*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 078*
 కందం:
*పురుషుం డొనర్పని పనికి*
*నరయగ దైవం బదెట్టులనుకూలించున్*
*సరణుగ విత్తక యున్నను*
*వరిపండునె ధరణిలోన వరలి కుమారా !*
తా:
కుమారా! ఈ భూమి మీద రైతు, తన పొలంలో, ఒక వరుసలో పద్ధతి ప్రకారం వరి మొలకలు నాటకపోతే, పంట సరైన పద్ధతిలో రావలసినంత రైతు చేతికి అందదు. అలాగే, మనిషి చేయవలసిన ఒని చేయక, సోమరిగా కూర్చుండిపోతే,  ఆ దేవుడు కూడా ఇవ్వ వలసిన ఫలితం ఇవ్వలేడు............. అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*"గాలిలో దీపం పెట్టి, దేవుడా నీదే భారం" అన కూడదు అని పెద్దలు ఏనాడో చెప్పిన మాట. విద్యార్థులు పరీక్షలకు సరిగ్గా తయారు అవకుండా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి అని కోరుకుంటే అవుతారా! అవ్వరు కదా! కంచంలో పంచభక్ష్య పరమాన్నాలు ఉన్నా, చేతితో కలుపుకుని, నోటిలో పెట్టుకుంటేనే కడుపు నిండుతుంది. ఒక్క "మాయాబజార్" లో తప్ప. కారులో ఎక్కి కూచుంటే కారు కదలదు కదా! స్టీరింగ్ చేతిలోకి తీసుకుని నడపాలి. అందువలన, మనతో బాటు సమాజంలో మన చుట్టూ ఉన్న వారు, సోమరితనము, నా వల్ల ఏమీకాదు, నేను ఏమీ చేయలేను అనే ఆలోచనలను వదలి, ఎల్లప్పుడూ ఉత్సాహంగా, ఏదైనా సాధించాలి అనే తపన ఉండేటట్లుగా అనుగ్రహించాలని....... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు