సుప్రభాత కవిత ; -బృంద
నింగి నీలి మేఘమాలలన్నీ
నిలిచె మదిని రాగమాలికలై
మెత్తగ తాకే తొలి కిరణాలు
కొత్తగ తెచ్చెను కోరికలు

నిన్నటి పోరాటం గుర్తేలేదు
రేపటి ఆరాటం మొదలైపోయె!
తీరం దొరకక  మరలిన కెరటం 
మళ్లీ  ఊపున వచ్చిన తీరు

కఠినమైన  శిలల లాగా
దారికడ్డు తగిలిన కలతల
జరిపేటి  మలుపులేవో
దొరకునేమో  ఎవరికెరుక?

బండబారిన గుండెలోతున
కొండవాగు  పుట్టినట్టు
ఎండమావిగ మారిన కోరిక
కళ్ళ ముందు కనిపించునేమో!

బరువుగ మారిన బంధాలన్నీ
బలముగ చేయూతనిచ్చి
వెన్నుతట్టి చేదోడుగా
వెనువెంటే నడచివచ్చునేమో!

చీకటి మూసిన ఏకాంతంలో
తోడే లేని ఒంటరి పయనంలో
నేనున్నానని రోజూ వచ్చి
కోటి కలలకు  రూపం ఇచ్చే

బంగరువెలుగుల కొంగొత్త వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు