సాహసనారి చిన్నారి - అద్భుత జానపద కథ - డా.ఎం.హరికిషన్ - కర్నూలు 9441032212
 హరిభూపాలుడు కందనవోలు సామ్రాజ్యానికి చక్రవర్తి. ఆయన ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకునేవాడు. అనవసరమైన పన్నులతో వేధించేవాడు కాదు. వచ్చిన పన్నుల్లో తొంభైశాతం తిరిగి ప్రజాసంక్షేమం కొరకే ఖర్చు పెట్టేవాడు.
రాజ్యమంతా కొత్తగా చెరువులను తవ్వించాడు. పాత చెరువులకు పూడిక తీయించి గట్లు బాగు చేశాడు.
నదులకు ఆనకట్టలు కట్టి నీళ్ళు లేని ప్రాంతాలకు పారించి మెట్టభూములను సస్యశ్యామలం చేయించాడు.
రకరకాల పరిశ్రమలు నెలకొల్పి ప్రజలకు చేతినిండా పని కల్పించాడు.
విద్యాలయాలు, వైద్యాలయాలు కట్టించి అన్ని కులాలవారికి ప్రవేశం కల్పించాడు.
వీధుల్లో చక్కటి రహదారులు వేయించి ఇరువైపులా పచ్చని పళ్ళ మొక్కలు నాటించాడు
. వృద్ధులకు, అనాధలకు, పేదలకు ఆశ్రమాలు కట్టించాడు.
రాజ్యంలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా, తక్షణమే ఆదుకునేవాడు.
అదే అతని బలం.
రాజ్యంలోని ప్రజలందరూ రాజంటే ప్రాణం పెట్టేవాళ్ళు.
ఆయన మాటే వేదవాక్కుగా భావించేవాళ్ళు. శత్రురాజులెవరైనా దాడి చేస్తే ప్రతి ఒక్కరూ ఆయుధం చేతబట్టి యుద్ధరంగంలో అడుగుపెట్టేవాళ్ళు.
రాజు మీద ఈగ కూడా వాలనిచ్చేవాళ్ళు కాదు.
శత్రువులు కందనవోలు పేరు చెబితే చాలు భయంతో గడగడా వణికిపోయేవాళ్ళు. కన్నెత్తి చూడటానికి గూడా జంకేవాళ్ళు.
ప్రజలు ప్రేమించే ప్రభువును ఎవరూ జయించలేరు.
కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా వుండవు గదా...
అటువంటి ప్రభువుకు గూడా ఒక ఊహించని ఆపద వచ్చి పడింది.
కందనవోలు రాజ్యానికి పట్టపురాణి చంద్రమౌళినీదేవి. రాజుకు తగిన భార్య. వారికి చాలా కాలానికి పుట్టిన ముద్దులకూతురే లాస్య.
చిన్నప్పటినుంచీ ఆ పాపను అందరూ 'చిన్నారి' అని ముద్దుగా పిలిచే  వాళ్ళు. ఆ పాప  ఎంత పెద్దగయినా ఆ పిలుపు మారలేదు.
లాస్యకు గూడా అందరూ అలా పిలవడమే ఇష్టం. ఎందుకంటే ఆ పిలుపులో ఒక ఆప్యాయత, ప్రేమ, దగ్గరితనం కనబడేవి.
లాస్య ఆడపిల్ల అయినా మగపిల్లలతో సమానంగా పెరిగింది. పట్టుదల, క్రమశిక్షణ, ఏదైనాసరే సాధించాలనే కోరిక లాస్యలో బలంగా వుండేది. చిన్నప్పటినుంచే గురుకులంలో ఒక పక్క చదువు, మరొక పక్క యుద్ధ విన్యాసాలు నేర్చుకోవడం మొదలుపెట్టింది.
కత్తి తిప్పడం, విలువిద్య, గుర్రపుస్వారీ, మల్లయుద్ధాలతో బాటు శబ్దభేది విద్య, ధ్వన్యనుకరణ విద్యలను గూడా నేర్చుకుంది.
కళ్ళకు గంతలు కట్టి ఎటువైపు చప్పుడు వస్తే అటువైపు క్షణంలో బాణం వేయగల నేర్పరి. రకరకాల పక్షుల, జంతువుల మాదిరి అరవడమేగాక అచ్చం మగవాళ్ళ మాదిరి గూడా మాట్లాడగలదు.
గురుకులంలో ఎవరూ ఏ విద్యలోనూ ఆమె కాలిగోటికి కూడా సరిపోయేవాళ్ళు కాదు. రెండు చేతుల్లోనూ రెండు కత్తులు అందుకొని గిరగిరగిర తిప్పుతూ సింహంలా శత్రుసేనల మధ్యకి చొచ్చుకొనిపోయేది.
అసలు భయమంటే ఏమిటో కూడా లాస్యకి తెలీదు.
పెదాలపై చిరునవ్వు తొలగదు. మొహంలో అలసట కనబడదు. వీరత్వాన్నే గాక జాలి, దయ, ప్రేమలను గూడా తల్లిదండ్రుల నుంచి పుణికి పుచ్చుకుంది.
**   ****    **
హరిభూపాలుని తమ్ముని కొడుకు మహీపాలుడు.
అతనికి చిన్నప్పటినుంచీ సింహాసనంపై ఆశ.
రాజుకు మగపిల్లలెవరూ లేకపోవడంతో తానే కాబోయే రాజునని కలలు కంటూ వుండేవాడు. కనబడిన వాళ్ళకంతా ఆ విషయం చెప్పి తన మాట వినకపోతే భవిష్యత్తులో కారాగారమే గతి అని బెదిరించేవాడు.
కానీ రాజు కావాలంటే ధైర్యసాహసాలు, తెలివితేటలు రెండూ కావాలి.
రాజు పేరు చెబితే శత్రువులు భయంతో వణికిపోవాలి. ప్రజలు అభిమానంతో దగ్గర కావాలి. అటువంటివాళ్ళే రాజు. దానికి ఆడా మగా తేడా లేదు.
అందుకే వీరురాలైన తన చిన్నారి లాస్యనే సింహాసనం మీద కూర్చోవడానికి అర్హురాలు అని మహారాజు భావించేవాడు.
మహీపాలుడు పైకి మంచివానిలా, అమాయకంగా, మహారాజువద్ద వినయ విధేయతలు నటిస్తాడు గానీ లోపల చానా దుర్మార్గుడు.
రాజ్యాధికారం కోసం అనేక కుట్రలు పన్నుతూ వుంటాడు.
మహారాజుకు ఈ విషయం ఎప్పటికప్పుడు గూఢచారుల ద్వారా తెలుస్తున్నా తమ్ముని కొడుకు కావడంతో చూసీ చూడనట్లు వదిలేస్తుంటాడు.  మహీపాలుడు రాజ్యంలో వున్న ముఖ్యమైన సేనాధిపతులను మంచి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, వారికి భారీగా లంచాల ఆశ చూపిస్తూ, పదవులు ఎర వేస్తూ తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తూ వుంటాడు.
కానీ ఎవరూ అతని మాటలను పట్టించుకునేవాళ్ళు కాదు.
లెక్కజేసేవాళ్ళు కాదు.
రాజంటే వాళ్ళందరిలో భయమూ, భక్తీ సమానంగా వున్నాయి.
కానీ మహీపాలుడు మాత్రం తన ప్రయత్నాలు ఆపలేదు.
ప్రతి ఒక్కరికీ ఏదో ఒకరోజు అవకాశం వస్తుందని బలంగా నమ్మేవాడు.
అటువంటి అవకాశం ఒకరోజు మహీపాలునికి రానే వచ్చింది.
**     ***     ** 
కందనవోలు రాజ్యానికి చుట్టూ చాలా పెద్ద అడవి వుంది. అందులో అనేక క్రూరమృగాలు వుండేవి. ఒకరోజు ఒక పెద్ద ఏనుగుల గుంపు దారి తప్పి అడవుల నుంచి బైటకు వచ్చి పొలిమేరల్లో వున్న గ్రామాలపైన పడింది. కాపుకొచ్చిన పంటలన్నీ నాశనం చేస్తూ, అడ్డొచ్చిన ప్రజల మీద దాడి చేయసాగాయి.
దాంతో ప్రజలందరూ ప్రాణభయంతో తమను కాపాడమని మహారాజును వేడుకున్నారు.
మహారాజు వందమంది వీరులైన సైనికులతో స్వయంగా తానే ప్రజలను కాపాడడానికి బైలుదేరాడు.
పెద్ద డప్పులు వాయిస్తూ, టపాసులు పేలుస్తూ పంటలమీద దాడి చేసిన ఏనుగులను పారద్రోలసాగాడు. ఆ చప్పుళ్ళకు భయపడి అవన్నీ తిరిగి అడవులవైపు పారిపోయాయి.
అలసిపోయిన మహారాజు అడవిలో ఒక చోట విశ్రాంతి తీసుకుంటూ వుండగా,  ఒక పొదలో వున్న పెద్దపులి వూహించని విధంగా వెనుకనుంచి దాడి చేసింది.
సరిగ్గా ఆ సమయంలో రాజు చేతిలో ఎటువంటి ఆయుధమూ లేదు.
తేరుకునేలోగా దాని పంజా దెబ్బ భుజాన్ని చీల్చివేసింది.
ఆపదను గ్రహించిన సైనికులు వెంటనే ఆ పెద్దపులిని బంధించారు గానీ అప్పటికే మహారాజు భుజం నుంచి విపరీతంగా రక్తం కారిపోవడంతో స్పృహ కోల్పోయాడు.
సైనికులు అత్యంత వేగంగా మహారాజును రథం మీద అంతఃపురానికి చేర్చారు. చక్రవర్తిని అలా చూసేసరికి చంద్రమౌళినీదేవి తల్లడిల్లి పోయింది.
రాజ్యంలోని ప్రముఖ వైద్యులందరూ వురుకులు, పరుగుల మీద అంతఃపురానికి చేరుకున్నారు. రాజ్యమంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది.
ప్రజలందరూ తమ ప్రభువుకు ఏమీ కాగూడదని కనబన్న దేవుళ్ళకంతా మొక్కులు మొక్కుకోసాగారు. దేవాలయాలన్నింటిలో పూజలు చేయసాగారు.
రక్తం బాగా కోల్పోవడంతో, గాయం పెద్దది కావడంతో మహారాజు అంత త్వరగా కోలుకోలేకపోయాడు. భుజంపై దెబ్బ బలంగా తగలడంతో కుడిచేయి చచ్చుపడిపోయింది.
రాజు మంచానికే పరిమితం కావడంతో నెమ్మదిగా పరిపాలన గాడి తప్పసాగింది. సామంతరాజులు తిరుగుబాటు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.
గూఢచారుల ద్వారా ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటున్న లాస్య ఇక లాభం లేదని తండ్రిగారి అనుమతితో పరిపాలన తన చేతుల్లోకి తీసుకొంది.
ఎదురు తిరిగిన సామంతులను ఎక్కడికక్కడ అణచివేసి నమ్మకస్తులైన కొత్తవారికి అధికారం అప్పగించింది.
అవినీతిపరులు, లంచగొండులు, స్వార్థపరులు, దురాశపరులైన అధికారులను గుర్తించి వారిని ఏరిపారేసింది.
అల్లకల్లోలమైన రాజ్యాన్ని నెమ్మదిగా దారికి తెచ్చి శాంతిని నెలకొల్పింది. పరిపాలనపై పట్టు బిగించింది.
యువరాణి ధైర్య సాహసాలు తెలిసిన శతృరాజులు యుద్ధ ప్రయత్నాలు మాని వెనుకడుగు వేశారు. ప్రజలంతా ప్రశాంతంగా గుండెలమీద చేతులు వేసుకొని హాయిగా నిద్రపోసాగారు.
కానీ మరో పెద్ద ఆపద త్వరలోనే పొంచి వుందని వారికి అప్పటికి తెలియదు.
*******

కామెంట్‌లు