*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 097*
 కందం:
*ధర నొక్క బుద్ధిహీనునిన్*
*దిరముగ రోటనిడి దంచెనేనియు, బెటుచం*
*దురు, యగును గాని యతనికి*
*సరసత్వము గలుగదండ్రు సతతము కుమారా !*
తా:
కుమారా! ఈ భూమి మీద, ఒక బుద్ది లేని మనిషిని, దుష్ట చరిత్ర ఉన్న వ్యక్తిని, రోటిలో ఉంచి మంచిగా శరీర శుద్ధిచేసిన తరువాత కూడా అతనికి మంచి బుద్ధి రావడం గానీ, మంచి మనిషిగా మాడానికి గానీ ఎటువంటి అవకాశం ఉండదు.............. అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ఈ పరిస్థితి కి మన పురాణాలలో కనిపించే పాత్రలు, రావణబ్రహ్మ, దుర్యోధనుడు. బుద్ధి వస్తుంది ఏమో అనే ఆలోచనతో కౌరవసభలోని పెద్దలు, రావణ సభలో విభీషణుడు, హనుమ, రావణుని భార్య మండోదరి ప్రయత్నాలు ఒక్క రవ్వ కూడా పని చేయలేదు. అలాగే, 18 అక్షౌహిణుల సైన్యం చనిపోయినా, కురవంశమే నాశనమైనా, రావణ బ్రహ్మ వంశం కూడా నాశనమైనా వారిద్దరిలో మార్పు కనబడదు. ఇది మనకు తెలుపబడిన నిజం. కాబట్టి, మనం ఇటువంటి చెడు లక్షణాలను ఒంట పట్టించుకోకుండా, మన గురువులు చెప్పే మంచిని అర్థం చేసుకుని, ఆచరించే మంచి బుద్ధి ని మనకు ఇమ్మని........ కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు