కరదీపిక;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 వేదకాలం కంటే ముందే మనదేశంలో యోగ ఉనికి కనిపించిందని ప్రాచుర్యంలో ఉంది. అత్యంత ప్రాచీనమైన ఋగ్వేదంలో ఈ యోగ విద్యను ప్రస్తావించారని కూడా పెద్దలు చెబుతారు.అంతేకాదు, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నాటి సింధులోయ నాగరికతలోకూడా యోగ సంప్రదాయానికి చెందిన ఆనవాళ్ళు లభించాయని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు తన భగవద్గీతలో యోగ సంప్రదాయానికి చెందిన సాధికారిక వ్యాఖ్యానాలను మనకు ప్రబోధించాడు. స్వామీ వివేకానంద 1893 సంవత్సరంలో అమెరికా పర్యటన సందర్భంగా చేసిన ప్రసంగాలలో యోగా ప్రస్తావన ఉంది. ఈ ప్రసంగాల వలననే యోగసాధనలకు అద్భుతమైన ప్రాచుర్యం ప్రారంభమైంది. ఆతర్వాత పరమహంస యోగానంద వంటివారు విదేశాలలో యోగాను విరివిగా ప్రచారం చేశారు. 
యమ, నియమ, సమాధి, ఆసన, 
ప్రత్యాహార,ధారణ, ప్రాణాయామ, ధ్యానాలు మన పతంజలి ఋషి వర్యుని అమూల్య అష్టాంగయోగాలు. వీటిని ప్రపంచానికి ప్రసాదించిన పతంజలి మహర్షికి మనం ఋణపడి ఉన్నాం. కాయము ఆత్మనికాయము అందుకే, ఆత్మ పరమాత్మల అనుసంధానానికి  ధ్యాన యోగా విధానాలు సుగమ మార్గాలుగా చెబుతారు. మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే మహర్షి అద్భుత తపోఫలాలు ఇవి. మతిని శృతిచేసి, శరీరాన్ని సరిచేసి, ప్రకృతి కృతిగా మానవులను జతచేసి, నిశ్చల ధ్యానంతో ఏకాగ్రతను పొంది, మనసును శరీరాన్ని రోగ రహితంగా సుదృఢపరుస్తూ, స్థితప్రజ్ఞను అందించే మోక్షసాధక కరదీపిక ఇది. వసివాడని వన్నెచెడని భరతమాత నుదుటి సిందూరమిది!
కాస్త వివరంగా చెప్పాలంటే…యమ, నియమాల ద్వారా చెడు ఆలోచనలను, చెడు ప్రేరణలను నియంత్రించి మంచి ఆలోచనలను, మంచి అలవాట్లను అలవరుచుకోవడం సాధ్యపడుతుంది. ఆసన, ప్రాణాయామాల వలన దీర్ఘకాలిక ధ్యానానికి కావలసిన భంగిమలు, లయబద్ధమైన శ్వాసక్రియను సాధించవచ్చును. ప్రత్యాహార, ధారణల ద్వారా విషయ లోలత్వం కలిగించే వస్తువులపై నుండి ఇంద్రియాలను మరల్చి ఏకాగ్రతను పెంచుకోగలము. ఇక ధ్యాన, సమాధి స్థితుల ద్వారా నిరంతరం ధ్యానం చేయడంతో మనసును పూర్తిగా ఆత్మలో లయం చేయడం కొనసాగిస్తాము.
ఈ యోగసాధనతో మనిషికి శాశ్వతమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థత చేకూరుతుంది. ఎంతోమంది పరిశోధకులు ఎన్నో పరిశోధనలు చేసి యోగసాధనతో ఎన్నెన్నో రుగ్మతలు దూరమవుతాయని నిగ్గు తేల్చారు కూడాను.
ఇంతటి మహత్తరమైన యోగా ను ప్రపంచానికి అందించిన ఘనత కేవలం భారతదేశానికే దక్కింది. మనమంతా కలిసి ఈ యోగా ను సదా ఆచరించడం ద్వారా భారతదేశపు కీర్తిప్రతిష్టలను ఆచంద్రార్కం నిలిపి ఉంచుదామని ఈ యోగా దినోత్సవం రోజున మనం ప్రతిజ్ఞ చేద్దాం! 
జైహింద్!! 
{అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ వ్యాసం}
—-----------------------------------------
;

కామెంట్‌లు