర్మించి ఇవ్వమని ఆజ్ఞ ఇచ్చారు. ఆ విధంగా మయునకు చెప్పి బ్రహ్మ తన లోకానికి వెళ్ళి పోయారు. ఆ తరువాత రాక్షసులకు మేలు చేయడంలో ముందు ఉండే మయుడు, తారకాక్షుని కోసం స్వర్ణమయము, కమలాక్షుని కొరకు వెండితో, విద్యున్మాలి కోసం లోహముతో మూడు ఉత్తమ దుర్గములను నిర్మించి ఇచ్చాడు. తాను కూడా అందులో ప్రవేశించాడు.*
*ఆ మూడు పట్టణములు, స్వర్గము, అంతరిక్షము, భూమి మీద నిర్మించాడు మయుడు. ముగ్గురికి అప్పగించాడు. ఆ మూడు పురములు, కల్పవృక్షములచేత, ఏనుగులు, గుర్రాలతో, మణులతో నిర్మించ బడిన తెరలతో, పద్మరాగములచేత తయారు చేయబడి సూర్యమండల సమానతేజముతో ప్రకాశవంతముగా వెలిగిపోతున్నాయి. తారకాసురుని కుమారులు ముగ్గురు, తమ దివ్య పట్టణములలో మరింత బలిష్టులై, ప్రపంచాన్ని అంతా చుట్టి చూస్తూ ఉన్నారు. ఆ దుర్గమమైన పురములకు నాలుగు వైపులా తలుపులు అమర్చబడ్డాయి. ఆ మూడు పురములు, కైలాస పర్వతముతో సమానమైన ఎత్తైన, చంద్రసమానమై ఉజ్జ్వలంగా వెలుగుతున్నాయి. ప్రతీ పురములో అనేకమైన శివాలయములు కట్టబడి, పూజలు జరుగుతున్నాయి. అప్సరసలు, గంధర్వ, సిద్ధ, చారుణిలతో నిండి ఉన్నాయి. శివభక్తి ఒరాయణులు, శాస్త్రజ్ఞులు అయిన బ్రాహ్మణులు ప్రతీ పురములు లెక్కకు మిక్కిలి ఉన్నారు. అవి బావులు, దిగుడు బావులు, చెరువులు, పెద్ద పెద్ద కొలనులు, స్వర్గము నుండి జారి వచ్చిన వృక్షాలతో కూడిన ఉద్యానవనములతో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిస్తున్నాయి. పండ్ల భారముచేత వంగిన వృక్షములతో నగరములు శోభాయమానంగా ఉన్నాయి.*
*వేరు వేరు క్రీడాప్రాంగణములు, వేదాధ్యయనం చేయడానికి వేద పాఠశాలలు, ఆ మూడు నగరాలలో కట్టబడ్డాయి. ఆ నగరములు పాప ఆలోచనలు చేస్తూ, చెడు మాటలు మాట్లాడే వారికి కనిపించేవి కావు. ఆ పట్టణాలలో, పతివ్రతలు, శూరులు వీరులు అయిన దైత్యులు, శ్రుతులకు, పురాణాలకు అర్థం తెలిసిన బ్రాహ్మణులు తమ తమ భార్యలతో సుఖంగా నివాసం ఉన్నారు. ఆ మూడు పట్టణాలు, మయుని ద్వారా సృష్టించబడిన వీరులైన సేనలతో ఎల్లప్పుడూ కాపాడ బడుతున్నాయి. బ్రహ్మ, మహేశ్వరుల పూజ ప్రతీ రోజూ చేయడం వల్ల వారు, సుదృఢమైన పరాక్రమవంతులై, ఎటువంటి యుద్ధం అయినా అవలీలగా జయించ గలుగు తున్నారు. ఆ పట్టణాలలో, వేదములు, శాస్త్రములు, పురాణములలో చెప్ప బడిన విధంగా, ఆ దైత్య కుమారులు ముగ్గురూ, శివభక్తి తత్పరతతో, మూడు లోకములను బాధించుచు, విశాల సామ్రాజ్య భోగములు అనుభవిస్తున్నారు. ఈ విధంగా చాలా కాలము గడచింది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు