*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0267)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
హిరణ్యకశిపుని తపస్సు- బ్రహ్మ వరములు-నారసిహుని ద్వరా వధింపబడటం- ప్రహ్లాద రాజ్యాభిషేకం......
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*నారదా!  బ్రహ్మ నైన నాచేత రాజ్యాభిషేకం చేయబడిన హిరణ్యకశిపుడు, ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ, తన ధైర్య సాహసాలచేత ఉన్మత్తుడై, తన ఆగర్భ శతృవులు అయిన దేవతల మీద, శ్రీహరి ని పూజించే వారి మీద తన సైన్యాలను ఉసిగొలిపి యుద్ధం చేయడం మొదలుపెడతాడు. మూడు లోకములను సర్వ నాశనం చేయడానికి నిశ్చయించుకున్నాడు. అన్ని ధర్మములను, సదాచారములను మంట కలుపుతున్నాడు. యుద్ధం లో, ఇంద్రుని మిగిలిన దేవగణాలను, అష్ట దిక్పాలురను అందరినీ వరుసగా జయించాడు. కొంత మంది దేవతా సమూహాన్ని చెర బట్టాడు.  ఈ విపరీతమైన దండనకు తట్టుకోలేని దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి, తమ దీన గాధలను, బాధలను తెలుపుతూ మొర పెట్టుకున్నారు. విష్ణుమూర్తి వారిని ఊరడించి, "చితించకండి, బ్రహ్మ ఇచ్చిన వర గర్వం చేత హిరణ్యకశిపుడు రెచ్చి పోతున్నాడు. ఆతనిని నేనే నిర్జిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి" అని అనునయించి వారి గృహాలకు పంపాడు.*
*దేవతలకు అభయం ఇచ్చిన విష్ణుమూర్తి, మానవ శరీరంలో తల సింహరూపంలోనూ, మిగిలన శరీరం అంతా మానవుని ఆకృతిని ధరించారు. సగం మృగము. సగం మనిషి. "నారసింహ" రూపము ధరించిన విష్ణుమూర్తి, ఎంతో భయంకరంగా, వికృతముగా ఉన్నారు. ముఖము ఎంతో విస్తృతముగా ఉంది. భుజాలమీద జూలు వేలాడుతున్నది. చాలా అందమైన ముక్కు, తీక్షణమైన గోళ్ళు కలిగి కోట్లకొలది సూర్యుల కాంతిని వెదజల్లుతూ ఉన్నారు. ఆరూపము జగమంతా నిండి, జగన్మోహనంగా కనిపిస్తుంది. సూర్యనారాయణమూర్తి అస్తాచలము చేరగానే, నారసింహుడు, హిరణ్యకశిపుని రాజ్యం చేరి, కనిపించిన దైత్యులను అందరినీ, తన వాడి గోళ్ళతో, పద ఘట్టనలతో నలిపేశారు. కొందిని పట్టుకుని ముక్కలు ముక్కలుగా చేసేశారు. అలా వీరవిహారంగా నారసింహుడు నగరంలో తిరుగుతున్నాడు.*
*అలా నర మృగ రూపంలో, భయంకరమైన వాతావరణం సృష్టిస్తూ, నగరంలో తిరుగుతున్న నారసింహుని చూచాడు, హిరణ్యకశిపుని కుమారుడు, ప్రహ్లాదుడు. వెంటనే తన తండ్రి వద్దకు వచ్చి, "నగరంలో కోలాహలం చేస్తున్న ఈ నర సింహ రూపము, మన దైత్యలను అందరినీ చంపడానికి వచ్చిన దైత్యకుల విరోధి, సర్వ రక్షకుడు అయిన విష్ణుమూర్తి లాగా నాకు అనిపిస్తోంది. ఆతనితో యుద్ధం చేసి మీరు గెలవ లేరు, తండ్రీ. ఆ మహితాత్ముని శరణు వేడి, బ్రతికి పోయి, మీ రాజ్యపాలన చేసుకోండి" అని మంచి మాటలు చెప్పాడు, ప్రహ్లాద కుమారుడు.  " కుమారా! నీవు ఈ వింత రూపాన్ని చూసి భయపడుతున్నావా, నా కన్నతండ్రీ. ఈ వింత జీవి మనల్ని ఏమీ చేయలేదు. నేను దానిని మట్టు బెడతాను. నీవు, నిశ్చింతగా ఉండు " అని అభయం పలికాడు, హిరణ్యకశిపుడు.*
*తన సైన్యాధిపతిని పిలిచి, సైన్యాన్ని వెంట బెట్టుకుని వెళ్ళి, ఆ వింత జీవిని బంధించి తెమ్మంటాడు. వెళ్ళిన వారు, వెళ్ళి పోయారు కానీ తిరిగి రాలేదు. వారి ప్రాణవాయువులు విశ్వంలో కలిసి పోయాయి. ఇక వీరి వల్లకాదు, అనుకుని, తానే యుద్ధానికి దిగి, శస్త్రాస్త్రములు, శక్తి, ఋష్టి, పాశ, అంకుశ, పావకము మొదలైన ఆయుధాలను నారసింహునిపై ప్రయోగిస్తాడు. అవి నిర్వీర్యం అయిపోయాయి. ఇలా చాలాకాలం యుద్ధం జరిగాక, నారసింహుడు తన అనేక భుజాలతో హిరణ్యకశిపుని పైకి ఎత్తి, పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో, ఇంట బయడ కాకుండా గడప పైన ఉండి, తన చేతి వాడియైన గోళ్ళ సహాయంతో ఆ దానవరాజు ఛాతీని చీల్చి, ఎర్రని రక్తంలో తడిసి ముద్దగా ఉన్న ఆతని హృదయాన్ని బయటకు తీసేసారు. ఆ వెంటనే హిరణ్యకశిపుని ప్రాణవాయువులు, అనంత వాయువులలో కలసి పోయాయి. తన చేతి గుద్దులతో ఆతని ఆన్ని అవయవాలను నుజ్జు నుజ్జు చేసి ఆ దానవేంద్రని మృత కళేబరముగా మార్చారు.*
*దైవ శతృవు చంపబడటం వల్ల లోకాలు అన్నీ ఆనందాన్ని అనుభవించాయి. హిరణ్యకశిపుని తో యుద్ధం చేసి ఎంతో ఆవేశంలో ఉన్న నారసింహుని చూసి, ప్రహ్లాద కుమారుడు అనేక విధాల కీర్తించి, తామందరినీ రక్షించి బ్రోవుమని వేడుకున్నాడు. ప్రహ్లాదుని ప్రార్థన తో శాంతించిన నారసింహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి, ప్రహ్లాద కుమారుని దానవ రాజ్యానికి రాజుని చేసి, చక్కగా పరిపాలన చేసుకోని ఆశీర్వదించి, అంతర్ధానం అయ్యారు. దేవతలు, మనులు, ఋషులు, ప్రహ్లాద కుమారుడు ఆ దేవదేవుని కీర్తించి వారి వారి నెలవులకు వెళ్ళి సుఖంగా ఉన్నారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు