కొండల మధ్యలో ఉండే సిరికోన అనే ఒక చిన్న పల్లెటూరులో లక్ష్మీ,రంగయ్య అనే భార్య భర్తలు నివసించేవారు.
వారు వ్యవసాయం చేస్తూ జీవించేవారు.
ఆ ఊరిలోని వారికి వ్యవసాయ పనులు చేయడం తప్ప చదువుకోవడం తెలియదు.పంటలు పండగా వచ్చిన డబ్బులు సరిపోక, పేదరికంతో బాధపడేవారు.రంగయ్య,లక్ష్మీలకు ఇద్దరు పిల్లలు రాము,మంగ.వీరికి వయసులో చాలా నాలుగు సంవత్సరాల తేడా ఉండేది.వారిని ఉరికి దూరంగా ఉన్న ప్రభుత్వ బడిలో చదివించేవారు. ఊరి నుండి బడికి ఇద్దరు పిల్లలు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు.అందరూ వాళ్ళను చూసి ఎగతాళి చేసేవాళ్ళు.కానీ వాళ్ళ నాయనమ్మ బాగా ప్రోత్సహించేది.
రాము చదువులో ఎప్పుడు మొదటి స్థానంలో ఉండేవాడు.చాలా మంచి గుణం కలిగి ఉండేవాడు. కానీ ఇంట్లో వారు పరిస్థితుల ప్రభావం వలన రాముకు బాల్య వివాహం చేశారు.వ్యవసాయం ద్వారా వచ్చే సంపాదన సరిపోక ఉపాధి కోసం రాము కొన్ని సంవత్సరాల తర్వాత తన భార్యతో కలిసి పట్నం వెళ్ళాడు.ఇంటికి పెద్దవాడు పట్నం వెళ్లడంతో ఇక
చేసేదేమీ లేదని రంగయ్య మళ్ళీ వ్యవసాయ పనులకు వెళ్ళ సాగాడు.తన భార్య లక్ష్మీ రోజు కూలి పనికి పోయేది. మంగ ఆలనా పాలనా వాళ్ళ నాయనమ్మ రమణమ్మ చూసుకునేది.ఆమె దగ్గర అనేక విషయాలను,మంచి చెడులను గురించి తెలుసుకునేది.మంగ వారింట్లో పరిస్థితులు చూసి చాలా బాగా చదువుకునేది.
చదువుకుంటే జీవితాలు బాగుపడతాయని తెలుసుకుంటుంది.
పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా వారింట్లో డబ్బులు ఉండేవి కాదు.మంగ వాళ్ళ నానమ్మ తన పెన్షన్ పైసలతో తన అవసరాలన్నీ తీర్చేది.పుస్తకాలు,బట్టలు కొనిచ్చేది. మంగ పట్టుదలతో చదువుకునేది.సాయంత్రం వాళ్ళ నాయనమ్మ మంగకు మంచి మంచి కథలు చెప్పేది.బాగా చదువుకొమ్మని ప్రోత్సహించేది.నానమ్మ చెప్పే కథల నుండి అనేక నీతులు తెలుసుకునేది.ఆ అమ్మాయికి ఏదైనా సాధించి తన కుటుంబానికి ఆసరాగా ఉండాలని అనుకునేది.కష్టపడి చదివేది.పాఠశాలకు ఒక్కరోజు కూడా తప్పకుండా వెళ్ళేది.ఉపాధ్యాయులు మంగను బాగా ప్రోత్సహించే వారు.ఆట పాటలల్లో కూడా చురుగ్గా పాల్గొనేది.పాఠశాల చదువుల తర్వాత
ఆ ఊరి నుండి పట్నం వెళ్ళి చదువుకున్న మొదటి అమ్మాయి మంగ.ఊరి వాళ్ళందరూ ఆడపిల్లకు చాడువెందుకాన్ని,పెళ్లి చెయ్యమని రంగయ్యతో అంటారు.కానీ మంగ వాళ్ళ నాయనమ్మ కొడుకుకు నచ్చచెప్పి మనవరాలును పట్నం పంపిస్తుంది.నాయనమ్మ ప్రోత్సాహంతో మంగ బాగా చదువుకుంటుంది.
కొన్ని సంవత్సరాల తర్వాత ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తుంది.వాళ్ళ అన్నకు కూడా ఆర్థికంగా సహాయం చేసి మంచి ఉపాధిని చూపిస్తుంది.ఆ ఊరిలో వారందరు మంగను మెచ్చుకుంటారు.రంగయ్య, లక్ష్మీ చాలా అదృష్ట వంతులని పొగడుతారు.
అలాంటి కూతురు లేదని బాధపడతారు.ఆ రోజు నుండి ఆ ఊరిలోని ప్రజలందరూ తమ పిల్లలను తప్పకుండా చదించాలని నిర్ణయించుకుంటారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి