ఒకూర్లో ఒకడున్నాడు. వాడు చానాచానా అమాయకుడు. ఎప్పుడు ఎవరితో ఎట్లా మాట్లాడాల... ఎక్కడ ఎట్లా ప్రవర్తించాల... ఇలాంటివేమీ తెలీదు. వాళ్ళమ్మానాన్నా ఏది చెబితే అది మారు మాట్లాడకుండా మట్టసంగా చేయడం లేదా గమ్మునుండటం చేసేటోడు. వాడు నెమ్మదిగా పెరిగి పెద్దోడయినాడు గానీ అమాయకత్వం మాత్రం కొంచం గూడా తగ్గలేదు.
నెమ్మదిగా వానికి పెండ్లి వయసొచ్చింది. పెండ్లి వయసొచ్చినాక పెండ్లి చేయాల గదా... దాంతో వాళ్ళమ్మానాన్నా వాని గురించి ఎవరికీ ఏమీ చెప్పకుండా దూరప్రాంతం నుండి ఒక సంబంధం తెచ్చి పెండ్లి చేసినారు. పెండ్లయిన కొన్ని నాళ్ళకే వాని గురించి వాని పెండ్లానికి తెలిసిపోయింది. కానీ ఏం లాభం. అప్పటికే అంతా అయిపోయింది గదా... దాంతో 'అంతా నా ఖర్మ' అని మట్టసంగా వుండిపోయింది. ఒకరోజు వాని అత్తామామా వచ్చి "అల్లుడూ... అల్లుడూ... తొందర్లోనే ఉగాది పండుగ వస్తా వుంది. నీవు నీ పెండ్లాం తప్పకుండా మా ఊరికి రావాల" అని పిలిచినారు. వాడు సరే అన్నాడు.
ఒకవారం దాటేసరికి పండుగ దగ్గర పడింది. వాడు పెండ్లాన్ని తీసుకోని వాళ్ళ అత్తోళ్ల ఊరికి బైలు దేరినాడు. పోయేముందు వాళ్ళ నాయన వాన్ని పక్కకు పిలిచి "రేయ్... నీకు ఎవరితో ఎట్లా మాట్లాడాల్నో తెలీదు. అక్కడికిపోయి తిక్కతిక్కగా మాట్లాన్నావనుకో మరియాద పోతాది. నే చెప్పినేది బాగా గుర్తు పెట్టుకో, బావమరుదులతో గట్టి మాటలు మాట్లాడాల... అత్తతో మెత్తని మాటలు మాట్లాడాల... మామతో చక్కని మాటలు మాట్లాడాల... ఏం సరేనా" అన్నాడు. వాడు వాళ్ళ నాయన చెప్పినవన్నీ బాగా గుర్తు పెట్టుకోని బైలుదేరినాడు.
అత్తోళ్ళ ఊరికి చేరుకోని ఇంట్లోకి అడుగు పెడ్తా వుంటే బావమరుదులు ఎదురొచ్చి “ఏంబావా... బాగున్నావా... ఇంటి కాడ అందరూ బాగున్నారా" అని పలకరిచ్చినారు. వాళ్ళనాయన బావమరుదులతో గట్టిమాటలు మాట్లాడమన్నాడు గదా... అందుకని వాడు వెంటనే
“రాయి...
బండ...
మావూరి కొండ" అన్నాడు. అవన్నీ గట్టివి గదా అందుకని.
"ఇదేందిరా వీడు... బాగున్నావా అంటే... రాయీ... బండ... మావూరి కొండ అంటాడు. వీనికేమయినా పిచ్చా" అనుకుంటా బావమరుదులు మట్టసంగా ఆన్నించి వెళ్ళిపోయినారు.
వాడు ఇంట్లోకి రాగానే వాళ్ళత్త ఎదురొచ్చి "ఏం నాయనా... బాగున్నావా... ప్రయాణమంతా సుఖంగా జరిగిందా" అని వలకరించింది. వాళ్ళనాయన అత్త పలకరిస్తే మెత్తని మాటలు మాట్లాడమన్నాడు గదా... అందుకని వాడు వెంటనే...
“దూది
వెన్న
దున్నపోతు పెండ" అన్నాడు. అవన్నీ మెత్తగా వుంటాయి గదా... అందుకని.
“ఇదేందిరా వీడు... బాగున్నావా అంటే.... దూది... వెన్న... దున్నపోతు పెండ అంటాడు. వీనికేమయినా పిచ్చా” అనుకుంటా అత్త మట్టసంగా ఆన్నించి వెళ్ళిపోయింది.
అంతలో మామ ఎదురొచ్చి “ఏం అల్లుడూ... బాగున్నావా... మీ అమ్మానాయనా అంతా ఎట్లా వున్నారు" అని పలకరించినాడు. వాళ్ళనాయన మామ పలకరిస్తే చక్కని మాటలు మాట్లాడమ న్నాడు గదా... అందుకని వాడు వెంటనే
“బొంగు
కవ్వం
మావూరి స్తంభం" అన్నాడు. అవన్నీ చక్కగా వుంటాయి గదా... అందుకని.
"ఇదేందిరా వీడు... బాగున్నావా అంటే బొంగు... కవ్వం... మావూరి స్తంభం అంటాడు. వీనికేమయినా పిచ్చా" అనుకుంటా కూతురి దగ్గరికి పోయి “ఏందే నీ మొగుడు... మేమొకటి అడుగుతా వుంటే... వాడొకటి మాట్లాడా వున్నాడు. ఏమయిందే వానికి" అని అడిగినాడు. అప్పుడామె జరిగిందంతా చెప్పింది.
మామ వాని అమాయకత్వానికి జాలిపడి వాన్ని పిలిచి "ఒరే... అల్లుడూ... మెత్తని మాటలు మాట్లాడడమంటే మంచిగా మాట్లాడడం... చక్కని మాటలు మాట్లాడడమంటే ఇంపుగా మరలా మరలా వినాలనేటట్లుగా మాట్లాడడం... గట్టిమాటలంటే మాటకు మాట జవాబివ్వడం... అంతే గానీ... రాయీ, దిండు, బొంగూ, కవ్వం కాదు" అని చెప్పినాడు.
**********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి