*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 089*
 కందం:
*కులభామల విడువకు వెలు*
*పొలతుల వీక్షించి మోహమును బొరలకుమీ*
*ఖలుఁడందు రెట్టివారలు*
*గులహీనుఁడు పుట్టెననుట కొరలు కుమారా !*
తా:
కుమారా! ఈ లోకములో ఎప్పుడూ కూడా నీ భార్యను విడిచి పెట్టకు. పరాయి స్త్రీని చూచి మోహము కలిగింది అని ఆమె వెంట తిరగకు. నీ భార్యను విడిచి, పర స్త్రీల వెంట తిరుగుతుంటే, అందరూ నిన్ను దుర్మార్గుడు, వంశాన్ని, ఇంటిపేరును చెడగొట్టడానికే పుట్టాడు అనే చెడ్డపేరు నిలచి పోతుంది............. అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*మనం ధర్మబద్ధంగా ఉన్నంత కాలం, మనల్ని సమాజం గుర్తు పడుతుందో లేదో గానీ, మనకు తెలియకుండానే ఒక చిన్న పొరపాటు పని, మనతో జరిగితే, మనవైపు వేలెత్తి చూపడానికి ఏమాత్రం వెనుకాడదు. ఇది, నిజంగా నిజం. అలాంటప్పుడు, తెలిసి మరీ, మోహావేశంతోనో, మితిమీరిన డబ్బు ఆశవల్లో, తప్ప పనులు చేసి, తద్వారా ధనం సంపాదించు కుంటే, మన దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి, అప్పటికి చూసీ చూడనట్టు ఉంటే ఉండవచ్చు. కానీ, మన దగ్గర ఉన్న డబ్బు, ఆరోగ్యం అన్నీ పోయి రోడ్డున పడ్డప్పుడు, అప్పటి వరకు మనతో ఉన్న వారు కూడా, చేసిన పాపపు పనుల ఫలితం అనుభవించాలిగా అని, మెటికలు విరుస్తారు. కాబట్టి, పెద్దలు చెప్పారు కదా, అందం, డబ్బు, ఆరోగ్యం, ఇంకా ఇతర ప్రాపంచిక విషయాలు ఏవీ కూడా శాస్వతం కాదు అని తెలుసుకుని, సాధ్యమైనంత వరకు ధర్మ మార్గంలో నడిచే సద్బుద్ధిని ప్రసాదించమని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు