కవితా తరంగాలు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
తెలుగుతల్లి తడితే
తేనెచుక్కలు చల్లితే
తలపులు పారితే
తనివి తృప్తిపడితే
తెలుగును తలకెత్తుకోనా
తేటతెలుగుకవితలను అందించనా

అలరులు ఆహ్వానిస్తే
విరులు విచ్చుకుంటే
పీలుపులు పిలిస్తే
మల్లెలు మత్తెక్కిస్తే
అందాలలోకంలో విహరించనా
పలుపుష్పకవితలను పారించనా

జాబిలి వెన్నెలచల్లుతుంటే
కోకిల కంఠంవినిపిస్తుంటే
నెమలి నృత్యంచేస్తుంటే
చిలుక చక్కదనంచూపిస్తుంటే
ముచ్చటపడి మైమరసిపోనా
భావకవితలను బయటపెట్టనా

అక్షరాలు ఆహ్వానిస్తే
పదాలు పేర్చమంటే
ఊహలుహృదిలో ఊరితే
విషయాలు వెంటబడితే
తక్షణం స్పందించనా
కమ్మనికవితలు కూర్చనా

సాహితి సంకల్పమిస్తే
సరస్వతి సమ్మతిస్తే
కలం చేతిలోకొస్తే
కాగితం కనబడితే
ఆలోచనలకు ఆకారమివ్వనా
శ్రేష్ఠమైనకవితలను సృష్టించనా

శైలితో
ఆకట్టుకుంటా
శిల్పంతో
సంతసపరుస్తా
కవనంతో
కుతూహలపరుస్తా


కామెంట్‌లు