సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -139
పిష్ట పేషణ న్యాయము
   ******
పిష్టము అంటే పిండి. పేషణము అంటే నూరడము లేదా విసరడము.
పిష్ట పేషణము అంటే  పిండిని  విసరడము లేదా నూరడము, పిండి గొట్టడము అని అర్థము.
విసిరిన పిండినే మళ్ళీ మళ్ళీ విసిరినట్లు.విసిరితేనే కదా పిండి అవుతుంది.కానీ పిండి విసిరాము, పిండి కొట్టాము అంటుంటారు.అలాగే బియ్యం వండితేనేగా అన్నం అయ్యేది.కానీ అన్నం వండినము అంటాము.
ఇలా దంచిన దాన్నే దంచినట్లు,వండిన దాన్నే వండినట్లు మాట్లాడే మాటలు వివినడానికి అలవాటు పడినా దానిని లోతుగా అర్థం చేసుకుంటే ' ఏమిటో ఈ మాటలు? చెప్పిన దానినే మళ్ళీ చెప్పడం ఏమిటీ' అనిపించక మానదు.
దీనిని 'పిష్ట పేషణము' అనే జాతీయముగా కూడా పిలుస్తారు.
దీనినే వ్యక్తులకు వర్తింప చేసి చూస్తే.. చెప్పిన విషయాన్నే తిరగేసి మర్లేసి చెప్పే వాళ్ళను,మాట్లాడిందే మాట్లాడుతూ ఉండేవాళ్ళను 'పిష్ట పేషణం చేస్తున్నార్రోయ్' అంటారు.
ఇలా వాళ్ళు చెప్పిన మాటలేమో పదుల్లో వందల్లో అయినా  అందులో  వారు చెప్పే విషయం ఒకటే' ... అంటే అర్థం చేసుకోవచ్చు. అలాంటి మాటలు చెప్పి ఎదుటి వ్యక్తులను ఎంతగా విసిగిస్తూ ఉంటారో, మరెంతగా సహనానికి పరీక్ష పెడుతుంటారో...
వాళ్ళు  మన దగ్గరకు వస్తున్నారంటేనే 'ఎలా భరించాలిరా బాబూ!' అని గుండెలు గుబగుబలాడటం కద్దు.
ఇక కొందరి  మాటలే కాకుండా చేసే పనులు కూడా అదే కోవకు చెందుతాయి. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు.కడిగిందే కడగడం,తుడిచిందే తుడవడం... వాటి వల్ల ఉపయోగం ఉండకపోగా బోలెడంత సమయం వృధా అవుతుంది. 
ఐతే కొందరికి ఇది వర్తింప జేయకుంటేనే బాగుంటుంది.వారే బాలలు, వృద్ధులు.వారి వయసును దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాల్సిందే.
పిల్లలు మాటలు నేర్చుకునే క్రమంలోనూ, జ్ఞానాభివృద్ధి చెందే సమయంలోనూ చెప్పిన మాటలను పదాలను పదే పదే చెబుతూ ఉంటారు.అంటే వల్లె వేయడం అన్న మాట. అది వారికి అవసరం కూడా.వారి జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
ఇక పెద్ద వయసు వారు/ వృద్ధులు  తమ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని  తమ సంతానానికి చెప్పినవే చెబుతూ ఉంటారు. అది వినే  సంతానానికి ఇబ్బంది కలిగించవచ్చు. అసహనాన్ని పెంచి వచ్చు. కానీ  వారు 'ఎందుకలా చెబుతున్నారు? మన శ్రేయస్సు కోసమే కదా!,మన మంచి కోరేవారు వారే. ఇంకెవరుంటారు అనుకుంటే ...  వారి మాటలు మనకు విసుగు, ఇబ్బంది అనిపించవు.వారు చెప్పే మాటలను వినే ఓపిక సహనం వాటంతట అవే వస్తాయి. 
 ఇలా సమయం సందర్భం,వయసు, మనసును బట్టి ఇలాంటి  న్యాయాలను వర్తింప చేసుకుంటే చాలు.నిశ్చింతగా ఆస్వాదించవచ్చు.ఏమంటారు?
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు