అంతా దైవాధీనం
------------------------
గజకర్ణ, గోకర్ణ నానుడి కథ లాగానే ఈ దైవాధీనం అనే పదం వాడుక కూడా ఓ ప్రాచుర్యం పొందిన చందమామ కథల నుండే వచ్చి వుండవొచ్చు. ఈ కథ ప్రజల నోళ్ళలో నానుతూ నానుతూ నానుడి కథగా మారిపోయింది. ఏదైనా దేవుడు దయ మీదనే లభిస్తాయి తప్ప నరుల దయమీదనో, లేదా రాజుల దయమీదనో లభించవు అనే నీతిని తెలిపే కథే అంతా దైవాధీనం అనే నానుడి రావడానికి కారణం అయింది. ఆ కథ ఏమిటో చూద్దాం.
ఒక రాజ్యంలో ఇద్దరు బ్రాహ్మణులు వుండేవారు. వారు నిరుపేదలు. ఒకడు నరులపై, రాజుపై ఆధారపడితే, మరొకడు కేవలం దేవుడు మీదనే ఆధారపడి జీవిస్తూ వున్నారు. ఒకరోజు వీరిద్దరూ రాజు వద్దకు వెళ్లి తమ పేదరికపు గోడు చెప్పుకున్నారు. వారిలో ఒకడు "అయ్యా! అంతా రాజాధీనం నాకు ఏదైనా సాయం చేయండి స్వామి" అని వేడు కున్నాడు. రెండో వాడు "అయ్యా! అంతా దైవాధీనం. ఏదైనా సాయం చేయండి" అని అడిగాడు. రాజుకు రెండో బ్రహ్మణునిపై కోపం వచ్చింది. వాడిని భటులతో బయటకు పంపాడు. మొదటి బ్రహ్మణునికి ఓ గుమ్మడికాయ ఇచ్చి పంపాడు.
మణులు, హారాలు ఇస్తాడాని ఆశ పడిన రెండో బ్రాహ్మడు ఆ గుమ్మడి కాయను చిల్లర కొట్టు చిట్టెమ్మకి ఇచ్చి ఆ రోజుకు సరిపడా బియ్యం తీసుకుపోయాడు. అదే సమయంలో ఓ దొంగ చిట్టెమ్మను బెదిరించి ఆ రోజు కూర కోసం గుమ్మడికాయను పట్టుకుపోతాడు. బ్రహ్మణును బయటకు పంపి తిరిగి వస్తున్న భటులను చూసి దొంగ గుమ్మడికాయను వదిలేసి పారిపోయాడు.
బయటకు నెట్టివేయబడి, ఊసూరు మంటూ వెళుతున్న దైవాధీనం బ్రాహ్మణుని వెనక్కు పిలిచి భటులు ఆ గుమ్మడి కాయను ఇచ్చారు. ఈ రోజుకి ఇదే ప్రాప్తం అని కళ్ళకు అద్దుకుని 'అంతా దైవాధీనం' అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంటికీ వెళ్లి వంట చేయమని గుమ్మడికాయను భార్యకి ఇచ్చాడు. ఆమె కత్తిపీటతో గుమ్మడి కాయను కోయగానే దానిలో నుండి రత్నాలు, వజ్రాలు జలజలా మంటూ రాలి పడ్డాయి. బ్రాహ్మణుడు అంతా దైవా ధీనం అని వాటితో వాడి పేదరికం పోగొట్టుకున్నాడు. రాజాధీనం పొంది రాజుగారిచ్చిన వజ్రాల,రత్నాల గుమ్మడి కాయను కూడా పోగొట్టుకుని ఇంకా నిరుపేదగానే వున్నాడు రాజాధీనం బ్రాహ్మణుడు.
ఇది ఈ కథ. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. అందుకే ఎప్పుడు భగవంతునిపై నమ్మకం ఉంచి చేసే పనులు సఫలం అవుతాయి అని చెప్పటానికి ఈ కథను రాసి వుంటారు. అది కాస్త ఇప్పుడు మన నానుడి కథ అయింది.
('అంతా దైవాధీనం' అనేది నానుడి గా కాకుండా మామూలుగానే వాడి వుండవొచ్చు. ఈ కథ చందమామలో రాక ముందుకూడా ఈ పదం వాడి వుండవొచ్చు. దీన్ని 'నానుడికథ' గా పెడితే బాగుంటుందనే ఉద్దేశము తో ఈ నానుడి కథలలో చేర్చటం జరిగింది.)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి