సుందరకాండ ప్రాశస్త్యం;- సి.హెచ్.ప్రతాప్
 సుందరే సుందరో రామః సుందరే సుందరీకథా
సుందరే సుందరీ సీతా సుందరే వనం
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిః
సుందరే సుందరం మంత్రం సుందరే కింన సుందరమ్
శ్రీమద్రామాయణంలోని సుందర కాండ గురించిన సుప్రసిద్ధ చెందిన శ్లోకమిది. వాల్మీకి రామాయణంలో సుందరకాండకే ఎందుకు అంత ప్రాముఖ్యముందనే ప్రశ్నకు సమాధానం ఈ శ్లోకం చెబుతుంది.
రామాయణం ఆదికావ్యంలో మొత్తం ఏడు కాండలు వుండగా ఆ ఏడింటిలో విశిష్టమైనది సుందరకాండ. ఆంజనేయుడు సముద్రాన్ని దాటి లంకను చేరుకుని, సీతను వెతికి, కనుక్కుని తరువాత లంకను దహనం చేసి, సీత ఎక్కడుంది అనే విషయాన్ని రాముడికి తెలియజెప్పడం ఈ సుందరకాండ సారాంశం. రామాయణం అంతా రాముడి గురించి అయితే, సుందరకాండ ఆంజనీయుడి అద్భుత విన్యాసాన్ని కళ్ళ ముందు ఉంచుతుంది.అయితే సుందరకాండ పారాయణ వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు తొలగిపోతాయని అందరి నమ్మకం. ఈ నమ్మకాన్ని అనుసరించి ఇప్పటికీ అశేష భక్త జనం ఈ అపూర్వ ఘట్టాని చిత్తశుద్ధితో, పవిత్రమైన హృదయంతో, భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తున్నారు.  సుందరకాండలో ప్రతిపదం, ప్రతి శ్లోకం, మంత్రబద్ధమై ఉంటుంది. అందుకే సుందరకాండను  భక్తితో చదివినా, విన్నా, నిత్యం పారాయణం చేసినా, ప్రవచించినా, బాధలు కష్టాలు తొలగిపోతాయి. రోగాలు  నయమౌతాయి, భయాలు పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది.  మృత్యు భయం పోతుంది. సుందరకాండ చదివేచోట రాముడు ఎల్లప్పుడూ ఉంటాడు, అలాగే రాముడి గురించి పూజలు జరిగేచోట హనుమంతుడు ఉంటాడు. కాబట్టి సుందరకాండ నిత్య మననం లేదా పారాయణం ఎంతో శ్రేష్టం. మన వేదశాస్త్రాలు  మొత్తం కేవలం ధైర్యం, సంకల్ప బలం గురించి మాత్రమె చెబుతాయి. వాటిని లోతుగా విశ్లేషిస్తే మూఢనమ్మకాలను ఎప్పుడు ప్రోత్సహించలేదు. దైవం మీద భారం వేసి త్రికరణ శుద్ధిగా మనం ప్రయత్నిస్తే తప్పక విజయం సాధిస్తాం. ఎప్పుడైనా కొంత మనకు నమ్మకం సన్నగిల్లినప్పుడు, ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితం రానప్పుడు పెద్దలు సుందరకాండ పారాయణం చెయ్యమంటారు.
ఆ మంత్రరాజ ఫలితంగా ఆధిదైవిక అడ్డంకులు ఏమున్నాయో అవి తొలగిపోతాయి. ఆ ఘట్టాలు మనం పూర్తిగా చదవడం వలన తత్త్వం బోధ పడి, మనమీద మనకు నమ్మకం కుదిరి మన ప్రయత్నాలను మరింత జాగ్రత్తగా పదును పెట్టి ముందుకు వెళ్లి విజయాన్ని సాధించగలుగుతాము. 

కామెంట్‌లు