కోటి రతనాల వీణ
ఇది తెలుగు సీమ
నవ్య నవనీత లేమ!
కాకతీయుల నాటి
కళల కాణాచి
కదనాన రణరంగ నినదాల కోటి
మ్రోగింది తెలగాణ రా!
తెలుగు జోదులకు నెలవైంది రా! తెలంగాణ
రామప్ప గుడి లాంటి
రాతి బొమ్మల పేట
రతనాలు రాల్చేటి
హైటెక్కు కోట
యాదాద్రి భోనగిరి
వెములాడ రాజన్న
ఓరుగల్లు కోట
కొలనుపాక పేట గుడులల్లొ గడులల్లొ
కళలెన్నొ పండించి
కళలకు నెలవాయె రా! తెలగాణ
కామితార్థిగ నిల్చెరా! తెలగాణ
అందాల పరగాణ
మనంతగిరి కోన
అద్వైత భావాల్లొ
ముంచేటి సిరి కోన
ఆధ్యాత్మికతనిచ్చి
ఆనంద మందించు
అభ్యుదయ పరగాణరా! తెలగాణ
ఆనంద సమహభావనా!!
తెలగాణ
అడవి సంపద సిరులు
అదిలాబాదడవులు
ఇమ్మై నిలిచేటి
ఖమ్మము కోటలు
అభయహస్తములిచ్చి
ఆనంద పరిచేను
ఆకలన్నవాని
కన్న మందిచి
అతిథి ఆభ్యాగతుల నాదరించిననేల
మెతుకు సీమై వెలిగెరా!
తెలగాణ
మేరు నగధీరాయెరా తెలగాణ!!
రంగు రుచి వాసనలు
లేనట్టి నీరులా
స్వచ్ఛతకు సాక్షిగా
నిలిచిన నేలరా
నడుమంత్ర సిరులతో
నటనలాడని తీరు
నాణ్యమైన జీవనము
నాజూకు తనము
నవనీత సమసీమ రా!
తెలంగాణ.!
నవ్వులకు తావాయెరా!
తెలగాణ
పరుల సొమ్ములను
పాములా చూచును
పరమత సహనమ్ము
పక్కాగ పాటించె
స్వచ్ఛమానస సీమరా!
తెలంగాణ
సవ్యసాచై వెలుగురా!
తెలంగాణ
అలనాటి పండితుల
అమిత పాండితి గరిమ
నవరసభరితంగ
నటియించె నాట్యమై
జానపద గీతాల
జనగీతసారమై
కలము హలముల తోటి
బలము చూపిన స్వేత
సహజ పాండితి చాటెరా!
తెలగాణ
సంగీత స్వర వీణరా!!
తెలంగాణ!!
రైతు రాజ్యమునేలి
రతనాలు పండించె
చేతివృత్తుల తోటి
చేరువై వెలుగొందె
పరిశ్రమలు పెట్టి
ప్రగతినే సాధించె
అలనాటి తెలగాణ రా
ఇలలోన వర్ధిష్ఠిరా!!
తెలంగాణ.
రాళ్ళల్లొ రతనాల
నేరి చూపిన వారు
కార్వానుకంసాలుల
కమనీయ పనినేర్పు
కార్మిక సోదరులై
అలరారెను నాడు
కోహినూరు లాంటి
వజ్రాల రాశులకు
మెరుగులద్దిన
మేటిరా! తెలగాణ
కోటి వజ్రపు పేటిరా తెలంగాణ!!
గొల్లలాడిన నేల
గోలకొండ ఖిల్ల
చుట్టునున్నపిల్ల
వాగులెన్నో కలిసి
ఈసిమూసీ నదులుగా మారి గండిపేట హిమ
సాగరాలై విలసిల్లె
గొలుసుకట్టు చెరువులు
గొప్పగా ఉండేవి
రైతు కళ్ళలొ పండు
వెన్నెలలు కాచేవి
చెరువులై విలసిల్లెరా!
తెలగాణ
దాహార్తినే దీర్చె రా!!
తెలంగాణ
పల్లెలన్నీ పోయి
పట్టణాలుగ మారి
ప్రకృతి అందాలు
పరుస వేదిగమారె
చెరువు కుంటలు ఎండి
కరువు కుంపట్లాయె
చేనుచెలకలన్ని
కాంప్లెక్స్ మయమాయెరా!
తెలగాణ
రియెలెస్ట్ దందాయెరా!!
తెలగాణ
పల్లెల తెలగాణ మారె
పొలిమేరకవతాలాయె .
బలవంతులైనట్టి
భూస్వామ్య పోరులో
బలిపుష్టమైనట్టి
బలహీనులెందరో
బతుకు గోసను వీడి
బరిగీసి పోరాడి
గెలిచింది తెలగాణరా!నాడు
గెలుపుకే మలుపాయెరా!! నేడు
జయశంకరు సారు
జయ గీతి పాడంగ
మారోజు వీరన్న
పోరాడి గెలువంగ
శ్రీకాంతచార్యుల
ప్రాణాల త్యాగంతొ
వందల జీవులును
బలిగొన్న యుద్ధంలొ
తొలి విడత మలి విడత
తెలగాణ పోరులో
వీరుల ప్రాణాలు
హారతిగ మారగా
వేకువై వచ్చింది రా!! తెలగాణ
వెలుగు రేఖయైసాగిందిరా !! తెలగాణ
అలనాటి వీరుల
త్యాగాల ఫలితమే
వెలిగింది తెలగాణ
వెయ్యేళ్ళ కాలమై
ఆనాటి త్యాగాల
గానాలు పలికగా
సరికొత్త రాగాల
తెలగాన పాడెను
బాహుబలి రూపంగ
బహుజన రాజ్యంగ
బలహీన వర్గాల
బతుకులే మెరువంగ
వెలుగులకె వెలుగాయెరా తెలగాణ
తొలిపొద్దుపొడుపాయెరా!
తెలగాణ
జయము తెలంగాణకూ
జోహార్లు అమరులకునూ
జై తెలంగాణ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి