ప్రతిభామూర్తులు.; - తాటి కోల పద్మావతి గుంటూరు

 నన్నయ్య భట్టారకుడు. (క్రీ.శ. 11వ శతాబ్దం)
తెలుగు భాషకు మొదటి కావ్యమును అందించిన పండితుడు, కవి, వ్యాకరణ కర్త నన్నయ. స్వతంత్ర కావ్యము కాకున్నను తెలుగులో రచించబడిన వ్యాసభారత అనువాదమే మొదటి కావ్యమని చెప్పవచ్చును. ఇతడు వేంగి సామ్రాజ్యమును రాజమహేంద్రవరమును రాజధానిగా ఏలిన రాజరాజ నరేంద్రుని కుల బ్రాహ్మణుడు. రాజులు బ్రాహ్మణులను గౌరవించి తమ ఆస్థానమున తగిన గౌరవం ఇచ్చెడివారు. రాజ రాజ నరేంద్రునికి తమది చంద్రవంశమను నమ్మకము. అందువల్ల పాండవుల ఆధిపత్యాన్ని సూచించే వ్యాస భారతాన్ని అనువదించమని కోరగా నన్నయ అందుకు అంగీకరించి ఆది సభా పర్వాలను, అరణ్యపర్వములో సగభాగాన్ని తెనిగించాడు. ఈ రచన రాజరాజ అవసాన దశలో ఆగిపోయింది. చారిత్రక ఆధారాలను బట్టి ఈయన 11 వ శతాబ్దం వాడని తెలుస్తోంది. ఈయన రచన చెందోబద్ధమై అలంకార ప్రమాణాలను అనుసరించి సంస్కృత పదాల మిళితమై ఉంటుంది. ఈయనకు ఆంధ్ర భాష వాగమ శాసనుడనే బిరుదు లభించింది. ఈయన ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని కూడా రచించాడు. ఈయన తల్లిదండ్రులు జన్మించిన సంవత్సరం చరిత్రకారులకు అందనిది. ఆయన రచించిన మహాభారత ఆంధ్రీకరణ మాత్రం సజీవమై ఇప్పటికీ కవి పండితులను సమూహితులను చేయుట ఇతడి ప్రతిభను తెలియజేస్తుంది.
.
కామెంట్‌లు