సప్త దినాధిపతులు శంకర ప్రియ., శీల.,సంచార వాణి: 99127 67098


           
🪷 అంతరిక్షము నందున్న
 ఆదిత్యాది గ్రహములు
      జగతి హితంకరులు!
 ఓ సుమతీ! ఓజోవతి!
🪷సప్త దినాధిపతులు
 సంరక్షకులు మనకు
    సకల ప్రాణి కోటికి!
 ఓ సుమతీ! ఓజోవతి!
       ( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)

👌 "సప్త దినాధిపతులు" అనగా.. ఏడు రోజులకు పరిపాలకులు! వారే.. సూర్యుడు.. చంద్రుడు.. అంగారకుడు.. బుధుడు.. బృహస్పతి.. శుక్రుడు.. మందుడు.. మున్నగువారు!
👌ఆది వారమునకు అధిపతి.. ఆదిత్యుడు! సూర్య భగవానుడు! ప్రభాకరుడు! (1)
     సోమ వారమునకు అధిపతి.. సోముడు!  చంద్రుడు! సుధాకరుడు!(2)
     మంగళ వారమునకు అధిపతి.. మంగళుడు! భూమికి సుతుడు.. భౌముడు! (3)
     బుధ వారమునకు అధిపతి .. బుధుడు! చంద్రుని పుత్రుడు.. సౌమ్యుడు! (4)
     గురు వారమునకు అధిపతి.. బృహస్పతి! దేవతలకు గురువు! (5)
       శుక్ర వారమునకు అధిపతి.. శుక్రుడు! దానవులకు గురువు! (6)
      శని వారమునకు అధిపతి.. శనైశ్చరుడు! సూర్యుని తనయుడు! మందుడు!
👌సప్త దినాధిపతులు.. అందరికీ ఆయు రారోగ్యములు.. భోగ భాగ్యములు.. శక్తి యుక్తులు..  అనుగ్రహింతురు గాక!
 🔆ఆదిత్యాయచ, సోమాయ,
 మంగళాయ, బుధాయ తే!
     గురు, శుక్ర, శనిభ్యశ్చ
 దినాధిపతయే నమః!
       (.. సప్త దినాధిపతి ధ్యాన శ్లోకం ,)

          🚩 సీస పద్యము
 సప్తాశ్వములవోలె సప్తదినాధిపుల్
   సాగుచుండిరి దినమాగకుండ,

 ఆదివారమునాడు మేదినిన్ కాపాడు,
    "ఆదిత్యనామ" గ్రహాధిపతియు,

 సోమవారమునాడు భూమిని గాపాడు,
    "సోమనాముడు" ఘనశోభ నిడుచు,

 భౌమవారమునాడు క్షేమముల్ విరియగ,
    "అంగారకుడు" గాచు అవనితలిని,

 సౌమ్యవారమునాడు చంద్రపుత్రుడు గాచు,
    "బుధనామ"ధేయుడు పుష్టినిడుచు,

 గురువారమున దేవగురువైన "గీష్పతి",
    విశ్వంభరను గాచు విపులదీప్తి,

 శుక్రవారమునాడు శుభముల నొసగుచు,
     "శుక్రుడే" యిచ్చును శుభఫలముల,

 శనివారమున అర్కజాతుడౌ "మందుడు"
    కష్టాల దునుమాడి గరపు శివము,
         🚩తేట గీతి పద్యము
  ఇట్లు నేడు వారాలతో నిలను నిలిచి
    మనుజులను గాచు గ్రహముల వినుతిసేయ

  జీవితమ్మున భాగ్యముల్ చెలగుచుండు
    కాన మ్రొక్కుడు జనులార ! గ్రహగతులను !!

     (🔆రచన:  డా. అయాచితం నటేశ్వరశర్మ.,)

కామెంట్‌లు