పక్షులు పాపాయి ( చిన్నకథ );- ఎడ్ల లక్ష్మి
 రాములోరి " పల్లె అనే ఒక ఊరు ఆ ఊరు చివర ఒక పెద్ద పుట్ట ఆ పుట్ట మీద చిన్న గున్న మామిడి చెట్ట,ఏ కాలమనకుండా, ఆ చెట్టు నిండా కాయలతో ఉంటుంది . 
  చెట్టుపై రెండు పక్షులు గూడు కట్టుకొని ఉంటాయి . ఆ పుట్టలో పెద్ద నాగుపాము కూడా ఉంటుంది. ఎవరైనా చెట్టు వద్దకు రావాలంటే చాలా భయపడతారు . కానీ ఊరి చివరలో ఒక రైతు కుటుంబం ఉంటుంది వారు నాగదేవత పూజ చేసి ఒక బిడ్డను కన్నారు . ఆ అమ్మాయి పేరు నాగలక్ష్మి ఆమె ప్రతిరోజు ఆ పుట్ట వద్దకు వచ్చి పూజ చేసి , చెట్టుకు కిందికి వెళ్లి  ఆ పక్షుల తోటి ఆడుకునేది ఆ పక్షులు కూడా ఆ పాపాయి చెట్టు కిందికి రాగానే మామిడికాయలు తెంపి పాపకు ఇచ్చేవి . 
    
    ఒకరోజు ఆ రెండు పక్షులు పాపాయితో చెప్పకుండా విహారి యాత్రకు బయలుదేరి వెళ్లాయి .
అందమైన వనములన్ని తిరిగి రెండు మూడు రోజులు తర్వాత తిరుగు ప్రయాణమై వస్తుండాగా , ఒక వేటగాడు ఆ జంట పక్షులను చూసి చాలా మురిసిపోయాడు.
    
 వెంబడే వాటిపైకి బాణము ఎక్కుపెట్టి వేశారు . పాపం  అందులో ఒక పక్షి రెక్క చివరి చివరి భాగంలో ఆ బాణము  తగిలింది . ఆ పక్షి ఆయాసంతో రెక్కలను తికమక ఊపుతూ ఒక కాలువ గట్టు పక్కన ఒక గుబురైన చెట్ల పొదల మధ్య పడిపోయింది.
 ఆ కొమ్మల గుబుర్లో వేట గాడి కళ్ళకు కనపడకుండా  చిక్కుకుంది. దానితోటి పక్షి చూసి వలపోస్తూ తామున్న చెట్టు వద్దకు వచ్చింది. 
    అప్పుడే అక్కడికి ఆ నాగలక్ష్మి    కూడా వచ్చి , ఒంటరి పక్షిని చూసింది అయ్యో పక్షి రాజా నీ జోడి పక్షి  ఏది . అచట జరిగిన సంఘటన అంతా పక్షి రాజు నాగలక్ష్మి తో చెప్పింది. అప్పుడు ఆ విషయం అంత విన్నా నాగలక్ష్మి సరే అది ఎక్కడ పడిందో నాకు చూపెట్టుమని పక్షిరాజుతో బయలుదేరి వెళ్ళింది . చెట్ల పొదల నడుమ కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న పక్షిని చూసి , నాగలక్ష్మి చేతిలోకి తీసుకొని కొన్ని నీళ్లు తాపి ఏదో ఒక చెట్టు ఆకు పసరు తెచ్చి ఆ పక్షి రెక్కలకు లేపనంగా పెట్టి ఆ పక్షిని భద్రంగా పట్టుకుని తిరిగి చెట్టు వద్దకు చేరుకున్నారు . 
      * * ‌*
   అలాగే నాగలక్ష్మి రెండు మూడు రోజులు ఆ పక్షికి పసరుమందుతో వైద్యము చేయగా పక్షి రెక్క గాయము తగ్గిపోయి హాయిగా చెట్టు పై గూటిలోకి చేరింది. 
  అప్పుడు నాగలక్ష్మి ఆ రెండు పక్షులను పిలిచి మీరున్న చోటు వదిలిపెట్టి ఎప్పుడు కూడా వేరే చోటికి వెళ్లకండి ప్రమాదం తెచ్చుకోకండని నీతి మాటలు చెప్పింది .

కామెంట్‌లు