*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0257)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
శంఖచూడుడు రాజగుట - దేవతల ఓటమి - దేవతలు, బ్రహ్మ, విష్ణు దేవునకు మొర పెట్టుకోవడం - శంఖచూడుని పుట్టుక తెల్పి, పరమశివుని శరణు కోరడం......
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*నారదా! బ్రహ్మ నైన నా నుండి వరము పొందిన శంఖచూడుడు, శ్రీకృష్ణ కవచము ధరించి, ధర్మధ్వజుని కుమార్తె తులసిని వివాహమాడి, రాజ్యాభిషిక్తుడై, తన ప్రజలను చల్లగా, చక్కగా పరిపాలిస్తున్నాడు. శంఖచూడుడు దానవుడైనా అతని బుద్ధి రాక్షస బుద్ధి కాదు. సుదాముడు అనే శ్రీకృష్ణ సహచరుడు శాపవశాన దంభుని కుమారుడు గా పుట్టాడు. ఈతని శక్తి, సామర్ధ్యాలు చూసిన మిగిలిన రాక్షసులు, దైత్యులు తమ గురవైన శుక్రాచార్యును వెంట బెట్టుకుని,శంఖచూడుని సభకు వచ్చి, "మీరు అత్యంత బలశాలి, బుద్ది మంతులు, ధైర్యవంతులు.  కనుక, మీరే మాకు అందరకు చక్రవర్తిగా ఉండి, దేవతల ఆధిపత్యాన్ని తొలగించాలి" అని వేడుకున్నారు. తమ గురువు శుక్రాచార్యుడు వచ్చిన విషయం తెలుసుకుని, శంఖచూడుడు ఎదురు వెళ్ళి, సాదరంగా స్వాగత సత్కారాలు చేసి ఉచిత ఆసనం ఇచ్చి కూర్చుండబెట్టాడు. అక్కడ, ఆ సభలో ఉన్న దైత్య సమూహం కోరిక తెలుసుకున్న దైత్య గురువు శుక్రాచార్యుడు, రాక్షసుల అందరి సమ్మతితో శంఖచూడుని అధిపతిని చేసాడు.*
*అలా దైత్యాధిపతి అయిన శంఖచూడుడు, అకస్మాత్తుగా దేవతల మీద దాడి చేయడం, దేవతలను అందరినీ యుద్ధంలో పరాజయులను చేయడం, చాలా తక్కువ కాలంలో జరిగిపోయింది. దేవతల ఆధిపత్యాన్ని, తన సొతం చేసుకున్నాడు. యజ్ఞ భాగాలు ఎవరికీ రాకుండా, మొత్తం తానే తీసుకుంటున్నాడు. శంఖచూడుడు, స్వతహాగా కృష్ణ భక్తుడు. తన కృష్ణ భక్తిని, దేవతల మీద దండయాత్ర చేసినప్పుడు కూడా మరువలేదు. ముల్లకోములలో ఉన్న ఈ దానవ రాజు యొక్క ప్రజలు కూడా నిత్యమూ కృష్ణ ధ్యానమలోనే ఉండేవారు. ఈ విధమైన భక్తి భావం, ధార్మికత ఎక్కవగా ఉండడం వల్ల, నేల నాలుగు చెరగులా, నాలుగుకాలల పాటు వర్షాలు సమృద్ధిగా కురిసేవి. దుక్కి దున్నకుండానే భూమి అన్ని పంటలను, పండ్లను అందించేది. రోగాలు రొష్టులు శంఖచూడుని రాజ్యం సరిహద్దు దగ్గరగా కూడా రాలేక పోతున్నాయి. ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఒక్క దేవతా సమూహం తప్ప. దేవతలకు, దానవులకు ఉన్న ఆజన్మ వైరం కారణంగా, శంఖచూడుని ధాటికి దేవతలు ఓటమిని చవి చూసి, అనేక కష్టాలు, బాధలు అనుభవిస్తున్నారు.*
*దానవరాజు శంఖచూడుని రాక్షస కృత్యాల కరాళ నాట్య విన్యాసాలు, వాటి వల్ల కలుగుతున్న బాధలు దేవతా సమూహం భరించ లేకుండా ఉంది. చెట్టు తొర్రలలో కొందరు దాక్కుని బతుకు జీవుడా అని అనుకుంటే, ఇంకొందరు నాలుగు దిక్కులా చెల్లాచెదురుగా విడి పోయారు. ఐక్యతగా ఉండడం అనే ఆలోచనే వారి మనసుల్లోకి రావడం లేదు. ముల్లోకాలలో అందరూ సుఖంగా ఉన్నారు, ఒక్క తాము తప్ప. ఈ బాధలనుండి తమను రక్షించమని బ్రహ్మ నైన నన్ను ప్రార్ధించారు. ఎక్కవగా కలత చెంద వద్దని ధైర్యం చెప్పి, అందరమూ కలసి, సర్వవ్యాపి అయిన విష్ణుమూర్తి దగ్గరకు బయలుదేరాము.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు