*_సప్త ముక్తి ధామాలు_*
  *మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా అనుక్షణం బంధాలలో చిక్కుకుని బందీ అయిపోతాడు. ఆ బంధాల నుంచి   తప్పించుకోడానికి ప్రయత్నిస్తాడు. కానీ        అవి అంత సులభంగా వదలవు.* 
 *భగవంతుడు దయాసముద్రుడు. మానవులను భవబంధాల నుంచి విముక్తి చేయడానికి ఎన్నో మార్గాలు చూపాడు. ఎన్నో దివ్య ధామాలు సృష్టించాడు.* 
 *వేదాలు పుట్టిన ఈ పవిత్ర భూమిపై ముక్తి ధామాలుగా సప్త నగరాలు ఉన్నాయి.    వాటిని ఒక్క శ్లోకంలో ప్రాచీనులు ఇలా చెప్పారు.* 
*అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవన్తికా ।*
*పురీ ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయకాః ॥*
 *ఈ శ్లోకం జగత్ప్రసిద్ధం.* 
*1. అయోధ్య:*
         *మోక్షదాయకమైన సప్త నగరాల్లో మొదటిది  అయోధ్య. శత్రువులు చొరబడటానికి వీలు లేని సురక్షిత స్థానం అనే అర్థంలో ఈ నగరానికి ఆ పేరు వచ్చింది. 'మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడి' జన్మభూమి. సరయూనదీ తీరంలో వెలసిన ఈ మోక్ష ధామం దర్శన మాత్రంగా జన్మను చరితార్థం చేస్తుందని అంటారు.* 
*2. మధుర:*
 *రెండో నగరం మధుర.. పేరులోనే మాధుర్యాన్ని సంతరించుకున్న నగరం. పూర్ణ అవతార పురుషుడైన శ్రీ కృష్ణుడు నడయాడిన పవిత్ర స్థానం.* 
*3. (మాయ) హరిద్వార్:*
 *మూడో నగరం మాయ.    దీనిని హరిద్వార్ అని పిలుస్తారు. విష్ణుసన్నిధికి చేర్చే ముఖద్వారం. ఈ పుణ్యస్థలం హిమపర్వతాల నుంచి ప్రవహించే గంగానది మొట్టమొదట నేలపై అడుగు మోపిన విశిష్ట పుణ్యక్షేత్రం ఈ మాయానగరం.* 
*4. కాశీ:*
 *నాలుగో నగరం కాశీ.       భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం, పవిత్ర గంగా నదీ తీరంలో వెలసిన పరమ శివ సన్నిధానం.      వరుణ, అసి అనే రెండు నదులు ఇక్కడ గంగానదిలో సంగమించడం వల్ల                ఈ పట్టణానికి వారణాసి అని కూడా పేరు ఉంది.* 
*5. కంచి:*
 *ఐదో నగరం కాంచీపురం. దక్షిణ భారతంలోని పవిత్ర నగరం ఇది. కాంచి, కాంచీపురం, కాంజీపురం అనే పేర్లతో అలరారే ఈ పుణ్యధామం శివునికి, విష్ణువుకి, శక్తికి నెలవు. అద్వైత తత్వాన్ని ప్రవచించిన                 ఆది శంకరులు స్థాపించిన కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఈ పుణ్యక్షేత్రం దర్శిస్తే మోక్షం ప్రాప్తిస్తుందని, ప్రాచీనకాలం నుండి కొనసాగుతున్న విశ్వాసం.*
*6. (అవంతిక) ఉజ్జయినీ:*
 *ఆరో నగరం అవంతిక.       భారత భూమిలోని మధ్యప్రదేశ్ లో ఉజ్జయిని నగరానికి ‘అవంతికా’ అని ప్రాచీన నామం. శిప్రానదీ తీరంలో వెలుగొందే              ఈ పట్టణం, మహాకాళ నాథుడైన శివునికి నిలయం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన ఈ నగరాన్ని గురించి మహాకవి కాళిదాసు ఎంతో అద్భుతంగా వర్ణించారు.  ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి.* 
*7. ద్వారక:*
 *ఏడో నగరం ద్వారావతి... అంటే ద్వారకా నగరం.     శ్రీకృష్ణుని పాదస్పర్శతో పునీతమైంది ఈ దివ్యధామం. ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. నూతనంగా నిర్మించిన ఆధునిక ద్వారకా నగరం ద్వారకానాధ్ గా ప్రసిద్ధం. ఇక్కడ ద్వారకాధీశుడి  ఆలయం ఉంది. ఈ ఆలయము లోనికి భక్తులు స్వర్గ ద్వారం ద్వారా ప్రవేశించి, మోక్ష ద్వారం ద్వారా వెలుపలకు వస్తారు. ఈ కారణంగా ముక్తిదాయక నగరంగా ప్రసిద్ధి చెందింది.* 
 *ఈ సప్త నగరాలను స్మరణ చేసిన చాలా పుణ్యప్రదం.*
......... కర్రా విరూపాక్ష శాస్త్రి
🌹🌹🪷🙏🪷🌹🌹
Nagarajakumar.mvss

కామెంట్‌లు