సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -218
రాజానుసృత వివాహ ప్రవృత్త భృత్య న్యాయము
******
రాజానుసృత అంటే రాజును అనుసరించుట అని అర్థం.వివాహ అంటే వివాహము లేదా పెళ్ళి.ప్రవృత్త అంటే ప్రారంభించబడినది లేదా నెలకొన్నది అని అర్థం.భృత్యుడు అంటే సేవకుడు, దాసుడు.
రాజానుసృత అంటే రాజును అనుసరిస్తూ  రాజు వెంట పెళ్ళికి వెళ్ళే సేవకులు కూడా గౌరవింపబడతారు అనే అర్థంతో ఈ "రాజానుసృత వివాహ ప్రవృత్త భృత్య న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
ఈ న్యాయము చూడటానికి చాలా పెద్దదిగా అనిపిస్తుంది కానీ అర్థం మాత్రం కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగానే  వుంటుంది!
అలా ఎందుకు అన్నానంటే ఈ న్యాయములోని  సంఘటనలను , వారి వారి ప్రవర్తనలను, పొందే మర్యాద మన్ననలను నిత్య జీవితంలో ఎన్నో చూస్తూ ఉంటాం మరి.
 ఓ ఉదాహరణ చూద్దాం...రాజకీయ నాయకుడో, ఓ పేరున్న నటుడో,మరే రంగంలోని పేరొందిన వ్యక్తో పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు, సభలకు సమావేశాలకు వెళ్ళేటప్పుడు లేదా వచ్చేటప్పుడు వారితో మరికొంత మంది అనుయాయులు, అనుచరులను  కూడా తీసుకుని వస్తూ వుంటారు.అలా తీసుకుని వచ్చిన సదరు ముఖ్యమైన వ్యక్తికి చేసే గౌరవమర్యాదలు,  సదుపాయాలు, భోజనాదుల విషయంలో చేసే ఏర్పాట్లు అన్నీ ఆ ప్రముఖ వ్యక్తితో పాటు కలిసి వచ్చిన వారు కూడా  పొందుతూ వుండటం చూస్తుంటాం.
 
 ఇక సత్పురుషులు, సజ్జనుల విషయంలో సరేసరి. వారితో బాటూ వారిని అనుసరించిన వారు కూడా "పూలదండలో  దారం" వలె గౌరవింపబడతారు.
అలాగే దైవత్వానికి, మనం కొలిచే దైవాలకు వర్తింపజేసి చూసినట్లయితే.. ఈశ్వరుడు లేదా శివుడితో పాటు ఆ శివుని శరీరముపై ఉన్న నాగుపాములు కూడా భక్తుల పూజలు అందుకుంటాయి. మానవులే కాకుండా శివుని ఇతల దేవతల కూడా  పూజిస్తారు కాబట్టి వారి మ్రొక్కులు కూడా అందుకుంటాయి.
మరోసారి  మన  సమాజాన్ని పరికించి చూద్దాం.
 కొందరు చోటా నాయకులు పేరున్న నాయకులతో తిరిగి మోటా నాయకులుగా తయారయ్యేది  ఇలాగే మరి.
పెద్ద పెద్ద వాళ్లతో తిరుగుతూ నెమ్మదిగా తమ ప్రాపకాన్ని పెంచుకున్న వారిని చాలా మందిని  మనం చూశాం.
ఇటు మానవులకూ అటు దేవతలకూ వర్తింప చేసే విధంగా ఈ "రాజానుసృత వివాహ ప్రవృత్త భృత్య న్యాయము"ను  సందర్భానుసారంగా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.అంతే కదండీ!
ప్రభాత కిరణాల నమస్సులతో

కామెంట్‌లు