గువ్వలం-మువ్వలం !;- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
 రివ్వున ఎగిరే గువ్వలం
 గళ్ళున మోగే మువ్వలం
ఇల ఉల్లము దోచే పిల్లలం
తెల తెల్లని వన్నెల మల్లెలం !

చదువు కోసం మేం బడికి
చదువులమ్మ మా గుడికి
పోతుంటాం రోజూ రోజూ
తీర్చుకుంటాం మా మోజు !

మోగిస్తాం మేం మా బడిగంట
పండిస్తాం మా చదువుల పంట
గురువే మాకు ఇలలో దేవుడు
 కొలిచే మా అభినవ రాముడు !

 మేం చదువుల సారం గ్రహిస్తాం
మా పదవుల భారం వహిస్తాం
అక్షర యజ్ఞం జరిపిస్తాం అంతా
అక్షర లక్షలు కురిపిస్తాం మీ చెంత !

ఆటలు ఆడిస్తారులే గురువులు
పాటలు పాడిస్తూ వేస్తారు దరువులు
గెలిచిన వారికి ఇస్తారులే బహుమతులు
ఓడిన వారికి పోతాయిలే ఇక మతులు !

బడిలో కథలు-గాధలు వింటాం
గుడిలో కలిసిమెలిసి ఉంటాం
నిత్యం గురు దీవెనలు కోరుతుంటాం
సత్యం చదువుల గుడికి చేరుకుంటాం!

ఉన్నారులే మాకెందరో దోస్తులు
చదువు సంధ్య లే మాకు ఆస్తులు
చదువుల గుడియే మా దేవాలయం
పదవుల మడియే మా ప్రేమాలయం!

మా చదువుల తల్లి భారతి
మేం ఇస్తాం ఆమెకు హారతి
ఆ దేవత ఇస్తుంది అభయం
మా భవితంతా ఇక వైభవం !


కామెంట్‌లు