నా చేతిరుమాలు
నా చేతికి గర్వంగా గౌరవాన్నిస్తుంది
నా ఆవేశ కావేశాలకు
నోట్లో పళ్ళకింద నలిగిపోతుంది
నా సుఖదుఃఖ భారాన్ని
మౌనంగా మోస్తూ
నా కన్నీటి సుడులను కట్టివేస్తుంది
నా గుండె గొంతుకలోన
కొట్లాడినపుడు
శబ్దాల ముఖద్వారాన్ని మూసేస్తుంది
నేను శ్రమిస్తున్నపుడు
చిందిన స్వేదాన్ని
టిష్యు పేపర్లా చప్పరిస్తుంది
నేను అల్లరి చిల్లరగా అంటించుకున్న
దుమ్మునీ, ధూళినీ, మరకనీ, బురదనీ
తన జిహ్వాగ్రాలతో నాకి వేస్తుంది
నాకు మార్కెట్లో
కూరలతట్టై, పూలబుట్టై సహకరిస్తుంది
నాకు గుడిలో
ప్రసాదపుసజ్జె ఒదిగిపోతుంది
నాకు సదా
ఎండకు వానకు గొడుగై
తోడూ నీడై ఉంటుంది
నా రంగు తెలిసినా, గుణం తెలిసినా
తాను మాత్రం మౌనసాక్షిలా
మౌనిలా అలా ఒదిగిపోతుంది!!
.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి