నలభీమపాకం
-------------------
మనం తినే పదార్ధాలు రుచికరంగా ఉంటే వాటిని వండిన వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. అలాగే పూర్వ కాలంలో రుచి కలిగిన పదార్ధాలు తిన్నవారు వాటిని నలాభీమ పాకం అని మెచ్చుకునే వారట. ఇప్పటికి కూడా వంట రుచిగా వున్నప్పుడు వాటిని నలభీమపాకం అంటూ పొగడటం మనం వింటూనే ఉన్నాము. ఈ నలభీమపాకం అనే నానుడి పురాణ కథలలో ఉన్న నలుడు, భీముడు అనే పురాణ పురుషుల నుండి ఉద్భవించింది. వీరిద్దరూ పాకశాస్త్రంలో ప్రవీణులు. వీరు వండిన వంటరుచి అద్భుతంగా ఉంటుంది. అందుకే రుచి కరమైన వంట తిన్నప్పుడల్లా " అబ్బా! నలభీమపాకంలా ఉంది" అంటూ ఉంటాం. ఆ కథ ఏమిటో చూద్దాం.
నలుడు ఒక రాజు. అతడి భార్య దమయంతి. ఆమె నలుడిని స్వయంవరంలో వరించింది. కలి అనే ఆయన నలుడిని నానా తిప్పలు పెట్టాడు. రాజ్యంలో నుండి వెళ్లగొట్టాడు. నలుడు భార్యను తీసుకుని అడవిలో ఆశ్రయం పొందాడు. కొన్నాళ్లకు భార్యను కూడా వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. పిచ్చివాడుగా, బికారిగా అడవిలో తిరుగు తున్నాడు. ఆ సమయంలో మంటలో చిక్కుకుని అల్లాడి పోతున్న *కర్కోటకుడు* ( కర్కోటకుడు అనే 13 వ నానుడి కథని చూడండి) అనే పామును కాపాడాడు. చేసిన మేలును మరచి ఆ పాము నలుడిని కర్కశంగా కాటేసింది. పాము విషానికి నలుడు కురూపిగా మారాడు. బాహుకుడు అనే మారుపేరు పెట్టు కున్నాడు. ఋతువర్ణుడు అనే రాజు కొలువులో వంటవాడుగా చేరాడు. దేవతలు ఇచ్చిన వరాలు వల్ల బాహుకుడు బహు రుచిగా వంటలు వండగలిగాడు. రాజు మెప్పు పొందాడు.
అలాగే భీముడు కూడా. పాండవులలో రెండో వాడు భీముడు. బహు బలవంతుడు. పాండవులు కౌరవులతో జూదం ఆడి ఓడిపోయారు. వారు పెట్టిన షరతులు ప్రకారం అరణ్యంలోకి వెళ్లిపోయారు. అరణ్యవాసం ముగిసిన తరువాత అజ్ఞాతవాసంలో విరాటు రాజు కొలువులో చేరారు. వారంతా మారువేషంలో మారుపేర్లతో వున్నారు. భీముడు వలలుడిగా పేరు మార్చుకున్నాడు. వంటవాడుగా మారాడు. రుచిగా వండేవాడు. అంత రుచిగా మరెవరూ వండలేనంతగా పేరు తెచ్చుకున్నాడు.
పురాణ పురుషులైన వీరిద్దరి వంటలు " ఆహా! ఏమి రుచి " అనిపించేవి. అందుకే రుచికరమైన ఏ పదార్ధాలు తిన్నా ఈ నలుడు, భీముడు గుర్తుకు వస్తారు. అందువల్ల ఈ *నలభీమపాకం* నానుడి పుట్టింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి