సుప్రభాత కవిత ; -బృంద
ఎదురొచ్చిన వసంతానికి
ఎద నిండిన వసుమతికి
ఏమిటి బంధం?

కురిసేటి పుత్తడి వెలుగులకూ
కులికేటి పచ్చిక బయళ్ళకూ
ఏ అనుబంధం?

పయనించు పాదాలకూ
పరచిన సన్నని దోవకూ
ఏమున్నది మమకారం??

నింగిని పరుగులిడు నీలిమబ్బులకూ
గిరిలోయల తిరుగాడే
గాలి తెమ్మెరకూ ఏ ఆత్మీయత?

జారే జలపాతానిదీ
ఎదురు చూసే కడలిదీ
ఏ అనురాగం?

సాగేటి జీవన గమనానికి
నీడనిచ్చే మజిలీలకూ
ఎక్కడిదీ అభిమానం?

తూర్పున విరిసే రంగులకూ
తోటను విరిసే పువ్వులకూ
ఎందుకీ ఉల్లాసం?

గడచిన కలతల క్షణాలకూ
రాబోయే కలల వేకువకూ
మధ్యన మురిసే మనసుతో

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు