నమస్కారం ప్రాముఖ్యత--: సి.హెచ్.ప్రతాప్
 నమస్కారం అనే  పదము నమస్సు నుండి ఉద్భవించింది. నమస్సు లేదా " నమః " అనగా "మనిషిలో గల ఆత్మ"ను గౌరవించుట అని అర్ధం.
నమస్కారం అనేది మనిషి యొక్క సంస్కారానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇతరులు పెట్టే  నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం మానవుని సంస్కారం. మనం తోటివారికి నమస్కరించేటప్పుడు అది సంస్కారవంతంగా ఉండాలి. మనల్ని ఎదుటివారు ఎంతగా గౌరవించారో, వారిని అంతకు మించి గౌరవించని పక్షంలో ఆ నమస్కారం తిరస్కారానికి ప్రతీకగా భావం వస్తుంది.
అప్లాయుష్కుడైన మార్కండేయుడు తన రాజ్యంలో అందరికీ పాదాభివందనం చేస్తూ సాగిపోయిన అతణ్ని వారందరూ 'దీర్ఘాయుష్మాన్‌ భవ' అని దీవించారు. అలా నమస్కారాలు చేయడం ద్వారా అందరి ఆశీస్సులూ పొందిన మార్కండేయుడు అంతిమంగా దీర్ఘాయుష్మంతుడైనాడు అని ఒక కధ ప్రాచుర్యంలో వుంది.
మన దైనందిన సంప్రదాయంలో నమస్కారానికి ఎంతో ప్రాముఖ్యత వుంది. మనుష్యులకు నమస్కరించేప్పుడు కుడిచేయిని ఎడమచెవికి, ఎడమచేయిని కుడిచెవికి చేర్చి ప్రవర చెప్పాలి. దేవతలకు నమస్కరించాల్సివస్తే ఎడమచేతిని ఎడమచెవికి, కుడిచేతిని కుడిచెవి వెనక్కి చేర్చి ప్రవర చెప్తారు.
నమస్కారం వంటి తారక మంత్రం ఇంకొకటి లేదు. శత్రువు యొక్క శత్రుభావాన్ని సమూలంగా పోగొట్టగల శక్తి ఈ నమస్కారానికి ఉంది. నమస్కారంతో సకలార్థసిద్ధిని పొందవచ్చు.
నమస్కారం వలన దైన్యభావం అలవడతాయి. దీనిచే మనలోని అహంకారం తగ్గుతుంది.
నమస్కారం చేసినప్పుడు చేతులు జోడిస్తాం. అవి హృదయానికి దగ్గరగా నిలుస్తాయి. అది సమర్పణకు ప్రతీక. ఆ సమర్పణతో, గుండెపై ఒత్తిడితో పాటు అహమూ తగ్గుతుంది. అది ఒక ఆరోగ్యకరమైన చర్య అని యోగ సూత్రాలలో తెలియజేయబడింది

కామెంట్‌లు
నమస్కారం యొక్క ప్రాముఖ్యతను సంస్కారవంతమైన లక్షణంగా చక్క వివరించారు. అభినందనలు