తిండిబోతు దయ్యం (సరదా జానపద కథ) డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

   ఒకూర్లో ఒక కుమ్మరాయన వుండేటోడు. ఆ కుమ్మరాయనకు పుట్టినూర్లో పనిలేక వాళ్ళ అత్తోళ్ళ వూరికి చేరుకున్నాడు. అక్కడ రోజూ కుండలు చేసి, వాటన్నింటినీ కావడిలో పెట్టుకోని, పెండ్లాంతో కలసి చుట్టుపక్కలున్న వూళ్ళకుపోయి అమ్ముకోని వచ్చేటోడు.
కుమ్మరాయన పెండ్లాం చాలామంచి వంటగత్తె. అది పప్పుచారయినా... పంచభక్ష పరమాన్నమయినా... ఏదయినా సరే... తింటా వుంటే ఇంకా కావాల... ఇంకా కావాల... అని అడిగి అడిగి వేపించుకునేంత కమ్మగా చేస్తాది. ఆమె ఒకరోజు పొద్దున్నే తియ్యని బచ్చాలు చేసింది. వాటన్నింటినీ మూటగట్టుకోని మొగునితో పాటు కుండలు అమ్మడానికి పక్కూరికి బైలుదేరింది. ఎండ నడినెత్తికి వచ్చేయాళకి అన్నీ అమ్మేసి తిరిగి ఇంటికి బైలు దేరినారు. అలా పోతావుంటే కాసేపటికి వాళ్ళకి బాగా ఆకలేసింది. ఒక వేపచెట్టు నీడలో కూచోని మూట విప్పినారు.
సరిగ్గా వీళ్ళు తినడానికని ఏ చెట్టు కిందైతే కూచున్నారో ఆ చెట్టుమీద ఒక పెద్ద దయ్యం వుంది. అది మంచిదే గానీ పెద్ద తిండిపోతుది. కింద వాళ్ళిద్దరూ బచ్చాల్లోకి నెయ్యేసుకోని తింటావుంటే ఆ తియ్యని వాసనకి దానికి నోట్లో నీళ్ళూరసాగినాయి. “అబ్బ... వాసనే ఇంత కమ్మగా వుంటే... బచ్చం ఇంగెంత కమ్మగా వుంటుందో” అని నాలుక చప్పరిస్తా లొట్టలేసుకుంటా అలాగే చూడసాగింది.
అదే సమయంలో కొందరు కట్టెలకని అటువైపు వచ్చినారు. వాళ్ళల్లో ఒకడు కుమ్మరాయనను చూసి "ఏం కుమ్మరాయనా... అక్కడ మీ అమ్మ ఆరోగ్యం బాగాలేక మంచంలో పడి ఈ రోజో రేపో అని గిలగిలలాడతావుంటే... ఇక్కడ నువ్వేమో హాయిగా పెండ్లాంతో ఇకఇకలాడతా బచ్చాల్లోకి నెయ్యేసుకోని కమ్మగా తింటావున్నావు. ఇదేమయినా బాగుందా” అన్నాడు. ఆ మాటలకు కుమ్మరాయన అదిరిపన్నాడు. “ఏందీ... మా అమ్మకు బాగాలేదా... నిజమా... నాకు తెలీదే” అంటూ తింటున్న చేయి తింటున్నట్లే మధ్యలో కడిగేసి “ఏమే... నువ్వూరికిపో... నేను పోయి మా అమ్మను చూసొస్తా” అంటూ కండ్ల నీళ్ళు బెట్టుకోని... పరుగు పరుగున పుట్టినూరికి బైలుదేరినాడు. మొగుడల్లా పోగానే పెండ్లాం అన్నీ సర్దుకోని ఆమె గూడా వూరెళ్ళిపోయింది.
వాళ్ళట్లా పోవడం ఆలస్యం పైనున్న దయ్యం బెరబెర కిందకు దిగింది. అక్కడ ఒకచోట ఒక చిన్న బచ్చం ముక్క కిందపడి కనిపించింది. దాన్ని తీసుకోని నోట్లో వేసుకోనింది. అంతే... నోరంతా కమ్మగా ఐపోయింది. “అబ్బ... రుచంటే ఇది. ఎట్లాగయినా సరే ఈమెతో కావలసినవన్నీ చేపించుకోని తినాల... ఎలాగబ్బా” అని ఆలోచించసాగింది. కాసేపటికి దానికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే అది రవ్వగూడా తేడా లేకుండా అచ్చం కుమ్మరాయన మాదిరి మారిపోయి, చేతికి కట్టు కట్టుకోని, తరువాత రోజు పొద్దున్నే పోయి కుమ్మరాయన ఇంటి తలుపు తట్టింది.
కుమ్మరాయన పెండ్లాం తలుపుతీసి బయట నిలబన్నేది మొగుడే అనుకోని "అదేంది.. ఆప్పుడే వచ్చినావు. మీ అమ్మకు ఎట్లా వుంది” అనడిగింది. దానికా దయ్యం “వాడెవడో గానీ వూకెనే ఆటపట్టియ్యడానికని అట్లా చెప్పినాడు. పోయి చూస్తే ఇంగేముంది... హాయిగా మూడుపూటలా తింటా... అందరితో ముచ్చట్లాడుతా వుంది. అందుకే తిరిగొచ్చేసినా” అన్నాడు. ఆమె వాని చేతికేసి చూస్తా "ఆ కట్టేంది.. ఏమైంది” అనడిగింది. అందుకా దయ్యం “ఏం చేద్దాం... వస్తావుంటే ఒకచోట చెట్టుకు పెద్ద
తేనెపార కనబడింది. నీకు తేనంటే చానా ఇష్టం గదా... అందుకని చెట్టెక్కి తెంపుతావుంటే అనుకోకుండా కొమ్మ విరిగి కిందపన్నా.... చెయ్యి విరిగింది” అని చెప్పింది. వచ్చింది దయ్యమని తెలీని ఆమె అది చెప్పిన మాటలన్నీ నిజమని నమ్మేసింది.
ఆ దయ్యం పెద్ద తిండిపోతుది గదా... అది కుమ్మరామెను పిలిచి “ఏమే చెయ్యి బాగయ్యేంత వరకూ నేను కుండలు చేసేదీ లేదు. నువ్వు పోయి అమ్మేదీ లేదు. ఈ నాలుగు రోజులు నాకు తొందరగా బాగవడానికి మంచి మంచి పిండివంటలు చేసి పెట్టు” అనింది. ఆమె 'సరే' అనింది. దాంతో అది గారెలని ఒకరోజు, బచ్చాలని ఇంకొకరోజు, మురుకులని మరొక రోజు... అట్లా కావలసినవన్నీ ఒకదాని
వెనుక ఒకటి చేపిచ్చుకోని లొట్టలేసుకుంటా తినసాగింది. అట్లా ఒక వారం గడిచిపోయింది. అంతలో నిజమయిన కుమ్మరాయన ఇంటికి వచ్చినాడు.
వచ్చి చూస్తే ఇంగేముంది... ఇంట్లో అచ్చం తన మాదిరే వున్న దయ్యం కనబడింది. వాడు అదిరిపోయి పెండ్లాంతో “ఎవడే వీడు, అచ్చుగుద్దినట్లు నా మాదిరే వున్నాడు” అన్నాడు. వెంటనే దయ్యం “అసలు వీడెవడే... నన్నే ఎవడంటున్నాడు” అనింది. ఇద్దరు ఆమెకు నేను మొగున్నంటే... నేను మొగున్నంటూ తిట్టుకోసాగారు. ఇదంతా చూసి ఆమె బిత్తరపోయింది. వాళ్ళిద్దరిలో ఎవడు అసలు మొగుడో... ఎవడు నకిలీ మొగుడో అర్థంగాక జుట్టు పీక్కోనింది. ఇక లాభం లేదనుకోని ఆ వూరి పెద్ద దగ్గర పంచాయితీ పెట్టింది.
ఆ వూరి పెద్ద చానా తెలివైనోడు. ఎటువంటి చిక్కుముడయినా నిమిషాల్లో ఇప్పేయగలడు. ఆయన ఆ ఇద్దరినీ చూసి "లోకంలో మనిషిని పోలిన మనుషులు ఏడుమంది వుంటారంటారు గానీ... మరీ అచ్చు గుద్దినట్లు కొంచం గూడా తేడా లేకుండా ఇట్లా వుండరు. ఇందులో ఏదో మాయ వుంది. ఇది ఖచ్చితంగా ఏదో ఒక దయ్యం పనో, మంత్రగాని పనో అయ్యుంటాది” అని మనసులో అనుకున్నాడు. బాగా ఆలోచించి ఇద్దరినీ చెరోపక్కా నిలబెట్టి మధ్యలో ఒక కుండ పెట్టి “చూడండి... మీ ఇద్దరిలో ఎవరు
ముందు ఈ కుండలో దూరి మరలా బైటకు వస్తారో వాడే ఆమె మొగుడు” అని చెప్పినాడు. ఆయన అట్లా చెప్పడమాలస్యం ఆ బుర్రలేని దయ్యం “ఓస్... అదెంత పని... ఇదుగో దూరుతున్నా చూడు” అంటూ కళ్ళుమూసి తెరిచేలోగా కోడి గుడ్డంత చిన్నగా మారిపోయి ఎగిరి ఆ కుండలోకి దూరింది.
అంతే... అందుకోసమే కాసుక్కూచున్న ఆ వూరి పెద్ద ఆ దయ్యమట్లా కుండలో దూరడమాలస్యం భుజమ్మీదున్న తువ్వాలుతో దాని మూతిని గట్టిగా కట్టేసినాడు. అంతే... అది లోపల్నే ఇరుక్కోని పోయి లబలబలాడసాగింది. “బాబూ. .. తప్పయింది. ఏదో తిండిమీద ఆశతో ఇలా చేశాను. ఈ ఒక్కసారికి వదిలేయండి. మరలా ఎప్పుడూ మీ మనుషుల జోలికిరాను” అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. దాంతో ఆ వూరి పెద్ద మనసు కరిగిపోయింది. “పోనీలే పాపం... తప్పు ఒప్పుకుంటా వుంది గదా” అని తువ్వాలు వూడతీసినాడు. దయ్యం వెంటనే ఆ కుండలోంచి బైటపడింది.
వూరి పెద్ద కుమ్మరామెతో గంప లడ్లూ, గంప బచ్చాలు, గంప కజ్జికాయలూ, గంప కారాలూ చేపిచ్చి ఆ దయ్యానికిచ్చి “పో... పోయి... ఇవి కమ్మగా తిను. మరలా ఎప్పుడూ ఇలా మనుషుల జోలికి రాకు” అంటూ దాన్ని వదిలేసినాడు. ఆ తిండిపోతు దయ్యం సంబరంగా అవన్నీ తీసుకోని “అబ్బ... ఈ
మనుషులెంత మంచోళ్ళు... నేను చెడు చేసినా మళ్ళా నాకు మంచి చేస్తావున్నారు. ఇంగెప్పుడూ వీళ్ళ జోలికి రాగూడదు” అనుకొని అక్కన్నించి వెళ్ళిపోయింది.
***********
కామెంట్‌లు