అనుమానం పెనుభూతం (కమ్మని వూహలు , అందమైన అబద్దాలు)డా.ఎం.హరికిషన్- కర్నూలు-9441032212
 పిల్లలూ... పూర్వం ఇప్పుడున్నట్లు పగలూ, రాత్రి అస్సలు లేవంట. లోకమంతా ఎప్పుడూ చిక్కని చీకటేనంట. మరి ఈ పగలూ, రాత్రి ఎప్పుడేర్పడ్డాయి, ఎట్లా ఏర్పడ్డాయో తెలుసా... తెలీదు గదా... అయితే సరదాగా ఒక నిజం లాంటి అబద్దపు కథ చెబుతా... వినండి.
పూర్వం లోకమంతా ఒకటే చీకటంట. కన్ను పొడుచుకున్నా కనబడనంత చిక్కని చీకటంట. కానీ అడవిలోని జంతువులకీ, పక్షులకీ, కీటకాలకీ, పురుగులకీ... అన్నిటికీ తల దగ్గర వెలుగులు విరజిమ్మే ఒక మణి లాంటిది వుండేదంట. దాని వెలుగులో అవి దారి చూసుకుంటా తిరుగుతా వుండేవి. అట్లా కాలం గడిచిపోతా వుంది. కానీ ఆ వెలుగు దాండ్లకు ఏ మూలకూ సరిపోవడం లేదు. చాలా దూరంలో ఏమి జరుగుతుందో దేనికీ కనబడేది గాదు.
దాంతో సింహంరాజు అడవిలో ఒక పెద్ద సభ ఏర్పాటు చేసింది. అడవిలో వుండే అన్ని జీవరాశుల్నీ పిలిచింది. సింహంరాజు సింహాసనం మీద కూర్చోని ''మిత్రులారా... మన తాత ముత్తాతలు బతికినట్లే మనమూ... మనము బతికినట్లే మన పిల్లలూ... ఇట్లా ఎంతకాలం ఈ చీకటిలో మగ్గిపోవడం. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. అది మనమే ఎందుకు కాగూడదు. చెప్పండి. ఈ చీకటిని తొలగించి అడవంతా కమ్మని వెలుగులు పంచే మార్గం ఏదయినా వుందా'' అనడిగింది.
జంతువులు, పక్షులు, కీటకాలు, పురుగులు అన్నీ గుంపులు గుంపులుగా చేరాయి. తలలు బద్దలు కొట్టుకున్నాయి. కిందామీదా పడ్డాయి. చివరికి అడవిలో అన్నింటికన్నా తెలివైన నక్క లేచి ''రాజా! నాదో ఆలోచన... మనం ఏదయినా ఒక పెద్ద వస్తువును చేసి, దానిని కాంతితో నింపి ఆకాశంలో చుక్కల పక్కన వదులుదాం. అది భూమంతా చక్కని వెలుగును వెదజల్లుతుంది. ఏమంటారు'' అంది. జీవరాశులన్నీ ఆలోచించాయి. ''భలే... భలే... నక్క ఆలోచన అద్భుతం'' అని మెచ్చుకున్నాయి.
వెంటనే జంతువులంతా బాగా ఆలోచించి గోధుమపిండితో ఒక పెద్ద బంతిలాంటి ఆకారాన్ని తయారుచేశాయి. అన్నీ తమ మణుల్లోంచి కొంచం కొంచం విరగ్గొట్టి దాని చుట్టూ అతికించాయి. దాంతో అది తెల్లగా ధగధగా మెరిసిపోతా కాంతిని చుట్టూ వెదజల్లసాగింది. సింహంరాజు దానికి ''చందమామ'' అని పేరు పెట్టాడు.
మరి దాన్ని ఆకాశంలోకి పంపించడమెట్లా... సింహం రాజు పక్షులన్నింటినీ పిలిపించాడు. మీరంతా కలసి దీన్ని అన్నివైపులా పట్టుకొని ఆకాశంలోకి తీసుకుపోయి వదలగలరా అని అడిగింది. కానీ పక్షులు ''అమ్మో... దీన్నా... ఇది చాలా బరువుంది. మేమేదో కొంచం పైకంటే ఎగరగలముగానీ మరీ చుక్కల దగ్గర కంటే ఎగరలేం. అదీ ఇంత బరువు మోసుకోని'' అని వెనకడుగు వేశాయి.
ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తా వుంటే మళ్ళా నక్కే ముందుకొచ్చింది. ''ఏం లేదు రాజా! మనం ఒక పెద్ద క్యాట్‌బుల్‌ని తయారు చేద్దాం. దాంట్లో ఆ చందమామను పెట్టి అందరం కలసి బలంగా వెనక్కు లాగి ఒక్కసారిగా వదులుదాం. అంతే... అది రయ్యిన డేగలెక్క మబ్బుల్లో దూసుకుపోయి చుక్కల దగ్గర పడుతుంది. ముందు... రెండు తాటిచెట్లు బాగా ఎత్తయినవి ఎక్కడయినా పక్కపక్కనే వున్నాయేమో వెదకండి'' అంది. జంతువులన్నీ అడవంతా వెదికి ఒకచోట రెండు తాటిచెట్లు పక్కపక్కనే వుండడం కనిపెట్టాయి. వాటికి రెండువైపులా లాగగానే బాగా సాగి... వదలగానే మరలా మామూలుగా మారిపోయే గుణం వున్న... జంతువుల నరాలను చనిపోయిన వాటి నుంచి సేకరించి తాడులాగా అల్లాయి. మెత్తని చర్మాన్ని చివరన వుయ్యాలపీటలాగా కట్టాయి. అందులో చందమామను వుంచి అడవిలోని బలమైన ఏనుగులను పిలిచాయి. అవి తమ తొండాలతో దాన్ని బాగా వెనక్కు లాగసాగాయి. జంతువులన్నీ ''ఇంకా... ఇంకా...'' అని గట్టిగా అరవసాగాయి. సింహంరాజు గట్టిగా ''ఒకటి... రెండు... మూడు...'' అని గట్టిగా అరిచింది. అంతే... ఏనుగులన్నీ ఒక్కసారిగా వదిలేశాయి. వింటి నుంచి వెలువడిన బాణంలా చందమామ రివ్వున ఆకాశంలోకి దూసుకుపోసాగింది. పక్షులూ, జంతువులూ, పురుగులూ, కీటకాలు అన్నీ వూపిరి బిగపట్టి చూడసాగాయి. చందమామ అలా మబ్బుల్లోకి దూసుకుపోయి చుక్కల పక్కన నిలబడిపోయాడు. అంతే... భూమంతా ఒక తెల్లని వెలుగు మసకమసకగా పరచుకొంది. నల్లని చీకట్లు తొలగిపోయాయి. అడవంతా ఆనందంతో సంబరంగా పండుగ చేసుకొంది.
అట్లా కొంతకాలం గడిచింది. కానీ వాటి ఆనందం ఎక్కువకాలం నిలబడలేదు. ''గుడ్డికన్ను మూసినా ఒకటే తెరచినా ఒకటే అన్నట్లు ఏం వెలుగిది. మసకమసకగా అట్లా చీకటీ కాదు. ఇట్లా వెలుతురూ కాదు'' అని అన్నీ గొణుక్కోవడం మొదలుపెట్టాయి. దాంతో సింహంరాజు మళ్ళా అన్నింటినీ ఒకరోజు సమావేశపరిచింది.
అప్పుడు నక్క పైకి లేచి ''చూడు మహారాజా... పిండి కొద్దీ రొట్టె అంటారు పెద్దలు. మనం ఏదయినా ఒకటి కావాలనుకుంటే మరొకటి వదులుకోక తప్పదు. మనం మన వెలుగులు పూర్తిగా వదులుకోకుండా అద్భుతమైన మిరుమిట్లు గొలిపే కాంతిని పొందలేం ఆలోచించండి'' అంది. సింహంరాజు బాగా ఆలోచించింది. ''అవును నువ్వు చెప్పింది నిజమే. ఈసారి మరలా మరింత వెలుగులు విరజిమ్మేలా మరొక బంతిని తయారు చేద్దాం. అడవిలో వుండే అన్ని జీవరాశులు తమ మణులను మొత్తం ఈ కొత్తబంతికి అతికించాలి'' అంది. అన్నీ ''సరే... సరే... మేము సిద్ధం'' అన్నాయి.
ఆ అడవిలో ఒక మిణుగురు పురుగుంది. అది పెద్ద అనుమానంది. వూరందరిదీ ఒక దారయితే వులిపిరి కట్టెది ఒకదారన్నట్లు ఏ పని చేయాలన్నా వందసార్లు ముందుకొచ్చి వెయ్యిసార్లు వెనక్కు పోతాది. దానికి ఈ కొత్తబంతిని వదిలినపుడు అది పైకి పోలేక కిందికే పడి పగిలిపోతే ఎట్లా... పైకి పోయినా చందమామలెక్కనే తక్కువ వెలుగులు పంచితే ఎట్లా... అసలు మొదట్లోనే ఏనుగులు గట్టిగా లాగేటప్పుడు తట్టుకోలేక తాటిచెట్లు విరిగిపోతే ఎట్లా... ఇట్లా అనేక అనుమానాలు వచ్చాయి. దాంతో చేతిలో వున్న గంజిని పారబోసి ఎక్కడో వున్న పాయసం కోసం ఆశపడడం ఎందుకు అనవసరంగా'' అని తన మణిని ఇవ్వకుండా ఒక పొదలో దాచిపెట్టుకుంది.
జంతువులన్నీ ఈసారి చందమామ కంటే పెద్ద బంతిని తయారు చేశాయి. వరుసగా ఒకొక్క జీవి వస్తూ తమ తలల మీద వెలుగులీనుతున్న మొత్తం మణిని తీసి దానికి కరిపించడం మొదలుపెట్టాయి. అట్లా అన్నీ కరిపించేసరికి చందమామ కంటే వేయిరెట్లు వెలుగులు వెదజల్లుతా కొత్త బంతి తయారయింది. దానికి సింహంరాజు ''సూర్యుడు'' అని పేరు పెట్టాడు. మరలా అన్నీ కలసి ఈసారి సూర్యునికి తగినట్లుగా మరింత పెద్ద క్యాట్‌బుల్‌ను తయారు చేశాయి. చందమామ ఏవైపున్నాడో చూసుకొని మరోవైపుకి సిద్ధం చేశాయి.
ఏనుగులన్నీ కలసి తమ తొండాలతో దాన్ని బాగా వెనక్కు లాగసాగాయి. ''ఇంకా... ఇంకా గట్టిగా... లాగండి... లాగండి... మీ శక్తంతా ఉపయోగించి లాగండి... ఈసారి మరింత పైకి పోవాలి...'' అంటూ జంతువులన్నీ అరుపులతో, కేకలతో, ఈలలతో, చప్పట్లతో హుషారెత్తించసాగాయి. ఏనుగులు మరింత... మరింత... వెనుకకు లాగసాగాయి. పాపం... వాటి తొండాలు చిట్లి రక్తం కారసాగింది. అయినా అవి ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆ తెల్లని బంతి రక్తంతో తడిచిపోయి ఎర్రగా ధగధగా మెరవసాగింది. పాపం జంతువులన్నీ కన్నీళ్ళు పెట్టుకున్నాయి. సింహంరాజు 'ఒకటి... రెండు... మ్మూడు...' అని గట్టిగా ఒక్కరుపు అరిచాడు. అంతే... ఏనుగులన్నీ ఒకేసారి తొండాలు వదిలేశాయి. సూర్యుడు గాలిని చీల్చుకుంటూ దూసుకుపోయి చుక్కల కంటే పైకి చేరాడు. అంతే... భూమంతా ధగధగధగ వెచ్చని వెలుగులు విరజిమ్మాయి. అడవంతా ఏనుగులను కౌగిలించుకొని సంబరాలు చేసుకున్నాయి. ఆ అరుపులు, కేకలు విని మిణుగురు పురుగు పొదల్లోంచి బైటకొచ్చింది. లోకమంతా కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగు కనబడింది.
అంతలో దాన్ని ఒక సీతాకోకచిలుక గమనించింది. ''అరే... మేమంతా మా మణులన్నీ సూర్యునికి అతికిస్తే నీవు మాత్రం అట్లాగే పెట్టుకుంటావా? వుండు నీ పని చెబుతా'' అని కోపంగా దాన్ని పట్టుకొని సింహం రాజు దగ్గరికి గుంజుకుపోయింది.అది వణికిపోతా ''మహారాజా... నేనెంత... నా మణెంత. చాలా చిన్నదాన్ని. ఈ ఒక్కసారికి వదిలెయ్యండి. తప్పయింది'' అంటూ ప్రాధేయపడింది.
సింహం రాజు దాని వంక చూసి ''చూడు... బొట్టు బొట్టు కలిస్తేనే గదా సముద్రమయ్యేది. అందరూ నీలాగే అనుకుంటే ఈ వెలుగులు ఎక్కన్నించి వచ్చేవి. మాటకు కట్టుబడని నీలాంటి వాళ్ళని వూరికే వదిలివేస్తే రేప్పొద్దున ఇంకొకరు ఇలాంటి తప్పే మరలా చేస్తారు. కాబట్టి ఏ వెలుగులైతే వస్తాయని నువ్వు నమ్మలేదో ఆ వెలుగుల్లో ఇప్పటినుంచీ తిరగొద్దు. రాత్రివేళ నీ వెలుగుల్లో నీవు దారి చూసుకుంటూ ఎప్పట్లాగే చీకట్లోనే బ్రతుకు'' అని ఆజ్ఞాపించింది.
అందుకే... అప్పటి నుంచీ మిణుగురు పురుగులు మాత్రం రాత్రివేళ మిణుకు మిణుకుమని మెరుస్తా చీకట్లో దారి వెదుక్కుంటా తిరుగుతా వుంటాయి.
***********

కామెంట్‌లు