నీటివిలువ.-డా. బెల్లంకొండ నాగేశ్వరరావు. చెన్నయ్ .9884429899.
  అడవిలో జంతువులు,పక్షులు అన్నికలసి సింహరాజుగారి గుహముందు సమావేశం అయ్యయి. " మిత్రులారా వేసవిలో మన అడవిలోని చెరువులో నీరు ఇంకిపోవడంతో అడవిపరిసర గ్రామాలలో మనదాహం తీర్చుకోవడా నికి వెళుతున్నాం. దాంతో గ్రామప్రజలు భయభ్రాంతులై మనపైన దాడి చేస్తున్నారు. అసలు వాళ్ళు మన అడవులు ఆక్రమించుకొని గ్రామాలు నిర్మించడం వలనే ఇలాజరుగుతుంది.  ప్రతిసంవత్సరం మనఅవసరాలకు సరిపడా నీరు లభించకపోవడంతో మనం అందరం పిల్లా,పాపలతో అడవి ఎగువున ఉన్నకృష్ణానది తీరాని వెళ్ళవలసి వస్తుంది. ఇది మనందరికి ఎంతో శ్రమతోకూడినపని మన అవసరాలకు సరిపడా నీటిని నిల్వచేసే మార్గం ఏదైనా మీలో ఎవరైనా సలహ ఇవ్వగలరా? "అన్నాడు సింహరాజు. " ప్రభూ సమస్త ప్రాణ కోటికి నీరు ప్రాణాధారం. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. మన భూమిపై ఒక వంతు నేల ఉంటే మరో మూడు వంతుల పాటు నీళ్లే ఉన్నాయి. కానీ ఆ నీరు మనం తాగడానికి, ఉపయోగించుకోవడానికి పనికి రాదు. భూమిపై ఉన్న కొద్ది పాటి నీటిని మాత్రమే మన అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు బస్తికి వెళ్ళివచ్చే కోతి ఏదైన ఈవిషయంలో సలహ ఇవ్వగలడేమో " అన్నాడు గుర్రం.
" ప్రభూ మనకూడా మనుషుల్లా ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకుంటే అప్పుడు భూమిలో నీరు నిల్వఉండటంవలన మన చెరువులు అంత త్వరగా ఎండిపోవు "అన్నాడు కోతి. "ఇంకుడు గుంతలు అంటే ఏమిటి " "అన్నాడు నక్క.
" మనుషులువాళ్ళ ఇంటి కప్పు మీది వర్షం నీరు ఒక గొట్టాల ద్వారా వారిఇంటి ముందో,పేరట్లోకి వచ్చే ఏర్పాటు చేసుకొని దాన్ని ఇంకుడు గుంటకు కలుపుతారు. తద్వారా వారు భూగర్బ జలాలను భూమిలో దాచుకుంటారు. మనకి ఆ అవకాశంలేదు కనుక పల్లపు ప్రాంతాలను ఎంపికచేసుకుని వాటినే మరింత లోతుగా తొవ్వి అందులోనుండి వచ్చిన మట్టినే ఆపల్లపు ప్రాంతానికి కట్టలా ఏర్పాటు చేస్తే ప్రతి వర్షపు నీటిచుక్క మనం వృధాకాకుండా ఈపల్లపు ప్రాంతమైన చిన్నచెరువులలో నీటిని నిల్వచేయవచ్చు. మన అవసరాలకు పొదుపుగా ఆనీటిని వాడుకోవచ్చు. ఇలా అడవిలోని ప్రతి పల్లపు ప్రాంతాన్ని చిన్నచిన్న చెరువులుగా మార్చడం వలన మరోప్రయోజనంకూడాఉంది. అడవిలో తరచుగా జరిగే అగ్నిప్రమాదాలకు ఆర్పడానికి అవసరమైన నీరు అన్ని ప్రాంతాలలో ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుంది " అన్నాడు కోతి.
" భేష్ మంచి ఆలోచన మనందరం శ్రమదానంతో ఇంకుడు గుంతలు అడవి పల్లపు ప్రాంతాలలో ఏర్పాటు చేసుకుందాం,పల్లపు ప్రాంతాలను గుర్తించేపని మనపక్షులకు అప్పగిస్తున్నాను. రెండురోజుల్లో అడవిలోని పల్లపు ప్రాంతాలుగుర్తించి వాటినిమనం వర్షపునీరు నిల్వచేసే ఇంకుడు గుంతలుగా మారుద్దాం అప్పుడు మన అడవిలోని చెరువులు ఎండిపోయే ప్రమాదం ఉండదు" అన్నాడు సింహరాజు.జంతువులన్ని ఆమోదంగా తలలు ఊపాయి.
 

కామెంట్‌లు