*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 098*
 కందం:
*విత్తంబు విద్య కులము*
*న్మత్తులకు మదంబొసంగు; మాన్యులకున్ స*
*ద్వృత్తినొసంగున్ వీనిన్*
*జిత్తంబున నిడి మెలంగ జెలగు కుమారా !*
తా:
కుమారా! ఈ ప్రపంచంలో, డబ్బు, సంపద, చదువు, పుట్టిన వంశం మనకు ఉన్నాయి అనే గర్వంతో, చెడు తిరుగుళ్ళు తిరుగుతూ చెడ్డ దారిలో నడిచే వారికి, వారి గర్వాన్ని పెంచి, వారిని ఇంకా చెడగొడుతుంది. ఇవే గుణాలు ఇతరుల మేలు కోరుకుంటూ, మంచి దారిలో నడచే వారికి, ఇంకా ఇంకా మంచిపేరు తీసువచ్చి, సమాజంలో మంచి గుర్తింపు ఇస్తాయి. ఈ విషయం అర్థం చేసుకుని, ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ, మంచిగా ఉండాలి.............. అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ఇక్కడ మనకు కనిపించేది మళ్ళీ కౌరవులు, పాండవులే. కౌరవులు తమ రాజ్య సంపద, నేర్చుకున్న విద్యలు చూసుకుని తమకంటే ప్రపంచంలో ఎవరూ గొప్పవారు కాదని, ఎవరూ తమకంటే ఎత్తులో ఉండకూడదని కోరుకుని, సర్వనాశనం అయిపోయారు. పాండవులు, తమ సంపదకు కానీ, తమ ఉన్నతికి కానీ, తమ శక్తి సామర్ధ్యాలు కారణం కావని, తాము నమ్మి కొలచిన దైవం, కృష్ణ పరమాత్మ తమకు అండగా ఉండడం వల్లనే ఇది జరిగింది, జరుగుతోంది, జరుగుతుంది అని దృఢంగా నమ్మి ఉన్నారు. అవకాశం ఉన్నంత వరకు నలుగురు మేలు, మంచి కోరుకున్నారు. అందువల్ల, కొంత ఆలస్యమైనా, తమకు రావలసింది, వారి వద్దకు వచ్చి చేరింది. అందుకని, మనం కూడా ఈ ప్రాపంచిక విషయాలను నిజం అని నమ్మి గర్వ పడకుండా నడచుకునే మంచి లక్షణాలను మనకు ఇవ్వమని........ కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు