నానుడి కథలు ౼ డా.దార్ల బుజ్జిబాబు

 కాకి లెక్కలు
---------------
కాకి లెక్కలు  అనే ఈ నానుడి జనం వాడుక నుండి వచ్చింది. తమ లెక్క తప్పని తెలిసినా, తికమక పెడుతూ వివరించి సమర్ధించుకోవడానికి ప్రయత్నిస్తే  అలాంటి లెక్కలను కాకిలెక్కలు అంటుంటారు.  వారు చెప్పేది తప్పుకావొచ్చు లేదా ఒప్పుకావొచ్చు. కానీ అది ఒప్పే అని చెప్పటానికి ప్రయత్నం చేసేటప్పుడు, వినేవారు వారు  తప్పు అనుకున్నప్పుడు ఈ *కాకి లెక్కల* నానుడి వాడుతుంటారు. దీనికో కథ ఉంది. ఈ కథ నుండే ఈ నానుడి ఆవిర్భవించి వుండవొచ్చు.
     పూర్వం అక్బర్ అనే చక్రవర్తి ఉండేవాడు. అతడి మంత్రి బీర్బల్. బీర్బల్ చాలా తెలివైనవాడు.  దేన్నైనా తన తెలివితేటలతో ఇట్టే తేల్చి చెప్పేవాడు. తన శక్తి యుక్తులతో చక్రవర్తిని మెప్పించేవాడు. ఎన్నో వింత సమస్యలకు చమత్కారంగా పరిష్కారాలు చూపేవాడు.
   ఒక రోజు  రాజు మంత్రి కలిసి విహారానికి వెళ్లారు.  ఆ సమయంలో ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో  కాకుల గోల ఎక్కువైది.  కర్ణ కఠోరంగా ఉన్న ఈ కాకి గోలను విన్న చక్రవర్తి  ప్రక్కనే ఉన్న బీర్బలతో "అమాత్య!  మన రాజ్యంలో మొత్తం ఎన్ని కాకులు వుంటాయంటావ్?" అని అడిగాడు. బీర్బల్ విస్తుపోయాడు. కాకుల లెక్క చెప్పటం సాధ్యమేనా? అయినా బీర్బల్ తడుముకోకుండా 1,23,456 అన్నాడు 
     రాజుకు ఆశ్చర్యం కలిగింది. "లెక్కను అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు?" అని అడిగాడు. "కావాలంటే లెక్క పెట్టించండి" అన్నాడు బీర్బల్. ఎలాగూ లెక్క తేలదని తెలుసు కాబట్టి. "ఒక వేళ నీ లెక్క కంటే ఎక్కువ ఉంటే?" అడిగాడు అక్బర్.  "ఎట్టి పరిస్థితిలోనూ ఉండవు. వేరేదేశం కాకులు వచ్చి కలిస్తే తప్ప" అన్నాడు బీర్బల్ తనను తాను సమర్ధించుకుంటు.
      అక్బర్ కు నవ్వొచ్చింది. దాన్ని ఆపుకుంటూ  "మరి తక్కువవుంటే?" అన్నాడు. "మన దేశపు కాకులు పొరుగు దేశాలలో ఉన్న తమ చుట్టాల వద్దకు వెళ్లి వుండవొచ్చు" అన్నాడు బీర్బల్. రాజు పెద్దగా నవ్వాడు. బీర్బల్ సమర్ధతను  ఎంతగానో మెచ్చుకున్నాడు. ఇదీ కాకి లెక్కల కథ. ఇలా ఊహించుకుంటూ, ఆ ఊహను సమర్ధించుకుంటు, సమయ స్పూర్తితో,   ఖచ్చితంగా చెప్పే లెక్కలనే కాకి లెక్కలు అంటారు. 
కామెంట్‌లు