అద్వైత శంకరుడు-- శంకర ప్రియ., శీల.,-- సంచార వాణి: 99127 67098
 🔱ఆకాశ గంగను దాల్చి
జ్ఞానగంగ నొసంగిన
     అద్వైత శంకర! భవ!
జయ గురుదేవ! శివ! (1)
🔱కైలాసగిరి వాసుడ!
కైవల్య మిమ్ము! మాకు!
    అపర శంకర! భవ!
జయ గురుదేవ! శివ! (2)  
       (అష్టాక్షరి గీతి., శంకర ప్రియ.,)
👌జగద్గురువు ఆదిశంకరులు.. అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించారు! "వసుధైక కుటుంబం" భావమునకు.. శ్రీకారము చుట్టారు! మన భరతఖండములో  అవైదికమతములు ప్రబలినప్పుడు; సనాతన వైదిక ధర్మము పరిరక్షణకు పూనుకున్నారు! మనభారతీయ "హైందవ శంఖారావం" పూరించారు!
      ఆసేతు హిమాచల పర్యంతమైన, సువిశాల భారతదేశమంతటా  మూడుమారులు పర్యటించారు! నాస్తిక తత్త్వమును హేతుబద్దంగా ఖండించి, సనాతన భారతీయ ధర్మమును పునరుద్ధరించారు!
👌ఆది శంకరులు.. పంచాయతన పూజా విధిని ఏర్పరచారు! దేశంలో షణ్మతములను నెలకొల్పారు! అట్లే,
 ప్రస్థానత్రయాది అనేక గ్రంథములను  రచించి, ఉపనిషత్తు ప్రతిపాద్యమైన "అద్వైత సిద్ధాంతము"ను అందరికీ ఉపదేశించారు! ఆధ్యాత్మిక సాధకులకు "జీవన్ముక్తి"ని కలిగిoచారు! అత్యల్పమైన తమ 32సంవత్సరముల జీవన యాత్రలో... చిరస్థాయి యైన అసాధారణ కార్యములను  చేపట్టారు!
          ఆ విధంగా, లోకోద్ధారణ కావించిన.. "మహా మనీషి"! కనుక, ఆది శంకరాచార్యులే "జగద్గురువులు"! సార్థక నామధేయులు!
🚩జయ జయ శంకర! 
     హర హర శంకర!
            ⚜️ ఉత్పల మాల
      ఆతడమేయ దివ్య మహిమాన్వితుడీ ధరణీ తలాన నా
     సేతు హిమాచలమ్ము విలసిల్లగ జేసె సనాతనమ్ము; వి
      ఖ్యాత జగద్గు రూత్తముడు; కారణ జన్ముడు నీశ్వరాంశ సం
      జాతుడు శంకరుండు, మనసా వచసా నుతియింతు స్వామినిన్!!(1)
            ⚜️ మత్తేభ పద్యం 
      అమితోత్సాహము తోడ ధీరవరుడై, యద్వైత సిద్ధాంత శం
      ఖము బూరించి, సమస్త దుర్మతి మనఃకాంతార గర్వాంధకా
      రము దూరమ్ముగ బారద్రోలి, నిగమ ప్రామాణ్య సంస్థాపనో
       ద్యమ సంరంభము జూపినట్టి, గురుపాద ద్వంద్వమున్ గొల్చెదన్!! (2)
         ⚜️ కంద పద్యం 
      ఆతని చారిత్రమ్ములు
      చేతోహరణమ్ము, లమృత సేచనములు; సం
      గీత శ్రావ్యమ్ము, లవి
      ద్యా తిమిర గ్రసనములు;  సదాశుభ గుణముల్!! (3)
      ( రచన: డా. కోడూరి విష్ణునందన్., "ధర్మ దండము" అను శంకరాచార్య చరిత్ర పద్యకావ్యము.,)

కామెంట్‌లు