నైమిశారణ్య ప్రాశస్థ్యం;- :సి.హెచ్.ప్రతాప్

 శ్రీమహావిష్ణువు నివాస స్థలం అయిన నైమిశారణ్యం మహా పుణ్యక్షేత్రం.పుణ్యమూ, పురాణమూ రెండూ అక్కడే పుట్టాయి- అని శాస్త్రం తెలుపుతొంది. ఒకప్పుడు వెయ్యేళ్ళ దీక్ష చేబట్టి, సత్త్రయాగం చేయాలనుకున్నారు మహర్షులు. నైమిశారణ్యంలో అంతా సమావేశమయ్యారు. సూతుడు అక్కడికి వచ్చాడు. అతను రోమహర్షుణుడి కుమారుడు. పురాణాలు చెప్పడంలో గొప్ప ప్రసిద్ధుడు. వ్యాసుడు తాను రచించిన పురాణేతిహాసాలన్నీ రోమహర్షుణుడికి చెప్పాడు. వాటన్నిటినీ రోమహర్షుణుడు, సూతుడికి చెప్పడంతో అతడు మహా పౌరాణికుడయినాడు.నైమిశానికి విచ్చేసిన సూతుణ్ణి అక్కడి శౌనకాది మునులంతా భక్తితో పూజించి గౌరవించారు.
పురాణాలు చెప్పమని ప్రార్థించారు. సూతుడు అందుకు అంగీకరించి, ఆనందంగా తాను నేర్చిన పురాణాలన్నీ వినిపించాడు. వెయ్యేళ్ళ సత్త్రయాగంలో కాలాన్ని దుర్వినియోగం చేయక, మునులంతా సూతుడు చెప్పిన పురాణాలు విని తరించారు. ఈ విధంగా నైమిశారణ్యంలో నిత్య సత్సంగం జరుగుతూ, అన్ని పురాణాల జన్మస్థలంగా అయ్యింది. ఇది దధీచి మహర్షి తన ఎముకల్ని వజ్రాయుధంగా చేసిన చోటు . రాములవారు సీతమ్మని ఇక్కడే, వాల్మీకి మహర్షి ఆశ్రమంలో విడిచి రమ్మని లక్ష్మణస్వామికి చెప్పారు . ఈ ప్రదేశమే రాముని పుత్రులు లవకుశులకి జన్మనిచ్చింది .    రాముడు అశ్వమేథయాగం చేసిన చోటిది. ప్రహ్లాదుడు పూజలు చేసిన పుణ్య ప్రదేశమిది . ఈ అరణ్యంలోనే రామాయణం , మహాభారతం వ్యాసుని నోట పురుడు పోసుకున్నాయి. వరాహ పురాణం ప్రకారం ఇది విష్ణుమూర్తి  అసురులను సంహరించిన ప్రాంతం. లిప్తకాలంలో విష్ణువు అసురులను అంతమొందించిన అటవీ ప్రాంతం కాబట్టి నైమిశారణ్యంగా దీనికి పేరు వచ్చింది. 

కామెంట్‌లు